ఆర్టిస్టుల్ని వేధిస్తున్న కో ఆర్డినేట‌ర్స్‌

Update: 2018-11-14 17:30 GMT
ద‌ళారీ వ్య‌వ‌స్థ లేనిదే ప‌న‌వ్వ‌ని రోజులివి. ఈ వ్య‌వ‌స్థపై ఏకంగా బ్రోక‌ర్ అనే సినిమా తీశాడు ఆర్‌.పి.ప‌ట్నాయ‌క్. మ‌ధ్య‌వ‌ర్తి ఉంటే ఏ ప‌ని అయినా సులువుగా అయిపోతుంది. ఏదైనా తెగ్గొట్టాలంటే బ్రోక‌ర్ తోనే సాధ్యం. మ‌ధ్య‌వ‌ర్తితో తేడాలొచ్చినా అంతే ఇదిగా ఉంటుంద‌ని ఆ సినిమాలో చూపించారు. కేవ‌లం ఈ బ్రోక‌రీ సంపాద‌న‌తోనే ధ‌న‌వంతులు అయిన‌వాళ్లెంద‌రో. ఫిలింన‌గ‌ర్‌- ద‌ర్గా ప‌రిస‌రాల్లో కేవ‌లం రెండెక‌రాల‌ ల్యాండ్ డీల్‌ తో బ్రోక‌ర్ అకౌంట్లోకి 3కోట్లు వ‌చ్చి ప‌డ్డాయంటే అర్థం చేసుకోవాలి.

అదంతా స‌రే.. ఈ బ్రోక‌రీ సినిమా 24 శాఖ‌ల్లో ఏఏ రూపాల్లో ఉంది? అని వెతికితే ర‌క‌ర‌కాల కోణాల్లో విశ్లేషించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆర్టిస్టులకు అవ‌కాశాలిప్పించే బ్రోక‌రీ వ్య‌వ‌స్థ టాలీవుడ్ లో అతి పెద్దది. ఇక్క‌డ ద‌ర్శ‌కుడి కంటే ముందే కాస్టింగ్ సెల‌క్ష‌న్ చేసేవాళ్ల‌కు న‌చ్చాలి. అందుకోసం ఏకంగా కాస్టింగ్ కోఆర్డినేట‌ర్లు పుట్టుకొచ్చారు. వీళ్ల‌తో ప‌న‌యినా మ‌ధ్య‌లో ప్రొడ‌క్ష‌న్ మేనేజ‌ర్ రిక‌మండేష‌న్ త‌ప్ప‌నిస‌రి. వీళ్లంతా త‌మ‌కు వ‌చ్చే రోజువారీ భ‌త్యంలో ఎంతో కొంత తినేసిన త‌ర్వాత‌నే త‌మ‌కు మిగ‌తా మొత్తాన్ని ముట్ట‌జెబుతార‌ని ఆర్టిస్టులు నేరుగానే ఆరోపిస్తుంటారు. జూనియ‌ర్ ఆర్టిస్టుల సంఘంలో సైతం అక్క‌డ అవ‌కాశాలు ఇప్పించే మ‌ధ్య‌వ‌ర్తులు కొంత మొత్తం త‌మ ఖాతాలో జ‌మ వేసుకుని భ‌త్యం (కూలి) ఇస్తుంటారు. మ‌ధ్య‌వ‌ర్తుల చేతుల్లోంచి డ‌బ్బు రావాల్సి ఉంటుంది కాబ‌ట్టి, ఇక్క‌డ ప్ర‌లోభాల‌కు అంతే ఆస్కారం ఉంటుంది. అవ‌కాశాలు కావాలి - భ‌త్యం చేతికందాలి.. ఆ రెండూ స‌వ్యంగా సాగాలంటే బ్రోక‌ర్ల‌తో లాలూచీ ప‌డాల్సిన స‌న్నివేశం దాపురించి ఉంది. పొట్ట చేత‌ప‌ట్టుకుని ఉపాధి కోసం వ‌చ్చే ఎంద‌రో అమ్మాయిలు కాస్టింగ్ కౌచ్ పేరుతో బుక్క‌య్యేది ఇక్క‌డే.

