హాస్య బ్ర‌హ్మ ..కామెడీ కింగ్..స‌రికొత్త అడుగులు

Update: 2022-02-01 07:30 GMT
హాస్య బ్ర‌హ్మ‌.. కామెడీ కింగ్.. మీమ్స్ గురు.. ఇలా టాలీవుడ్ ప్రేక్ష‌కుల హృద‌యాల్లో సుస్థిర స్థానాన్ని సొంతం చేసుకున్నారు బ్ర‌హ్మానందం. నేడు ఆయ‌న పుట్టిన రోజు. లెక్చ‌ర‌ర్‌గా అత్తిలిలో ఉద్యోగం చేస్తున్నఆయ‌న కెరీర్ ని మ‌లుపు తిప్పిన వ్య‌క్తి జంధ్యాల‌. వేజేళ్ల స‌త్యనారాయ‌ణ డైరెక్ట్ చేసిన `శ్రీ‌తాతావ‌తారం`తో తొలిసారి న‌టుడిగా కెమెరా ముందుకొచ్చినా జంధ్యాల తెర‌కెక్కించిన `అహ నా పెళ్లంట‌` మాత్రం ముందు విడుద‌ల కావ‌డంతో ఆయ‌న తొలి చిత్రంగా ఇదే నిలిచింది.

ఈ చిత్రంలో కోట శ్రీనివాస‌రావుతో క‌లిసి బ్ర‌హ్మానందం ప‌లికించిన హావ భావాలు హాస్య ప్రియుల్ని విశేషంగా అల‌రించాయి. అంతే కాకుండా ఈ సినిమాతో టాలీవుడ్ కు తిరుగులేని హాస్య న‌టుడు ల‌భించాడ‌నే సంకేతాల్ని అందించాయి. `పాడె మీద పైస‌లు ఏరుకొనే వెధ‌వా... పోతావ్ ర‌రేయ్ నాశ‌న‌మైపోతావ్‌..` అంటూ బ్ర‌హ్మానందం ప‌లికించిన హావ భావాలు ఇప్ప‌టికీ ఎవ‌ర్ గ్రీన్ గా నిలిచాయి. వెయ్యికి పైగా చిత్రాల్లో న‌టించిన గిన్నిస్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డ్స్ లో స్థానం పొంది చ‌రిత్ర సృష్టించారు.

మీమ్స్ కి కేరాఫ్ అడ్ర‌స్ గా నిలిచిన బ్ర‌హ్మానందం చిన్న సైగ చేసినా కామెడీనే.. ఓర కంట చూసినా కామెడీనే.. ఆయ‌న బాడీనే ఓ న‌వ్వుల ఖ‌జానాగా మారిపోయింది. ఆయ‌న చేసిన చిత్రాల్లో ఆయ‌న ప‌లికిన కొన్ని డైలాగ్ లు ఇప్ప‌టికీ జ‌నాల్లో నానుతూనే వున్నాయి.  `చిత్రం భ‌ళారే విచిత్రం`లోని నీ యంక‌మ్మా.. పోకిరిలో అలీకి బిచ్చం వేస్తూ `పండ‌గ చేస్తో..., నువ్వు నాకు న‌చ్చావ్ చిత్రంలోని రక రకాలుగా వుంది మాస్టారు..`మ‌నీ మ‌నీ`లో...ఖాన్ తో గేమ్స్ ఆడ‌కు.. శాల్తీలు లేచిపోతాయ్‌..., `ప‌ట్టుకోండి చూద్దాం` లో దొరికాడా ఏసెయ్యండి....,  జ‌ఫ్ఫా.. ఇరుకు పాలెం వాళ్లంటే ఎక‌సెక్కాలుగా వుందా.. (ధ‌ర్మ‌చ‌క్రం), `ఢీ`లోని న‌న్ను ఇన్‌వాల్వ్ చేయ‌కంగి రావు గారు.. వంటి డైలాగ్ లు ఇప్ప‌టికీ ఎవ‌ర్ గ్రీన్ డైలాగ్ లుగా నిలిచిపోయాయి.

