సిద్ధు ఇల్లు, స్డూడియోలు, కార్లు నాశనం

Update: 2015-12-08 09:30 GMT
చెన్నై వరద భీభత్సానికి నష్టపోయిన బాధితుల్ని ఆదుకునే విషయంలో సిద్దార్థ్ పది రోజులుగా పడుతున్న కష్టాన్ని సోషల్ మీడియా అంతా చూస్తోంది. అతణ్ని రియల్ హీరో అని కీర్తిస్తోంది. చెన్నై వరదలు ఇంత తీవ్ర రూపం దాల్చడానికి ముందు నుంచే అతను పరిస్థితి గురించి ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నాడు. నేషనల్ మీడియా ఈ విషయంలో చెన్నైని చిన్న చూపు చూస్తోందని.. పరిస్థితి ప్రమాదకరంగా ఉందని.. వాళ్లు ఈ వర్షం వార్తల్ని హైలైట్ చేస్తే కేంద్ర ప్రభుత్వానికి తీవ్రత తెలుస్తుందని అతను 20 రోజుల ముందే మొత్తుకున్నాడు.

చివరికి సిద్ధు చెప్పిన దాని కంటే పరిస్థితి దారుణంగా మారింది. వరద భీభత్సానికి నిలువ నీడ కోల్పోయి తిండి నీళ్ల కోసం అవస్థలు పడుతున్న సామాన్య జనాలకు తన స్నేహితులు, వాలంటీర్లతో కలిసి ఎంతో సాయం చేశాడు సిద్ధు. వేలాది మంది ఆహారం, నీళ్లు అందేలా చేశాడు. చెన్నై ఇప్పుడిప్పుడే కోలుకుంటుండటంతో సిద్ధు కూడా కొంచెం రిలాక్స్ అవుతున్నాడు.

ఈ సందర్భంగా సిద్ధు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి దారుణమైన పరిస్థితి కలలోనూ ఊహించలేదు. జీవితంలో తొలిసారిగా నేను నా ఇంటిని కోల్పోయాను. ఇల్లు చాలా దెబ్బ తింది. మూడు స్టూడియోలు, మూడు కార్లు కూడా వరదల కారణంగా పాడైపోయాయి. నా పరిస్థితే ఇలా ఉంటే ఒక్క రోజులో సర్వం కోల్పోయిన సామాన్యుల పరిస్థితి ఏంటి’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో బాధితులకు సాయం చేయడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు ముందుకు రావటం ఆనందంగా ఉందని..  ప్రస్తుతం బాధితుల కన్నా సాయం చేసేవారు ఎక్కువగా ఉండటం గొప్ప విషయమని.. ఇదంతా సోషల్ మీడియా వల్లే సాధ్యమైందని చెప్పాడు. ప్రభుత్వం పై వస్తున్న విమర్శలను సిద్దార్ధ్ ఖండించాడు. ఇలాంటి విపత్తు సంభవించినప్పుడు ఏ ప్రభుత్వమైనా అయిదు రోజుల్లో అంతా సరిచేసేయలేదని.. అందుకు సమయం పడుతుందని చెప్పాడు.
Tags:    

Similar News