ఈ ద‌ళారీ వ్య‌వ‌స్త‌లో కొన్ని లొసుగుల  వేళ వాళ్ల‌లో వాళ్ల‌కే గొడ‌వ‌లు వ‌చ్చిన‌ప్పుడు గుట్టంతా ర‌ట్ట‌యిపోతుంటుంది. అదే తీరుగా ప్ర‌స్తుతం తెలంగాణ టీవీ మూవీ ఆర్టిస్టుల సంఘంలో లొసుగు ఒక‌టి బ‌య‌ట‌ప‌డ‌డం ఫిలింన‌గ‌ర్‌ లో చ‌ర్చ‌కొచ్చింది. ఇందులో ఆర్టిస్టులు త‌మ‌ను కోఆర్డినేట‌ర్లు వేధిస్తున్నార‌ని - స‌రిగా భ‌త్యం చెల్లించ‌కుండా కొంత మొత్తాన్ని త‌మ వ‌ద్ద నుంచి గుంజేస్తున్నార‌ని ఆరోపిస్తున్నారు. ఇక దాదాపు 800 మంది ఆర్టిస్టుల‌తో అతి పెద్ద ఆర్గ‌నైజేష‌న్‌ గా అవ‌త‌రించిన తెలంగాణ టీవీ మూవీ ఆర్టిస్టుల సంఘం .. అప్ప‌టికే ఉన్న ఏపీ టీవీ ఆర్టిస్టుల సంఘానికి ప్ర‌త్యామ్నాయంగా మారుతున్న వేళ ఇందులో ఆర్టిస్టుల‌కు మ‌ధ్య‌వ‌ర్తుల‌కు మ‌ధ్య పొస‌గ‌డం లేద‌న్న మాట వినిపిస్తోంది. త్వ‌ర‌లోనే ఈ సంఘానికి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న వేళ ఈ గొడ‌వ‌లు ర‌చ్చ‌కెక్క‌డం కృష్ణాన‌గ‌ర్ స‌ర్కిల్స్‌ లో చ‌ర్చ‌కొచ్చింది. కాస్టింగ్ సెల‌క్ష‌న్స్ పేరుతో పిలిచి ఆడిష‌న్స్ నిర్వ‌హించి - అటుపై అవ‌కాశాలు ఇప్పించినందుకు భారీ మొత్తాల్నే మ‌ధ్య‌వ‌ర్తులు గుంజేస్తున్నార‌ట‌. అవ‌కాశం రాక‌ముందే త‌మ నుంచి రూ.2500-2500 కోఆర్డినేట‌ర్స్ వ‌సూలు చేస్తున్నార‌న్న ఆరోప‌ణ‌లు ఆర్టిస్టులు చేస్తున్నారు. ఎవ‌రి ఆఫీస్‌ కి వెళ్లినా మ‌ధ్య‌లో కోఆర్డినేట‌ర్ల‌ను క‌ల‌వాల్సి ఉంటుందిట‌. ఏ ఆఫీస్‌ కి వెళ్లినా.. సెల‌క్ట్ అని చెబుతున్నారు. తీరా షూటింగ్ ప్రారంభించేప్ప‌టికి అక్క‌డ కోఆర్డినేట‌ర్స్ ఉంటున్నారు. రూ.2500 స్పాట్ పేమెంట్ ఇస్తుంటే.. రూ.1000-1200 చేతిలో పెడుతున్నారు. యూనియ‌న్ ఉన్నా కానీ ఇద్ద‌రు ముగ్గురు మాత్ర‌మే సెల‌క్ట్ అవుతున్నారు... యూనియ‌న్‌ లో లేని వారికి కోఆర్డినేట‌ర్లు అవ‌కాశాలిస్తున్నారు. దీనివ‌ల్ల అసోసియేష‌న్‌ లో ఉండీ ఉప‌యోగం లేకుండా పోతోంద‌ని, నెల‌కు 10రోజులైనా షూటింగుల‌కు వెళ్లే అవ‌కాశం రావ‌డం లేద‌ని వాపోతున్నారు. ఆర్టిస్టుల విష‌యంలో ఈ స‌మ‌స్య చాలా సీరియ‌స్ స‌మ‌స్య‌. ఇది అంతం లేని అరాచ‌కంగా సాగిపోవ‌డంపై నిరంత‌రం ఆర్టిస్టుల్లో చ‌ర్చ సాగుతూనే ఉంటుంది.
Tags:    

Similar News