ఫోటో స్టోరి: 'విశ్వంభర'లో గ్యాంగ్ లీడర్
ఈ సినిమా నుంచి విడుదలవుతున్న ప్రతి స్టిల్ మెగాభిమానులతో పాటు తెలుగు ప్రజలందరిలోను చర్చగా మారుతున్నాయి.;
మెగాస్టార్ చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ అభిమానుల్లో ఉత్సాహం పెంచుతున్నారు. 60 ప్లస్ వయసులోను ఆయనలోని ఎనర్జీ నేటితరం హీరోలకు స్ఫూర్తినిస్తోంది. అంతేకాదు ప్రస్తుతం నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ- విశ్వంభర కోసం మెగాస్టార్ మేకోవర్ సాధించిన విధానం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ సినిమా నుంచి విడుదలవుతున్న ప్రతి స్టిల్ మెగాభిమానులతో పాటు తెలుగు ప్రజలందరిలోను చర్చగా మారుతున్నాయి.
దానికి కారణం ఆయన 60 ప్లస్ ఏజ్‌లోను నవయువకుడిలా కనిపిస్తుండడమే. విశ్వంభర ప్రారంభమయ్యే క్రమంలోనే చిరు జిమ్ లో శారీరకంగా చాలా శ్రమిస్తున్నారని టాక్ వినిపించింది. ఆ కఠినమైన శ్రమ ఊరికే పోలేదు. అది సినిమాలోని ప్రతి ఫ్రేమ్‌లోను కనిపించనుందని తాజాగా రిలీజైన స్టిల్స్ చెబుతున్నాయి. మెగాస్టార్ ఎంతో యంగ్ గా కనిపించడమే కాదు.. తిరిగి గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు రోజుల్ని వెనక్కి తెచ్చారంటూ అభిమానులు ఖుషీ అయిపోతున్నారు. ప్రస్తుతం వెబ్‌లో షికార్ చేస్తున్న చిరు ఫోజ్ చూడగానే, `ఘరానా మొగుడు` తిరిగి వచ్చాడని `జగదేక వీరుడు..` వెనక్కి వచ్చాడని కాంప్లిమెంట్లు ఇస్తున్నారు. ఒక పాట మినహా చిత్రీకరణ పూర్తయిందని కథనాలొస్తున్నాయి. బింబిసార ఫేమ్ మల్లిడి వశిష్ఠ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమా తర్వాత చిరంజీవి- అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ జూన్ మొదటి వారంలో ప్రారంభం కానుంది. ఈ సినిమా చిత్రీకరణ స్టూడియో సెటప్‌లో కాకుండా, సుందరమైన గ్రామీణ నేపథ్యంలో జరుగుతుందని తెలుస్తోంది. ఈ చిత్రం సంక్రాంతి 2026కి విడుదల కానుంది. అనీల్ రావిపూడి మార్క్ కామెడీ ఎంటర్ టైనర్ ఇది. ఇందులో అదితీరావ్ హైదరీ, తమన్నా కథానాయికలుగా నటించే వీలుందని తెలుస్తోంది. అయితే చిత్రబృందం అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. గతంలో సంక్రాంతి కి వస్తున్నాం చిత్రంతో చార్ట్ బస్టర్ సాంగ్స్ అందించిన సంగీత దర్శకులు భీమ్స్ సిసిరోలియో, తమ్ముడు ఫేం రమణ గోగుల ఈ ప్రాజెక్ట్ కోసం సౌండ్‌ట్రాక్ కంపోజ్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.
చిరంజీవి గతంలో ఊరికి ఇచ్చిన మాట, పల్లెటూరి మొనగాడు, శివుడు శివుడు శివుడు, ఖైదీ, అల్లుడా మజాకా, ఆపద్బాంధవుడు, ఇంద్ర, సింహపురి సింహం వంటి గ్రామీణ నేపథ్య సినిమాల్లో నటించారు. అదే తరహా గ్రామీణ నేపథ్య సినిమాని అనీల్ రావిపూడితో ప్లాన్ చేయడం ఆసక్తిని కలిగిస్తోంది.