రాజకీయం నా నుంచి దూరం కాలేదు: చిరంజీవి

Update: 2022-09-20 11:30 GMT
మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో కాస్త ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చినా.. తనదైన శైలిలో పోస్టులు పెడుతూ నెటిజన్లను ఆకర్షించారు. సినిమాల అప్డేట్స్ - తన వ్యక్తిగత సంఘటనలను పంచుకోవడానికి మరియు ప్రముఖులను శుభాకాంక్షలు చెప్పడానికి - పలు విషయాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి సోషల్ మీడియా వేదికలను ఉపయోగిస్తుంటారు. అయితే ఈరోజు చిరు తన ట్విట్టర్లో రాజకీయాల గురించి మాట్లాడుతూ ఓ వాయిస్ సందేశాన్ని పోస్ట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.

''నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను కానీ.. రాజకీయం నా నుంచి దూరం కాలేదు'' అని చిరంజీవి వాయిస్ మెసేజ్ లో పేర్కొన్నారు. ఇది నిమిషాల్లోనే వైరల్ గా మారింది. ఇప్పుడు సడన్ గా మెగాస్టార్ పాలిటిక్స్ గురించి మాట్లాడటం ఏంటని అందరూ ఆలోచించారు. సినిమాలో డైలాగ్ చెప్పారా? లేదా సమకాలీన రాజకీయాలపై స్పందించారా? అంటూ నెట్టింట చర్చ మొదలైంది. అయితే చిరు నటిస్తున్న ''గాడ్ ఫాదర్'' సినిమా విడుదలకు సిద్దమైన నేపథ్యంలో ఈ ఆడియోలో ఉన్న డైలాగ్ అయ్యుంటుందని అంటున్నారు. కాకపోతే ఈ ట్వీట్ కు ఎలాంటి హ్యాష్ ట్యాగ్ జోడించకపోవడం సందేహం కలుగుతోంది.

మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ''గాడ్ ఫాదర్''. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ కు ఇంకా రెండు వారాలే ఉండగా.. దూకుడుగా ప్రమోషన్స్ చేయడం లేదని మేకర్స్ పై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. సల్మాన్ ఖాన్ - చిరంజీవి కలిసి చేసిన 'తార్ మార్ తక్కర్ మార్' సాంగ్ సాంకేతిక సమస్యల కారణంగా వాయిదా పడటం వారిని తీవ్రంగా నిరాశ పరిచింది.

ఈ నేపథ్యంలో ఇప్పుడు చిరంజీవి పొలిటికల్ డైలాగ్ తో 'గాడ్ ఫాదర్' ప్రచారం మొదలు పెట్టారని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. అందులోనూ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ కావడంతో.. మెజారిటీ వర్గం సినిమా ప్రమోషన్ అని అంటున్నారు. ఏదేమైనా మెగాస్టార్ చెప్పిన పొలిటికల్ డైలాగ్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది. ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటోంది.

చిరంజీవి రాజకీయ జీవితం విషయానికొస్తే.. 'ప్రజారాజ్యం' పార్టీ స్థాపించి 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేశారు. ఆ తర్వాత పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొన్నాళ్లు కేంద్రమంత్రిగా సేవలందించారు. అనంతరం రాజకీయాలకు దూరంగా ఉన్న చిరు.. 'ఖైదీ నంబర్ 150' తో మళ్లీ రీఎంట్రీ ఇచ్చి సినిమాలపై దృష్టి సారించారు. ఆ తర్వాత 'సైరా' 'ఆచార్య' వంటి సినిమాల్లో నటించారు. ఇప్పుడు 'గాడ్ ఫాదర్' సినిమాతో వస్తున్నారు.

కాగా, మలయాళ బ్లాక్ బస్టర్ 'లూసిఫర్' రీమేక్ గా ''గాడ్ ఫాదర్'' సినిమా తెరకెక్కింది. చిరంజీవి స్టార్ డమ్ ని దృష్టిలో పెట్టుకొని కథలో చిన్న చిన్న మార్పులు చేశారని తెలుస్తోంది. ఇందులో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ స్పెషల్ రోల్ చేయగా.. నయనతార - సత్య దేవ్ - సునీల్ - సముద్రఖని - తాన్యా రవిచంద్రన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్ మరియు సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్‌లపై ఆర్‌బి చౌదరి - ఎన్‌వి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. యూఏస్5థమన్ సంగీతం సమకూర్చారు. నీరవ్ షా సినిమాటోగ్రఫీ అందించగా.. సురేష్ సెల్వరాజన్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. 'గాడ్ ఫాదర్' సినిమా తెలుగు తమిళ భాషల్లో విడుదల కానుంది.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.



Full ViewFull View
Tags:    

Similar News