ఈసారి ఫెస్టివల్ వైబ్ కనిపించడం లేదా..?
కానీ ఈ సంక్రాంతికి సందడి కాస్త తక్కువగా ఉంది. గడిచిన పండుగలతో పోల్చుకుంటే ఈసారి ఆ వైబ్ చాలా అంటే చాలా తక్కువ ఉందనే అనిపిస్తోంది.
టాలీవుడ్ లో సినిమాలకు అతి పెద్ద సీజన్ 'సంక్రాంతి'. స్టార్ హీరోల చిత్రాలు, భారీ బడ్జెట్ సినిమాలు పండుగ స్పెషల్ గా బాక్సాఫీస్ బరిలో దిగడానికి పోటీ పడుతుంటాయి. ప్రతీ ఏడాది మాదిరిగానే ఈసారి కూడా మూడు తెలుగు సినిమాలు పొంగల్ వార్ కి రెడీ అయ్యాయి. ఇప్పటికే ఒక మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. రేపు మరో మూవీ, ఆ తర్వాత రెండు రోజులకు ఇంకో సినిమా థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే పేరుకి మూడు క్రేజీ చిత్రాలు ఉన్నా, ఎందుకనో ఈసారి ఫెస్టివల్ వైబ్ పెద్దగా కనిపించడం లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
సంక్రాంతి పండుగ వస్తుందంటే తెలుగు రాష్ట్రాల్లో సినిమాల సందడి వేరేగా ఉంటుంది. థియేటర్ల దగ్గర వుండే పండగ వాతావరణం, సినీ అభిమానుల సెలబ్రేషన్స్, ఆ హడావుడి, హంగామా వేరే లెవల్ లో ఉంటాయి. పందెంలో ఏ పుంజు గెలుస్తుందో అనే విధంగా, సినీ జనాలు సైతం ఫలితం కోసం ఆతృతగా ఎదురు చూస్తుంటారు. కానీ ఈ సంక్రాంతికి సందడి కాస్త తక్కువగా ఉంది. గడిచిన పండుగలతో పోల్చుకుంటే ఈసారి ఆ వైబ్ చాలా అంటే చాలా తక్కువ ఉందనే అనిపిస్తోంది. ఏదో సోషల్ మీడియాలో కొంతమేర హడావిడి కనిపిస్తోంది కానీ, రియాలిటీ మాత్రం 'సినిమా పండుగ' కనిపించడం లేదు.
ముందుగా రామ్ చరణ్ నటించిన 'గేమ్ ఛేంజర్' సినిమా జనవరి 10న థియేటర్లలో రిలీజయ్యింది. శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. వందల కోట్లు వసూళ్లు రాబట్టినట్లుగా మేకర్స్ పోస్టర్లు వదులుతున్నప్పటికీ, ఒరిజినల్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయనేది ట్రేడ్ వర్గాలు ఎప్పటికప్పుడు రిపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఇక మరికొన్ని గంటల్లో విడుదలయ్యే 'డాకు మహారాజ్' మూవీ గురించి కూడా బయట ఎవరూ ఎక్కువగా మాట్లాడుకోవడం లేదు. మామూలుగా బాలయ్య సినిమా వస్తుందంటే, రిలీజ్ కు ముందు ఉండే ఆ హడావిడి కనిపించడం లేదు.
రెండేళ్ల కిందట సంక్రాంతికి 'వాల్తేరు వీరయ్య' 'వీర సింహా రెడ్డి' సినిమాలు ఒకేసారి రిలీజ్ అయినప్పుడు, బాక్సాఫీస్ వద్ద మధ్య ఎలాంటి వాతారవరణం క్రియేట్ అయిందో మనం చూశాం. ఇప్పుడు మెగా Vs నందమూరి క్లాష్ ఏర్పడినా.. ఈ పండక్కి అలాంటిదేమీ కనిపించడం లేదు. వీటితో పోల్చుకుంటే ఒకింత 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా మాత్రం కాస్త బెటర్ గా కనిపిస్తోంది. ఇప్పటికే పాటలు బాగా వైరల్ అయ్యాయి. వెంకటేష్ ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే కంటెంట్ తో రాబోతున్నట్లు పబ్లిసిటీతో క్లారిటీ ఇచ్చారు. ఏమన్నా ఈ సినిమా క్లిక్ అయితే థియేటర్ల దగ్గర పండగ వాతారవరణం కనిపించే అవకాశం ఉంటుంది.
ఏదేమైనా గడిచిన సంక్రాంతి సీజన్స్ తో కంపేర్ చేసి చూస్తే.. ఏ ఏడాది ఫెస్టివల్ కి ఏమంత సందడి లేదనే చెప్పాలి. మూడు సినిమాలు వచ్చినా ఎగ్జిబిటర్స్ కి, సినీ ప్రియులకు సరిపోవడం లేదు. ప్రతీ ఏడాది పండక్కి థియేటర్లు దొరకడం లేదని కొట్టుకునేవారు. కానీ ఈసారి థియేటర్లు ఉన్నా హౌస్ ఫుల్స్ చేసే పరిస్థితి లేదని అంటున్నారు. సిటీల నుంచి సొంత ఊర్లకు తరలి వెళ్లిన జనాలు, తమ ఫ్యామిలీస్ తో కలిసి సరదాగా ఏదైనా సినిమాకి వెళ్లాలనుకునే ఆ వైబ్ ఎక్కడా కనిపించడం లేదు. 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ వస్తోంది కానీ, దాని కోసం జనవరి 14వ తేదీ వరకూ వెయిట్ చెయ్యాలి.
లాస్ట్ ఇయర్ సంక్రాంతికి 'హనుమాన్', 'గుంటూరు కారం', 'నా సామిరంగా' లాంటి సినిమాలు ఫెస్టివల్ వైబ్ క్రియేట్ చేసాయి. ప్రేక్షకులు కుటుంబాలతో కలిసి థియేటర్లకు వచ్చి ఎంజాయ్ చేసారు. కానీ ఈసారి అది మిస్సయ్యింది. నిజానికి పండగ నెల పెట్టినప్పటి నుంచే సంక్రాంతి సినిమాల సందడి మొదలవ్వాలి. కానీ అల్లు అర్జున్ అరెస్ట్ ఇష్యూతో కొన్ని రోజుల పాటు జనాలు అసలు సినిమాల గురించి ఆలోచించనే లేదు. మీడియాలో, సోషల్ మీడియాలో ఎక్కడా పొంగల్ మూవీస్ గురించి చర్చలు జరగలేదు. ఇప్పుడు వచ్చిన మూడు సినిమాల చుట్టూ పెద్దగా బజ్ ఏర్పడకపోవడానికి అది కూడా ఒక కారణమని అనుకోవాలి. మరి రానున్న రోజుల్లో ఫెస్టివల్ హాలిడేస్ ని క్యాష్ చేసుకొని, ఏయే సినిమాలు విజయం సాధిస్తాయో చూడాలి.