కామెడీకి కేరాఫ్ అడ్ర‌స్ గా నిలిచిన బ్ర‌హ్మానందం గ‌త కొంత కాలంగా సినిమాల్లో క‌నిపించ‌డం లేదు. బాగా న‌చ్చితే  త‌ప్ప సినిమా చేయ‌డం లేదు. `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రంలోని `రాములో రాములో.. `పాట‌లో మెరుపులా మెరిసి న‌వ్వించారు. ఇటీవ‌ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన `జాతిర‌త్నాలు` చిత్రంలో జ‌స్టీస్ బ‌ల్వంత్ చౌద‌రి పాత్ర‌లో క‌నిపించి న‌వ్వించారు. అయితే ఇప్పుడు పంథా మార్చారాయ‌న‌. న‌వ్విస్తూనే ఆలోచింప‌జేసే పాత్ర‌ల వైపు అడుగులు వేస్తున్నారు.

ప‌వ‌న్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌, రానా క‌లిసి న‌టిస్తున్న `భీమ్లా నాయ‌క్‌`లో ఓ విభిన్న‌మైన పాత్ర‌లో న‌టిస్తున్న ఆయ‌న కొన్నేళ్ల విరామం త‌రువాత కృష్ణ‌వంశీ తెర‌కెక్కిస్తున్న `రంగ మార్తాండ‌`లోనూ త‌న వ‌య‌సుకి త‌గ్గ పాత్ర‌లో కాస్త గంభీరంగా క‌నిపించ‌బోతున్నారు.  ఇక స‌రికొత్త క‌థ‌, క‌థ‌నాల‌తో రూపొందుతున్న `పంచ‌తంత్రం` చిత్రంలోనూ ఆయ‌న స‌రికొత్త పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. నేడు బ్ర‌హ్మానందం పుట్టిన రోజు సంద‌ర్భంగా చిత్ర భృందం బ్ర‌హ్మా నందం పాత్ర‌ని పరిచ‌యం చేస్తూ ఓ వీడియోని విడుద‌ల చేసింది.

ఇందులో బ్ర‌హ్మానందం వేద‌వ్యాస్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. ఆల్ ఇండియా రేడియోలో ప‌ని చేసిన రిటైర్‌మెంట్ తీసుకున్న ఓ ఉద్యోగి గా ఆయ‌న క‌నిపించ‌బోతున్నారు. క‌ల‌ర్స్ స్వాతికి తండ్రిగా ఇందులో ఆయ‌న న‌టించారు. రిటైర్‌మెంట్ త‌రువాత అర‌వైఏళ్ల వ‌య‌సులో కెరీర్ ని ప్రారంభించే ఓ వ్య‌క్తి క‌థ ఇది. `ఏమ్మా కెరియ‌ర్ అంటే ఇర‌వైల్లోనే మొద‌లుపెట్టాలా.. అర‌వైల్లో మొద‌లుపెట్ట‌కూడ‌దా..? అంటూ బ్రహ్మానందం చెబుతున్న డైలాగ్ లు ఆక‌ట్టుకుంటున్నాయి. హ‌ర్ష పులిపాక ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని అఖిలేష్ వ‌ర్థ‌న్‌, సృజ‌న్ య‌ర‌బోలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. `రంగ మార్తాండ‌`, పంచ తంత్రం చిత్రాల‌తో కొత్త అడుగులు వేస్తున్న బ్ర‌హ్మా నందం స‌రికొత్త పాత్ర‌ల‌తో మ‌రింత‌గా ప్రేక్ష‌కుల్ని న‌వ్విస్తూ ఆలోచింప‌జేయాల‌నుకుంటున్నారు. ఆయ‌న ప్ర‌య‌త్నం ఫ‌లించాల‌ని ఆశిద్దాం.
    




Full View





Tags:    

Similar News