మళ్ళీ విడుదల తేదీల గందరగోళం.. ఈసారి ఎవరు వెనక్కి వెళ్తారో..?

Update: 2022-01-22 10:30 GMT
కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో సినిమాల విడుదల విషయంలో మళ్ళీ గందరగోళం ఏర్పడింది. వాయిదా పడిన పెద్ద చిత్రాలన్నీ రిలీజ్ డేట్స్ ని రీషెడ్యూల్ చేయడంతో.. ఇప్పటికే విడుదల తేదీలను ప్రకటించిన సినిమాలకు ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి వచ్చింది.  

కోవిడ్ థర్డ్ వేవ్ పరిస్థితుల ప్రభావం వల్ల సంక్రాంతికి రావాల్సిన 'ఆర్.ఆర్.ఆర్' మరియు 'రాధేశ్యామ్' సినిమాలు వాయిదా పడ్డాయి. అయితే మార్చి నుంచి వైరస్ ఉధృతి తగ్గుముఖం పడుతుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తుండటంతో.. అదే నెల చివరి వారంలో బాక్సాఫీస్ ముందుకు వచ్చేందుకు పాన్ ఇండియా సినిమాలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి.

ఇప్పటికే RRR సినిమా కోసం రెండు రిలీజ్ డేట్స్ ని లాక్ చేశారు. కుదిరితే ఈ ఏడాది మార్చి 18న లేదా ఏప్రిల్‌ 28న ఈ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామాని విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో అదే సమయంలో రిలీజులు ప్లాన్ చేసుకున్న మిగతా సినిమాల మేకర్స్ ఎటూ తేల్చుకోలేని పరిస్థితి ఏర్పడింది.

అన్నీ అనుకున్నట్లు జరిగితే ప్రభాస్ నటించిన 'రాధే శ్యామ్' చిత్రాన్ని మార్చి 18న విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే RRR మేకర్స్ రెండు డేట్స్ ని లాక్ చేసుకున్నారు. కాకపోతే ఏప్రిల్ 28న వస్తున్నట్లు 'ఎఫ్ 3' బృందం ఇప్పటికే ప్రకటించింది. ఒకవేళ ట్రిపుల్ ఆర్ అదే రోజు రావాలని ఫిక్స్ అయితే మాత్రం 'F 3' సినిమా వెనక్కి తగ్గక తప్పదు.

నిజానికి RRR కోసం సంక్రాంతికి విడుదల కావాల్సిన 'భీమ్లా నాయక్' 'సర్కారు వారి పాట' 'ఎఫ్ 3' వంటి మూడు క్రేజీ చిత్రాలు పోస్ట్ పోన్ చేసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు అదే పరిస్థితి పునరావృతం అయ్యేలా కనిపిస్తుంది. కానీ ఇప్పటికే రెండుసార్లు డేట్ మార్చుకున్న చిత్రానికి మరో మంచి రిలీజ్ దొరకడం కష్టమే.

అలానే పండుగ రేసు నుంచి తప్పుకున్న 'సర్కారు వారి పాట' చిత్రాన్ని ఏప్రిల్ 1వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ముందుగా ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రావాలని ప్లాన్ చేసిన 'ఆచార్య'.. ఇప్పుడు ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో వస్తున్నట్లు తెలిపారు. దీంతో బాక్సాఫీస్ వద్ద క్లాష్ ని నివారించడానికి ఏదో ఒక సినిమా విడుదల తేదీని మార్చుకోవాల్సి ఉంటుంది.
Tags:    

Similar News