‘150’లోకి చిరు కూతురెలా వచ్చింది?

Update: 2017-12-17 11:03 GMT
మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత కాస్ట్యూమ్ డిజైనర్ అవతారమెత్తి ఇటు తండ్రి సినిమాలకు.. అటు తమ్ముడు చరణ్ సినిమాలకు పని చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ‘అందరివాడు’.. ‘శంకర్ దాదా’ సినిమాలకు కాస్ట్యూమ్స్ సమకూర్చిన ఆమె.. చాలా ఏళ్ల విరామం తర్వాత ‘ఖైదీ నంబర్ 150’తో రీఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రామ్ చరణ్ ‘ధృవ’కు పని చేసింది. ఇప్పుడు ‘సైరా నరసింహారెడ్డి’ లాంటి భారీ సినిమాకు సుష్మిత కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేస్తోంది. మరి ఇంతకీ ఆమె ఈ రంగంలోకి ఎందుకొచ్చింది.. మధ్యలో ఎందుకు బ్రేక్ తీసుకుంది.. ‘ఖైదీ నంబర్ 150’లో ఎలా అవకాశం వచ్చింది.. ఈ విశేషాలు ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. సుష్మిత ఏమందంటే..

‘‘నేను తొలిసారిగా ‘ఇంద్ర’ సినిమాలో రాధే గోవిందా పాటకు స్టైలింగ్ చేశాను. ఆ తర్వాత ‘అందరివాడు’.. ‘శంకర్ దాదా’ సినిమాలకు పూర్తి స్థాయి కాస్ట్యూమ్ డిజైనర్ గా చేశాను. ఐతే తర్వాత నాకు పిల్లలు పుట్టారు. బాధ్యతలు పెరిగాయి. దీంతో బ్రేక్ తీసుకున్నాను. ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్లయ్యారు. అలాంటి సమయంలోనే నాన్న ‘ఖైదీ నంబర్ 150’తో రీఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రానికి ముందు ముంబయి నుంచి షబీనా ఖాన్ అనే హై ప్రొఫైల్ డిజైనర్ వచ్చారు. ఆమె మంచి డిజైన్సే ఇచ్చినప్పటికీ నానన్న స్టైల్.. ఇమేజ్ గురించి ఆమెకు తెలియలేదు. ‘గ్యాంగ్ లీడర్’ లాంటి మాస్ సినిమాలు చూసిన వాళ్లకే ఆయనకు ఎలాంటి దుస్తులు సెట్టవుతాయో తెలుస్తుంది. అందుకే చరణ్ నన్ను అడిగాడు. అప్పుడు మా ఫ్యామిలీ పర్మిషన్ తీసుకోవాలి అన్నాను. మా అత్తామామలతో ఇబ్బందేమీ లేదు. చరణ్ వాళ్ల బావతో మాట్లాడి ఒప్పించి నాకు ఈ బాధ్యత అప్పగించాడు. ఈ సినిమా తర్వాత ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోలో కూడా నాన్నకు స్టైలింగ్ చేశాను. ఆపై ‘ధృవ’లో అవకాశం వచ్చింది. ఇప్పుడు ‘రంగస్థలం’కు చేస్తున్నా. ఈ సినిమాకు పని చేయడం గొప్ప అనుభవం. చాలా కష్టపడ్డాం. ఇక ‘సైరా’ లాంటి మెగా ప్రాజెక్టుకు పని చేయడం పెద్ద సవాలే. దీని కోసం చాలా రీసెర్చ్ చేస్తున్నాం’’ అని సుష్మిత చెప్పింది.
Tags:    

Similar News