ఐడియా మంచిదే కానీ ఆచరణలోకి వస్తుందా??

Update: 2020-04-20 23:30 GMT
కరోనా ప్రభావం సినీ రంగంపై తీవ్రంగా ఉందన్న సంగతి తెలిసిందే. కొన్ని వారాల క్రితమే సినిమా థియేటర్లు మూత పడ్డాయి. కొత్త సినిమాల రిలీజులు నిరవధికంగా వాయిదా పడ్డాయి. షూటింగులు నిలిచిపోయాయి. దీంతో సినిమా ఇండస్ట్రీ లో దాదాపుగా పనులన్నీ నిలిచి పోయినట్టే. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే థియేటర్ల కు తిరిగి మళ్లీ మంచి రోజులు ఎప్పుడు వస్తాయి అనేది ఎవరు ఊహించలేకుండా ఉన్నారు. సురేష్ బాబు.. రాజమౌళి లాంటి సీనియర్లు థియేటర్లు తెరుచుకుని సాధారణ స్థితికి రావాలంటే కనీసం ఆరు నుంచి ఎనిమిది నెలల సమయం పట్టేలా ఉందని వ్యాఖ్యానించడం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. నిజంగా ఇలా జరిగితే మాత్రం సినీ పరిశ్రమ కుదేలు అవ్వడం ఖాయం. అటు నిర్మాతల నుంచి.. ఇటు రోజువారీ పనులు చేసే సినీ కార్మికుల వరకు అందరూ ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదు. ఈ పరిస్థితుల్లో కొందరు ఇండస్ట్రీ సీనియర్లు పరిశ్రమ బాగు కోసం కొన్ని సూచనలు చేస్తున్నారు. రీసెంట్ గా ఈ విషయంపై సీనియర్ సినిమాటోగ్రాఫర్ ఛోటా. కె నాయుడు స్పందించారు.

ప్రస్తుతం ఉన్న పరిస్థితిని అర్థం చేసుకుని స్టార్లు సినిమా రిలీజ్ కు ముందు కొంత రెమ్యూనరేషన్ మాత్రమే పుచ్చుకోవాలని.. సినిమా రిలీజ్ అయిన తర్వాత  లాభాలు వచ్చినపుడు అందులో వాటా తీసుకోవాలని అప్పుడే పరిశ్రమ చల్లగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. స్టార్లు అనగానే ఇక్కడ హీరోలు అని మాత్రమే మన ఫిక్స్ అవ్వాల్సిన పనిలేదు. అధిక రెమ్యూనరేషన్లు పుచ్చుకునే దర్శకులు.. హీరోయిన్లు మ్యూజిక్ డైరెక్టర్లు కూడా ఇందులోకే వస్తారు. నిజానికి బాలీవుడ్ స్టార్ హీరోలైన అమీర్ ఖాన్ లాంటి వారు ఎన్నో ఏళ్ల నుంచి ఇదే పద్ధతి అనుసరిస్తున్నారు. టాలీవుడ్ లో రెమ్యునరేషన్ అత్యధికంగా పుచ్చుకునేది హీరోలు.. దర్శకులు కాబట్టి ముఖ్యంగా వారే ఈ విషయంలో చొరవ చూపాల్సి ఉంటుంది.

అయితే కాయిన్ కు మరోవైపు అన్నట్టుగా.. ఇలా చేస్తే అసలు రెమ్యూనరేషన్ వస్తుందా లేదా అనేది పెద్ద అనుమానం. నిజంగా స్టార్లు సినిమా రిలీజ్ కు ముందు కొంత రెమ్యూనరేషన్ మాత్రమే తీసుకునేందుకు ముందుకు వస్తారా?.. 85 శాతం ఫ్లాపులు ఉండే సినిమారంగంలో ఇలాంటి పద్ధతిని అనుసరిస్తే అసలు రెమ్యూనరేషన్ కు గ్యారెంటీ ఎక్కడ ఉంటుంది? అంటూ కొందరు ఇలాంటి పద్ధతి వర్కవుట్ అయ్యే అవకాశం చాలా తక్కువని అభిప్రాయపడుతున్నారు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.
Tags:    

Similar News