లెజెండరీ సినిమాటోగ్రాఫర్ కన్నుమూత...!

Update: 2020-06-13 12:30 GMT
ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ బి. కన్నన్‌ తుదిశ్వాస విడిచారు. 69 ఏళ్ళ కన్నన్‌ అనారోగ్యంతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా గుండెకు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయనకు ఇటీవల వైద్యులు శస్త్రచికిత్స చేశారు. అయినా ఆయన ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడలేదు. శనివారం మధ్యాహ్నం ఆరోగ్యం పూర్తిగా విషమించి కన్నన్‌ మృతి చెందారు. కన్నన్ లెజండరీ డైరెక్టర్ భీమ్‌ సింగ్‌ కుమారుడు.. అలాగే ప్రముఖ ఎడిటర్ బి.లెనిన్‌ కు సోదరుడు. కన్నన్‌ తమిళంతో పాటు తెలుగు, మలయాళ చిత్రాలకు కూడా కెమెరామెన్ గా పనిచేసారు. తమిళ దర్శకుడు భారతీరాజాతో కలిసి దాదాపు 40 సినిమాలకి పనిచేశారు. అందుకే ఆయన్ను 'భారతీరాజా కళ్లు' అని పిలుస్తుంటారు. నలభై ఏళ్లకు పైగా సినీ ఇండస్ట్రీకి సేవలు అందించిన కన్నన్‌ తెలుగులో 'పగడాల పడవ' 'కొత్త జీవితాలు' 'సీతాకోక చిలుక'.. చిరంజీవి 'ఆరాధన' చిత్రాలకు సినిమాటోగ్రఫీ అందించారు. ఆయన 2015 వరకు బాఫ్టా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కి హెచ్‌.వో.డి గా పనిచేశారు.

కాగా ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒక మంచి వ్యక్తిని కోల్పోయామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సినీ నటి ఖుష్బూ ట్వీట్‌ చేస్తూ '2020 సంవత్సరం ఏ మాత్రం బాలేదు. మరో గొప్ప వ్యక్తిని గొప్ప సినిమాటోగ్రాఫర్‌ ను కోల్పోయాం. 'కెప్టెన్‌ మగళ్‌' సినిమా కోసం ఆయనతో కలిసి పనిచేశా. భారతీరాజా సర్ పర్మనెంట్‌ కెమెరామెన్‌ ఆయన. ఆయన కుటుంబ సభ్యులకు నా సానుభూతి తెలుపుతున్నా. మిమ్మల్ని చాలా మిస్‌ అవుతున్నాం సర్‌’ అని ఆయనతో గల అనుబంధాన్ని పంచుకున్నారు. కన్నన్ కు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. ఈ సాయంత్రం 6 గంటలకు ఆయన పార్థివదేహాన్ని ఆయన స్వగృహం వద్ద ఉంచుతారు. రేపు అంత్యక్రియలను నిర్వహిస్తారని సమాచారం.
Tags:    

Similar News