8 నెల‌ల గ‌ర్భిణి కెమెరాతో ఇలా..

Update: 2018-08-12 17:30 GMT
గ‌ర్భ‌ధార‌ణ స‌మ‌యంలో ఏ ప‌నీ చేయకూడ‌దని మ‌న ఇళ్ల‌లో ఆడాళ్లు భావిస్తుంటారు. అమ్మ‌మ్మ‌లు - నాయ‌న‌మ్మ‌లు అదేప‌నిగా మ‌న‌వ‌రాళ్ల‌కు అదే నూరిపోస్తారు. అందువ‌ల్ల గ‌ర్భం ధ‌రిస్తే ఇంక ఎటూ క‌ద‌ల‌కూడ‌ద‌ని ఉద్యోగాల‌కు సెల‌వులు పెట్టేస్తుంటారు. ప్ర‌భుత్వ స్కూళ్ల‌లో అయితే ఏకంగా మూడు నాలుగు నెల‌ల పాటు మెట‌ర్నిటీ లీవ్ పేరుతో బాధ్య‌తలకు దూర‌మ‌వుతారు. కానీ ఇక్క‌డ సీను మాత్రం పూర్తిగా వేరేగా ఉంది. ఎనిమిది నెల‌ల గ‌ర్భంతో ఆన్‌ లొకేష‌న్ కెమెరామేన్‌ లా శ్ర‌మించిన ఓ ధీర‌వ‌నిత క‌థ ఎంతో స్ఫూర్తి నింపుతోంది. ఈ మ‌హిళ గురించి చెప్పింది ఎవ‌రో తెలుసా?  టాలీవుడ్ ఆల్ రౌండ‌ర్ మంచు ల‌క్ష్మి.

ఆస్కార్‌కి నామినేట్ అయిన తొలి మ‌హిళా ఛాయాగ్రాహ‌కురాలు రాచెల్ మోర్రిస‌న్ గురించే ఇదంతా. ఎనిమిది నెల‌ల గ‌ర్భిణిగా ఉంటూ త‌ను `ఎగైనిస్ట్ ఆల్ ఎనిమీస్‌` అనే ఓ ఫీచ‌ర్ ఫిలిం తీశారు. బిడ్డ‌ను క‌న్న త‌ర్వాత వెంట‌నే రెండు నెల‌ల‌కే ఉద్యోగంలో చేరిపోతాన‌ని ప్ర‌క‌టించింది రాచెల్. ఆ తెగువ గురించి పొగిడేస్తూ ల‌క్ష్మీ మంచు ఈ పోస్టింగ్‌ ని అభిమానుల‌కు షేర్ చేశారు. రాచెల్‌ పై ఓ ఆంగ్ల ప‌త్రిక‌ క‌థ‌నం అంతే స్ఫూర్తినిచ్చేదిగా ఉంది.

``ఫ్రెగ్నెన్సీ అంటే అదేదో అంగ‌వైక‌ల్యం అన్న‌ట్టు చూస్తారు. కానీ స‌మ‌స్య అది కాదు. బ‌తుకు తెరువు కోసం 8 నెల‌ల గ‌ర్భిణిగా ఉన్న‌ప్పుడు ఓ సినిమాటోగ్రాఫ‌ర్‌ గా ప‌ని చేశాను. బ‌రువైన కెమెరా ఎత్తి ఆన్ లొకేష‌న్‌ కి వెళ్లాను. నేనేమీ సూప‌ర్‌ హీరోని కాను. కేవ‌లం ఉపాధి కోస‌మే ఇలా చేశాను. చాలా మంది మ‌హిళ‌ల‌కు తెలియాల్సింది ఏమంటే... గ‌ర్భిణులు అయిన ప్ర‌తి ఇద్ద‌రూ ఒకేలా ఉండ‌రు. కొంద‌రు విధి నిర్వ‌హ‌ణ‌కు వెళ్లొచ్చు`` అని ఆ క‌థ‌నంలో రాచెల్ తెలిపారు. ఊరికే తిని కూకుంటే మ‌డిషికి గొడ్డుకు తేడా ఏటుంటాది అని రావుగోపాల్ రావ్ చెప్పిన‌ట్టు!!
Tags:    

Similar News