సీఎం కేసీఆర్ ‌తో చిరు -నాగ్ భేటీ.. 2000 ఎకరాల్లో ఫిలింసిటీ?

Update: 2020-11-07 17:30 GMT
మ‌రోసారి హైద‌రాబాద్ శివారులో తెలంగాణ స‌ర్కారు నుంచి వ‌ర‌ల్డ్ క్లాస్ ఫిలింసిటీ ప్ర‌స్థావ‌న వ‌చ్చింది. తెలంగాణ విభ‌జ‌న అనంత‌రం ప‌లుమార్లు చర్చ‌కు వ‌చ్చిన ఈ అంశానికి ఎట్ట‌కేల‌కు పూర్తి క్లారిటీ వ‌చ్చేయ‌నుంద‌ని తాజా ప‌రిణామాలు చెబుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో టాలీవుడ్ పెద్ద‌లు చిరంజీవి.. నాగార్జున భేటీ అవ్వ‌డం ప‌రిశ్ర‌మ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

ఇంత‌కీ చిరు.. నాగ్ ఎందుక‌ని క‌లిశారు? అంటే దీనివెన‌క చాలా పెద్ద కార‌ణ‌మే ఉంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. హైద‌రాబాద్ శివారులో దాదాపు 2000 ఎక‌రాల్లో భారీ ఫిలింసిటీ నిర్మాణానికి సంబంధించి ముఖ్య‌మంత్రి కేసీఆర్ తో ఆ ఇద్ద‌రూ చ‌ర్చించార‌న్న వార్త ఫిలింవ‌ర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అందుకు కేసీఆర్ నుంచి అనుమ‌తి ల‌భించిందన్న గుస‌గుస‌లు వేడెక్కిస్తున్నాయి.

సీఎం కేసీఆర్ తో ఈ సమావేశంలో ఆర్.అండ్ బి శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి- ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్- రాజ్యసభ సభ్యుడు జె.సంతోష్ కుమార్- ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ- ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్.. ముఖ్య కార్యదర్శులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ భేటిలో కేసీఆర్ ఫిలింసిటీ కోసం 1500 - 2000 ఎకరాల కేటాయిస్తామ‌ని అన్నార‌ని తెలుస్తోంది. ఫిలిం సిటీ నిర్మాణానికి ముందు సినీ ప్రముఖులు.. అధికారుల బృందం బల్గేరియా వెళ్లి అక్కడి ఫిలిం సిటీని పరిశీలించి రావాలని.. సినిమా సిటీ ఆఫ్ హైదరాబాద్ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను ఆదేశించామ‌ని సీఎం అన్నారు. అలాగే సినీకార్మికుల్ని ఆదుకునేందుకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. దాదాపు 10ల‌క్ష‌ల మంది ఈ రంగంపై ఆధార‌ప‌డి జీవి‌స్తున్నారు. వారిని ఆదుకోవాల‌ని కేసీఆర్ అన్నారు. అలాగే థియేట‌ర్ల‌ను పునఃప్రారంభించే ఆలోచన ఉంద‌ని తెలిపారు.

ప్రభుత్వం సినిమా సిటీ ఆఫ్ హైదరాబాద్ నిర్మించాలనే తలంపుతో ఉంది. ప్రభుత్వమే 1500- 2000 ఎకరాల స్థలాన్ని సేకరించి ఇస్తుంది. అందులో అధునాతన సాంకేతిక నైపుణ్యంతో భవిష్యత్ అవసరాలకు తగ్గ ఇంట‌ర్నేష‌న‌ల్ స్టూడియోల నిర్మాణానికి అనుమ‌తించ‌నున్నామ‌ని సీఎం వెల్ల‌డించారు.
Tags:    

Similar News