దాసరి మరణంపై చైనా నుంచి చిరు

Update: 2017-05-31 04:16 GMT
దర్శకరత్న దాసరి నారాయణరావు ఆకస్మిక మృతిపై టాలీవుడ్ అంతా చిన్నబోయింది. ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అయిన దాసరిని కోల్పోవడాన్ని ఏ ఒక్కరు జీర్ణించుకోలేకపోతున్నారు. దర్శకుడిగా.. నిర్మాతగా.. కథ.. మాటలు.. పాటల రచయితగా.. నటుడిగా.. ఎన్నో విభాగాల్లో తన ప్రతిభను తెలుగు కళామతల్లి కోసం వెచ్చించిన బహుముఖ ప్రజ్ఞాశాలి దాసరి.

దాసరికి చిరంజీవితో ప్రత్యేక అనుబంధం ఉంది. ఇద్దరూ ఒకటే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం ఒక సారూప్యత అయితే.. కొన్ని విబేధాలు కూడా ఉన్నాయంటారు టాలీవుడ్ జనాలు. అయితే.. దాసరి మాత్రం చిరుపై ఎప్పుడూ తన ప్రేమను చూపేవారు. తన దర్శకత్వంలో 100వ చిత్రాన్ని లంకేశ్వరుడు పేరుతో చిరంజీవితోనే తీశారాయాన. వరుస ఫ్లాప్ లతో ఇబ్బంది పడ్డాక.. చిరు బౌన్స్ బ్యాక్ అయిన మూవీ హిట్లర్ లో.. హీరో తండ్రి పాత్రలో కనిపించారు. ఇంతకు మించిన ఆఫ్ స్క్రీన్ అనుబంధం వారి మధ్యన చాలానే ఉంది. ఇప్పుడు దాసరి మరణ సమయానికి చిరంజీవి చైనాలో ఉన్నారు.

'దాసరి గారి గురించి ఇప్పుడే వార్త విన్నాను. విపరీతంగా షాక్ కి గురయ్యాను. చివరగా ఆయనను కొన్ని రోజుల క్రితం తన పుట్టిన రోజున.. అల్లు రామలింగయ్య అవార్డ్ ఫంక్షన్ లో చూశాను.. మాట్లాడాను. ఆయన మరణం నాకు వ్యక్తిగతంగా కూడా తీరని లోటు. తెలుగు సినీ పరిశ్రమకు ఆయన సేవలు మరిచిపోలేనివి. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియచేస్తున్నాను' అంటూ చైనా నుంచి తన సందేశం పంపారు చిరంజీవి.

చిరుతో పాటు ఆయన తనయుడు రామ్ చరణ్ కూడా దాసరి మృతిపై స్పందించారు. చరణ్ ఏమన్నాడంటే..

‘‘తెలుగు చిత్ర పరిశ్రమకు పెద్ద దిక్కు దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణ రావు గారి మరణం యావత్ తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి కల‌గాల‌ని కోరుకుంటున్నాను’’
-రామ్ చ‌ర‌ణ్


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News