వెన్నెల కిషోర్ చిరు సినిమా వద్దన్న వేళ..

Update: 2015-10-31 13:30 GMT
వెన్నెల కిషోర్.. తన తొలి సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చేసుకున్న నటుడు. బుద్ధిగా అమెరికాలో ఉద్యోగం చేసుకుంటున్నవాడు అనుకోకుండా ‘వెన్నెల’ సినిమాలో కమెడియన్ గా నటించి.. ఆ తర్వాత సినిమాల్నే కెరీర్ గా మార్చేసుకున్నాడు. ఐతే వెన్నెల సినిమా తర్వాత చిరంజీవి సినిమాలో ఛాన్స్ వస్తే తాను తిరస్కరించినట్లు చెప్పాడు కిషోర్. సినిమాల్ని కెరీర్ గా ఎంచుకుంటే కష్టాల్లో పడతానేమో అన్న ఉద్దేశంతోనే చిరంజీవి ‘స్టాలిన్’ సినిమాకు ‘నో’ చెప్పినట్లు కిషోర్ వెల్లడించాడు.

‘‘వెన్నెల సినిమా మొదలవడానికి ముందు అమెరికాలో ఉద్యోగం చేసుకుంటున్నా. అప్పటికి నా చదువుకు చాలా ఖర్చయింది. ఆ అప్పులు తీర్చాల్సిన పరిస్థితుల్లో ఉద్యోగం నాకు చాలా ముఖ్యం. ఐతే నెల రోజుల సెలవుండటంతో వెన్నెల సినిమా అసిస్టెంటుగా పని చేసే అవకాశం ఉందంటే వెళ్లా. కానీ శివారెడ్డి అనుకోని కారణాలతో అమెరికాకు రాలేకపోవడంతో అతను చేయాల్సిన క్యారెక్టర్ నాకిచ్చారు. ఐతే రెండు నెలలు డేట్లడిగారు. ఓ నెల జీతం పోతుందంటే.. దేవా కట్టా ఆ జీతం నేనిస్తానని సినిమా చేయించారు.

ఆ తర్వాత వెన్నెల సినిమా బాగా ఆడినా ఇండియాకు రాలేదు. ఆ సినిమా విజయోత్సవ సభకు రమ్మన్నా నా దగ్గర డబ్బుల్లేవనే చెప్పా. అప్పుడు కూడా సగం డబ్బులు నేనిస్తానని దేవా చెప్పడంతోనే వచ్చా. ఆ తర్వాతచి ఇండియాకు వచ్చి ఇక్కడే ఓ ఉద్యోగం చూసుకున్నాక.. స్టాలిన్ సినిమాకు నాలుగు నెలలు డేట్లు అడిగారు. కానీ ఉద్యోగమే ముఖ్యం అనుకుని.. సినిమాల్లోకి వెళ్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఏమో అని.. కుదరదని చెప్పేశాను. ఐతే కరెంట్ సినిమాకు నాగసుశీల గారు గట్టిగా చెప్పడంతో చేశాను. మంచి పేరొచ్చింది. ఆ తర్వాత వరుసగా అవకాశాలు రావడంతో ఉద్యోగం వదిలేసి సినిమాల్లో సెటిలయ్యా’’ అని చెప్పాడు కిషోర్.
Tags:    

Similar News