టాలీవుడ్ పెద్ద‌ల‌పై పృథ్వీ పంచ్

Update: 2019-06-14 06:44 GMT
టాలీవుడ్ సినీపెద్ద‌ల వ్య‌వ‌హార శైలి పై టాలీవుడ్ కమెడియన్.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పృథ్వీ తీవ్రంగా విరుచుకుప‌డ్డారు. అస‌లు ఈ సినిమావాళ్ల వాల‌కం స‌రిగా లేద‌ని.. సినిమావాళ్లను ఎందుకు నమ్మకూడద‌ని అంటారో వీళ్ల వ్య‌వ‌హారం చూస్తే అర్థ‌మైపోతోంద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని అత్యంత భారీ మెజారిటీతో ఏపీ ప్ర‌జ‌లు గెలిపించారు. పాతికేళ్ల వ‌ర‌కూ పాలించే స‌మ‌ర్ధ‌త ఉన్న నాయ‌కుడు ఆయ‌న‌. అయితే అలాంటి నాయ‌కుడు టాలీవుడ్ సినీపెద్ద‌ల‌కు క‌నిపించ‌డం లేదా? ఆయ‌న గెలిచాక ఎందుక‌ని స‌ద‌రు పెద్ద‌లంతా దూరంగా ఉన్నార‌ని నిల‌దీసారు. చాలావరకు సినీ ప్రముఖులు ఏపీ రాజకీయాలపై మౌనం వహించడంతో పృథ్వీ ఈ విధంగా
కామెంట్ చేశారు.

కోడెల ట్యాక్స్ వ‌ల్ల నరసారావు పేట నియోజకవర్గంలో వ్యాపారాలు దెబ్బ తిన్నాయ‌ని వ్యాఖ్యానించిన పృథ్వీ ఆ క్ర‌మంలోనే సినిమావాళ్ల‌పైనా టోకున విరుచుకుప‌డ్డారు. న‌ర‌సారావు పేట‌లో న‌ష్ట‌పోయిన వైకాపా నేత శాసనసభ్యుడు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అండగా ఉంటారని అన్నారు. అంతే కాకుండా నరసారావు పేటలో 30 ఏళ్ల వరకు వైసిపి జెండా ఎగిరేలా గోపిరెడ్డి పాల‌న సాగుతుంద‌ని అకాంక్షించారు.

అయితే పృథ్వీ వ్యాఖ్య‌ల వెన‌క చాలానే అంత‌రార్థం ఉంద‌ని ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల్లో చ‌ర్చ మొద‌లైంది. మ‌న సినీపెద్ద‌లంతా తేదేపా ప్ర‌భుత్వంతో చంద్ర‌బాబుతో రాసుకు పూసుకుని తిరిగారు. బాబు గెలిచాక‌ చాలానే మంత్రాంగం న‌డిపించాల‌ని చూశారు. కొత్త టాలీవుడ్ నెల‌కొల్పాల‌ని.. కొత్త ప‌రిశ్ర‌మ‌కు ప్ర‌ణాళిక వేయాల‌ని చంద్ర‌బాబును క‌లిసిన సినీపెద్ద‌లు చాలా ప్రామిస్ లు తీసుకున్నారు. కానీ ఆశించిన‌దేదీ జ‌ర‌గ‌లేదు. ప్ర‌స్తుతం ఎందుక‌నో అంతా స్థ‌బ్ధుగా ఉన్నారు. ఏపీ టాలీవుడ్ గురించి ముచ్చ‌టా లేదు. ఆ క్ర‌మంలోనే పృథ్వీ పంచ్ పెద్ద రేంజులోనే పేలింది. క‌నీసం ఇప్ప‌టికి అయినా కొత్త సీఎంని క‌లిసే ఆలోచ‌న‌లో సినీ పెద్ద‌లు ఉన్నారా.. అన్న‌ది చూడాలి.

    
    
    

Tags:    

Similar News