నేను చేయాల్సిన సినిమా.. నా తమ్ముడు చేస్తున్నాడు: చిరంజీవి

Update: 2022-04-02 16:31 GMT
మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''టైగర్ నాగేశ్వరరావు''. ఇది రవితేజకు ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. స్టూవర్ట్ పురంలో పేరుమోసిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితాన్ని ఆధారంగా వంశీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఉగాది సందర్భంగా శనివారం హైదరాబాద్ లోని నోవాటల్ లో గ్రాండ్ గా లాంచ్ చేశారు. దీనికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి హీరోహీరోయిన్లపై క్లాప్ కొట్టి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా చిరు మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు..'టైగర్ నాగేశ్వరరావు' తాను చేయాల్సిన సినిమా అని.. కరోనాకు ముందే దర్శకుడు ఈ కథ చెప్పాడని.. అందులో ఇప్పుడు రవితేజ నటిస్తున్నాడని పేర్కొన్నారు.

''పాండమిక్ కు ముందు స్టూవర్టుపురానికి సంబంధించిన టైగర్ నాగేశ్వరరావు కథను దర్శకుడు వంశీ నాకే వినిపించాడు. చాలా బాగుంది. అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటుగా మంచి క్యారెక్టరైజేషన్ ఉంది. కానీ ఏదో కుదరక నేను చేయలేదు. చాలా మంచిదైంది. ఎందుకంటే ఇది రవితేజకు సరిగ్గా సరిపోతుంది'' అని చిరంజీవి తెలిపారు.

''టైగర్ నాగేశ్వరరావు గురించి నేను చాలా చిన్నప్పుడే విన్నాను. చీరాల, పేరాలలో మా నాన్నగారు ఉద్యోగం చేస్తున్నప్పుడు పక్కనే ఉండే స్టూవరురంలోని ప్రజలు అతడిని గురించి హీరోయిక్ గా చెప్తుండేవారు. ఒక దొంగని ఎందుకు హీరోలా కొనియాడుతున్నారనే విషయాన్ని మా నాన్న అక్కడి వారిని అడిగి తెలుసుకుని.. ఇంటికి వచ్చాక మాకు కథలుగా చెప్పేవారు''

''అతని కథేంటి.. హీరోయిజం ఏంటి.. ఒక రాబిన్ హుడ్ లాగా ఎలా ఉండేవాడు అనే విషయాలను నాన్న చెప్తూ ఉంటే నేను వింటూ ఉండేవాడిని. ఇన్నాళ్ల తర్వాత వంశీ టైగర్ నాగేశ్వరరావు మీద చక్కని కమర్షియల్ కథగా తీర్చిదిద్ది.. ఈరోజు నా తమ్ముడు రవితేజతో చేయడం అన్నది నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది శుభప్రదం.'' అని చిరు చెప్పుకొచ్చారు.

కాగా, 70వ దశకంలో దక్షిణ భారతదేశంలో పోలీసులకు ముచ్చెమటలు పట్టించిన మోస్ట్ వాంటెడ్ దొంగ నాగేశ్వరరావు. ‘టైగర్’ అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు. పోలీసుల నుంచి జైలు నుండి చాకచక్యంగా తప్పించుకోవడంలో ఆరితేరిన వాడతను. 1987లో చెన్నై జైలు నుంచి తప్పించుకున్న నాగేశ్వరరావును పోలీసులు కాల్చి చంపారు.

స్టువర్టుపురంలోని అతని ఇంటి ప్రధాన తలుపు వద్ద నాగేశ్వరరావు ఫోటో ఇప్పటికీ వేలాడుతూ ఉంటుందని సమాచారం. రాబిన్ హుడ్ తరహాలో కొనియాడబడిన గజ దొంగ జీవితంలోని సంఘటన ఆధారంగా ఇప్పుడు ''టైగర్ నాగేశ్వరరావు'' సినిమా రూపొందుతోంది.

ఇందులో రవితేజ సరసన నుపూర్ సనన్ - గాయత్రి భరధ్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రేణు దేశాయ్ ఇందులో కీలక పాత్రలో కనిపించబోతోంది. చాలా కాలం క్రితమే నటనకు దూరమౌన ఆమెకు ఇది కమ్ బ్యాక్ మూవీ. వంశీ చెప్పిన కథ నచ్చడంతో టెంప్ట్ అయి నటించాడని అంగీకరించానని రేణూ చెబుతోంది.

తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పై నిర్మాత అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తుండగా.. మధే సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. తెలుగు హిందీ తమిళ కన్నడ మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఏప్రిల్ నెలలోనే 'టైగర్..' మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
Tags:    

Similar News