ఏపీ-తెలంగాణ‌లో థియేట‌ర్ల బంద్!

Update: 2021-04-22 12:30 GMT
క‌రోనా సెకండ్ వేవ్ ప్ర‌భావంతో దేశం అల్లాడుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ కేసులు అంత‌కంత‌కు పెరుగుతుంటే జ‌నం భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌వుతున్నారు. నెల‌రోజుల పాటు స్వీయ‌నిర్భంధం పాటించడానికి ప్ర‌జ‌లు స్వ‌చ్ఛందంగా స‌మాయ‌త్త‌మవుతున్న వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. దీని ప్ర‌భావం థియేట‌ర్ల రంగంపై తీవ్రంగానే ప‌డుతోంది.

తెలంగాణ‌లో థియేట‌ర్ల బంద్ అధికారికం అయ్యింది. ఇప్పుడు ఏపీలోనూ థియేట‌ర్ల‌ను బంద్ చేయ‌నున్నార‌ని తెలుస్తోంది. ప్రభుత్వ జీవోల‌తో ప‌నే లేకుండా ఇప్ప‌టికే ఎగ్జిబిట‌ర్లు స్వ‌యంగా నిర్ణయం తీసుకున్నారు. మ‌ల్టీప్లెక్సుల‌తో పాటు సింగిల్ థియేట‌ర్ల‌కు ఇదే ప‌రిస్థితి. వ‌కీల్ సాబ్ మిన‌హా వేరే ఏ సినిమాలు లేక‌పోవ‌డంతో ఇప్పుడు కంటెంట్ చాల‌క‌ థియేట‌ర్ల‌ను తెరిచి ఉంచ‌లేమ‌ని ఎగ్జిబిట‌ర్లు చెబుతున్నారు. ఒక‌వేళ తెరిచినా కానీ క‌రెంట్ బిల్లుల వ‌ర‌కూ కూడా గిట్టుబాటు కాని ప‌రిస్థితి.

ప్ర‌స్తుతం వ‌కీల్ సాబ్ ని ఐదారు రోజులు మాత్ర‌మే ఆడిస్తామ‌ని ఆ త‌ర్వాత థియేట‌ర్లు మూసేస్తామ‌ని ఇంత‌కుముందే ఎగ్జిబిట‌ర్లు వెల్ల‌డించారు. తెలంగాణ‌లో 50శాతం ఆక్యుపెన్సీ తో.. ఏపీలో తగ్గిన టిక్కెట్టుతో ఇంత‌కుముందే ఎగ్జిబిట‌ర్ల‌కు నీర‌సం వ‌చ్చేసింది. మూలిగే న‌క్క‌పై తాటి పండు ప‌డ్డ‌ట్టు సెకండ్ వేవ్ ఉధృతి జ‌నాల్ని బ‌య‌ట‌కు రానివ్వ‌డం లేదు. ఇప్పుడు ఏకంగా థియేట‌ర్ల‌ను మూసేయ‌డానికి కార‌ణం అవుతోంది.
Tags:    

Similar News