చిరు-పవన్.. విబేధాలు ఉష్ కాకి

Update: 2016-03-21 04:57 GMT
మెగా బ్రదర్స్ అయిన మెగాస్టార్ చిరంజీవి - పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ల మధ్య అనేక విబేధాలు ఏర్పడ్డాయంటూ బోలెడంత టాక్ ఉంది. 'మేం పిలుస్తాం - వాడు రాడు - మీరే వెళ్లి అడగండి ఎందుకు రాడో' అని మరో మెగా బ్రదర్ నాగబాబు ఫ్యాన్స్ ని అరవడంతో.. విబేధాల వార్తలు నిజమే అనిపించేసింది. కానీ సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో వేడుక.. చిరు - పవన్ ల మధ్య అనుబంధాన్ని, సాన్నిహిత్యాన్ని చాటి చెప్పింది.

'అన్నయ్య అలిసిపోయి నిద్రపోతే.. ఆయన కాలికి షూస్ - చెమటతో వాసన వచ్చే సాక్స్ నేను తీసేవాడిని. అది ఓ మనిషి కష్టంలో ఉండే సువాసన'.. ఇదీ పవన్ కళ్యాణ్ చెప్పిన మాట. ఈ ఒక్క మాట చాలు.. పవన్ తన అన్నయ్యను ఏ స్థాయిలో ఆరాధిస్తాడో చెప్పడానికి. ఇక చిరు రాగానే మనసారా ఆలింగనం చేసుకోవడం, పాలిటిక్స్ లో విబేధాలున్నా అన్నయ్య దేవుడే అని చెప్పడం.. బంధం వేరు, దారులు వేరు అని చెప్పడం చూస్తే.. పవన్ మనసులో చిరు స్థానం ఏ స్థాయిలో ఉందో అర్ధమవుతుంది.

'ట్యాలెంట్ ని హంట్ చేయడంలో  పవన్ చాలా ట్యాలెంటెడ్' అన్నారు మెగాస్టార్. 'తమ్ముడి లో పవన్ లో హ్యూమనిజం ఉంది.. హ్యూమర్ యాంగిల్ ఉంది అన్న చిరంజీవి... హీరోయిజానికి హ్యూమర్ జోడయ్యి, మాస్ తోడయ్యి.. ఎంటర్ టెయిన్ మెంట్ ఇవ్వగలుగుతున్నాడ'ని పవన్ ని పొగిడేశారు. పవన్ దాయిదాయి దామ్మా స్టెప్ కోసం మీతో పాటు అంతే ఉత్సాహంగా నేనూ ఎదురుచూస్తున్నా అన్న మెగాస్టార్.. రెండు మూడేళ్ల తర్వాత భవిష్యత్ నిర్ణయించుకోలేదంటూ.. సినిమాలు మానేస్తానని అనడం కరెక్ట్ కాదని హితవు పలికారు.

'మనసు లాగితే వెళ్లద్దని చెప్పడం లేదు.. వెళ్లు కానీ.. ఇక్కడా ఉండు. జోడు గుర్రాల స్వారీ చెయ్. నీ వెనక మేమున్నాం.. నా మాట కాదంటాడని అనుకోవడం లేదు' అంటూ.. పవన్ కు లాక్ వేసేశారు. ఇదంతా చూశాక కూడా.. ఇంకా చిరు పవన్ ల మధ్య విబేధాలున్నాయని ఎవరైనా అనుకుంటే.. వాళ్లను పిచ్చోళ్ల కిందే జమ కట్టాలి. మొత్తానికి అన్నాదమ్ములు ఒకే వేదికపై తమ ఆత్మీయతను ప్రదర్శించి.. అనుబంధాన్ని చూపించి.. విబేధాలకు, విమర్శలకు చెక్ పెట్టేశారు.
Tags:    

Similar News