జీవితంలో చిరుకు తీర‌ని లోటు అదేన‌ట‌

Update: 2017-06-10 18:53 GMT
మెగాస్టార్ చిరు ఓపెన్ అయిపోయారు. త‌న జీవితంలో తీర‌ని లోటు గురించి చెప్పుకొచ్చారు. విఖ్యాత ద‌ర్శ‌కుడు.. ద‌ర్శ‌క‌ర‌త్న‌గా.. టాలీవుడ్ కు పెద్దాయ‌న‌గా.. ఎవ‌రికి క‌ష్టాలు వ‌చ్చినా నేనున్నానంటూ ముందుకొచ్చే దాస‌రి ఈ మ‌ధ్య‌న క‌న్నుమూయ‌టం తెలిసిందే. ఆయ‌న సంస్మ‌ర‌ణ కోసం నిర్వ‌హించిన సంతాప స‌భ‌లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడారు.

ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి క‌డ‌సారి చూపు ద‌క్క‌క‌పోవ‌టంపై ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇది త‌న‌కెంతో బాధ క‌లిగిస్తోంద‌ని ఆయ‌న చెప్పారు. విదేశాల్లో ఉన్న‌ప్పుడు దాస‌రి చ‌నిపోయిన వార్త తెలిసింద‌ని... తాను విదేశాల్లో ఉండ‌టంతో రాలేక‌పోయిన‌ట్లుగా ఆయ‌న చెప్పారు.

దాస‌రి క‌డ‌సారి చూసే అవ‌కాశాన్ని మిస్ కావ‌టం.. త‌న జీవితంలో తీవ్ర అసంతృప్తి క‌లిగించే అంశంగా ఆయ‌న అభివ‌ర్ణించారు. దాస‌రి త‌న చివ‌రి రెండు బ‌హిరంగ స‌భ‌లు త‌మ‌కు సంబంధించిన‌వే కావ‌టం త‌మ‌కు కొంచెం ఊర‌ట క‌లిగించే అంశంగా చిరు చెప్పారు.

త‌న 150వ సినిమా ఖైదీ నంబ‌రు 150 ప్రీ-రిలీజ్ వేడుక‌ల్లో దాస‌రి పాల్గొన్నార‌ని.. అదే ఆయ‌న చివ‌రి బ‌హిరంగ స‌భ‌గా గుర్తు చేసుకున్నారు. మే 4న అల్లురామ‌లింగ‌య్య అవార్డును అందించిన‌ప్పుడు చివ‌రిసారి మీడియాతో  మాట్లాడిన విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ.. ఆ సంద‌ర్భంగా దాస‌రి త‌న ప‌క్క‌న కూర్చొని మీడియాతో మాట్లాడ‌టం త‌న‌కెంతో సంతృప్తిని క‌లిగించింద‌న్నారు.

ఆసుప‌త్రి నుంచి తొలిసారి డిశ్చార్జ్ అయ్యాక‌.. దాస‌రిని క‌లిసేందుకు వెళ్లిన తాను ఆయ‌న్ను చూసి మాట్లాడలేక‌పోయాన‌ని.. అలాంటి స‌మ‌యంలోనూ ఆయ‌న నీ సినిమా స్కోర్ ఎంత‌ని అడిగార‌ని చిరు చెప్పారు. ఆయ‌న ప్ర‌శ్న‌కు తాను బ‌దులిస్తూ.. హ‌య్యెస్ట్ గ్రాస‌ర్ గా నిలుస్తుంద‌న్న మాట చెప్ప‌గానే చిన్న‌పిల్ల‌ల మాదిరి విజ‌య సంకేతాన్ని చూపిస్తూ చ‌ప్ప‌ట్లు కొట్టిన విష‌యాన్ని గుర్తు చేసుకున్నారు. త‌ర్వాత త‌మ ఇంటికి తీసుకెళ్లి.. ద‌గ్గ‌రుండి భోజ‌నం వ‌డ్డించి తండ్రిలా ఆద‌రించార‌న్నారు. దాస‌రి లేక‌పోవ‌టం సినిమా ప‌రిశ్ర‌మ‌కు పెద్ద లోటుగా చిరు చెప్పారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News