'మా' ఎన్నిక‌లు.. చిరు ఓటు ఎవ‌రికి?

Update: 2019-03-05 04:35 GMT
మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నిక‌లు అగ్గి రాజేస్తున్నాయి. ఏక‌గ్రీవం అవుతుంద‌నుకున్న పోరు కాస్తా వ‌ర్గ పోరుగా మారింది. చివ‌రి నిమిషంలో సైలెంట్ గా సీనియ‌ర్ న‌రేష్ ప్యానెల్ బ‌రిలో దిగ‌డంతో శివాజీరాజాకు పోటీ త‌ప్ప‌లేదు. ఆ ఇద్ద‌రి ప్యానెల్స్ మ‌ధ్యా మా ఎన్నిక‌లు నువ్వా?  నేనా? అన్న‌ట్టుగా ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. దాదాపు 800 మంది స‌భ్యులున్న మా ఎన్నిక‌ల్లో ఏ వ‌ర్గాన్ని గెలుపు వ‌రిస్తుందా? అన్న ఆస‌క్తిక‌ర చ‌ర్చ స‌ర్వ‌త్రా సాగుతోంది. ఆ క్ర‌మంలోనే ఎవ‌రికి వారు బ‌లాబ‌లాల్ని నిరూపించుకునే ప‌నిలో ప‌డ్డారు.

లేటుగా వ‌చ్చినా లేటెస్టుగా దూసుకెళుతున్నారు ఘ‌ట్ట‌మ‌నేని న‌రేష్. ఇప్ప‌టికే సూప‌ర్ స్టార్ మ‌హేష్ మ‌ద్ధ‌తు కూడ‌గ‌ట్టిన న‌రేష్.. త‌న ప్యానెల్ బృందం జీవిత‌ - రాజ‌శేఖ‌ర్ ల‌తో క‌లిసి మెగాస్టార్ చిరంజీవిని క‌లిసి దీవెన‌లు అందుకోవ‌డం ఉత్కంఠ పెంచుతోంది. ఈ సంద‌ర్భంగా మెగాస్టార్ ఇంట్లో న‌రేష్‌ బృందం ఫోటోలు దిగ‌డం అవి సామాజిక మాధ్య‌మాల్లోకి రావ‌డంతో ఒక‌టే క్యూరియాసిటీ రెయిజ్ అయ్యింది. గ‌త రెండు ద‌ఫాలుగా శివాజీ రాజాకే మ‌ద్ధ‌తు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి ఓటు ఈసారి ఎటువైపు ప‌డ‌నుంది?  మెగా అండ‌దండ‌లు అధ్య‌క్ష ప‌ద‌వి రేసులో ఉన్న ఆ ఇద్ద‌రిలో ఎవ‌రికి ద‌క్క‌నున్నాయి? అన్న ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

మా ఎన్నిక‌ల్లో మెగా స‌పోర్ట్ ఎవ‌రికి ద‌క్కితే వాళ్లే అధ్య‌క్షుల‌య్యారు. ఆ ప్యానెల్ గెలిచి ప‌ద‌వులు అలంక‌రించింది. అందుకే ఈసారి మెగాస్టార్ స‌పోర్ట్ ఎవ‌రికి ఉంటుంది? అంటూ ఆస‌క్తిగా ముచ్చ‌టించుకుంటున్నారు. శివాజీరాజా వ‌ర్సెస్ సీనియ‌ర్ న‌రేష్ మ‌ధ్య వార్ పీక్స్ కి చేరుకుంది. ఎవ‌రికి వారు గెలుపు ధీమాతో దూసుకెళుతున్నారు. వైయ‌స్సార్ సంక్షేమ ప‌థ‌కాలు .. కేసీఆర్ సంక్షేమ ప‌థ‌కాలు .. అంటూ ఆ ఇద్ద‌రూ ఎన్నిక‌ల్లో గెలిచేందుకు చాలానే ఎత్తుగ‌డ‌లు వేస్తున్నారు. అయితే అంతిమంగా ఆ ఇద్ద‌రి వ‌ల్లా ల‌బ్ధి పొందిన వాళ్ల మ‌ద్ధ‌తు వారికి ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు. మార్చి 10న జ‌ర‌గ‌నున్న ఈ ఎన్నిక‌ల్లో గెలుపెవ‌రిది? అన్న‌ది వేచి చూడాల్సిందే.
Tags:    

Similar News