చిత్ర‌పురి కాల‌నీలో హాస్పిట‌ల్‌ ఎవ‌రు క‌ట్టినా ఓకే కానీ..!

Update: 2022-08-23 11:38 GMT
దివంగ‌త సీనియ‌ర్ న‌టులు డా. ఎం. ప్ర‌భాక‌ర్ రెడ్డి ప్ర‌య‌త్నాల కార‌ణంగా మ‌ణికొండ స‌మీపంలో సినీ కార్మికుల కోసం చిత్ర‌పురి కాల‌నీ కార్య‌రూపం దాల్చింది. అప్ప‌టి ముఖ్య‌మంత్రులు కాసు బ్ర‌హ్మానంద‌రెడ్డి ...మ‌ర్రి చెన్నారెడ్డి ద‌గ్గ‌రి నుంచి కోట్ల విజ‌య‌భాస్క‌ర్ రెడ్డి వ‌ర‌కు అంద‌రి తో సంప్ర‌దింపులు జ‌రిపి మొత్తానికి సినీ కార్మికుల చిర‌కాల స్వ‌ప్నం చిత్ర‌పురి కాల‌నీ కార్య‌రూపం దాల్చేలా చేయ‌డంలో ఎం. ప్ర‌భాక‌ర‌రెడ్డి కృషి అమోఘం. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఆయ‌న కృషి చేయ‌డం వ‌ల్లే చిత్రపురి కాల‌నీ సాకార‌మైంది. ఇది ప్ర‌తీ ఒక్క‌రూ యునానిమ‌స్ గా అంగీక‌రిస్తున్న విష‌యం. కాల‌నీ కోసం ప్ర‌భుత్వం 20 ఎక‌రాలు కేటాయిస్తే ఇందులో ప‌దెక‌రాల స్థలాన్ని కార్మికుల ఇళ్ల కోసం ప్ర‌భాక‌ర రెడ్డి దానం చేయ‌డం విశేషం.

అయితే ఇందులో కార్మికుల కోసం ప్ర‌త్యేకంగా హాస్పిట‌ల్ ని క‌ట్టించాల‌ని గ‌త కొన్నేళ్లుగా ప్ర‌తిపాద‌న‌లు జ‌రుగుతున్నాయి. దీన్ని మేము నెర‌వేరుస్తామ‌ని డా. ఎం. ప్ర‌భాక‌ర్ రెడ్డి కుమార్తెలు క‌రోనాకు ముందు మాటిచ్చార‌ట‌. దానికి సంబంధించిన ప‌నుల్లో వుండ‌గానే క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌బ‌ల‌డం.. జ‌న జీవనం స్థభించి పోవ‌డం తెలిసిందే. ఆ కార‌ణంగా డా. ఎం. ప్ర‌భాక‌ర్ రెడ్డి కుమార్తెల ప్ర‌య‌త్నాల‌కు ఇబ్బందులు ఏర్ప‌డ్డాయ‌ట‌. దాంతో వారు చిత్రపురిలో హాస్పిట‌ల్ నెల‌కొల్పాల‌న్న ప‌నుల‌కు ఆటంకం ఏర్ప‌డింద‌ని చెబుతున్నారు.

ఇదిలా వుంటే ఇటీవ‌ల జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో మెగాస్టార్ చిరంజీవి సినీ కార్మికుల కోసం త్వ‌ర‌లో ఓ ఆసుప‌త్రిని క‌ట్టిస్తాన‌ని ప్ర‌క‌టించారు. సెల‌బ్రిటీ క్రికెట్ లీగ్ మ్యాచ్ ల‌ని ఈ ఏడాది డ‌ల్లాస్ లో నిర్వ‌హించ‌బోతున్నారు. దీనికి సంబంధించిన మీడియా స‌మావేశంలో పాల్గొని మ్యాచ్ జెర్సీని, ట్రోఫీని ఆవిష్క‌రించి మెగాస్టార్ చిరంజీవి అనంత‌రం ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. చిరంజీవి మాట్లాడుతూ 'సినీ రంగంలో ఓ సినిమా నిర్మించాలంటే ఎంతో మంది కార్మికులు క‌ష్ట‌ప‌డ‌తార‌ని, వారి కోసం తాను త‌న తండ్రి కొణిదెల వెంక‌ట్రావు పేరుతో హాస్పిట‌ల్ నిర్మిస్తాన‌ని ప్ర‌క‌టించారు.

చిత్ర‌పురి కాల‌నీలో హాస్పిట‌ల్ నిర్మాణానికి ప్ర‌తిపాద‌న‌లు సిద్ధం చేసిన‌ట్టు ఆ ఆసుప‌త్రికి ఎంత ఖ‌ర్చు అయినా కూడా సొంత నిధుల‌తో నిర్మిస్తాన‌ని చెప్పారు. సినీరంగంలో త‌మ ఎదుగుద‌ల‌కు సినీ కార్మికులు ర‌కర‌కాల విభాగాల్లో స‌హ‌రిస్తున్న వారికి ఈ హాస్పిట‌ల్ నిర్మించి ఇవ్వ‌డం తాను కృత‌జ్ఞ‌త‌గా భావిస్తున్న‌ట్లుగా తెలిపారు. వ‌చ్చే ఏడాది క‌ల్లా ఈ హాస్పిట‌ల్ నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తాన‌ని చిరంజీవి వెల్ల‌డించారు. ఆసుప‌త్రి నిర్మాణానికి తాను కూడా ఓ మ్యూజిక్ కన్స‌ర్ట్ ని నిర్వ‌హిస్తాన‌ని, దాని ద్వారా వ‌చ్చిన మొత్తాన్ని హాస్పిట‌ల్ కోసం ఇస్తాన‌ని సంగీత ద‌ర్శ‌కుడు త‌మ‌న్ వెల్ల‌డించారు.

చిరు ప్ర‌క‌ట‌న‌పై డా. ఎం. ప్ర‌భాక‌ర్ రెడ్డి కుమార్తెలు అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ ఇటీవ‌ల ప్రెస్ క్ల‌బ్ లో మీడియా స‌మావేశాన్ని నిర్వ‌హించారు. చిత్ర పురి కాల‌నీలో డాక్ట‌ర్ ప్ర‌భాక‌ర రెడ్డి పేరు లేకుండా చేసే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని ఇది చాలా బాధాక‌ర‌మ‌న్నారు. మ‌ద్రాస్ నుంచి చిత్ర ప‌రిశ్ర‌మ హైద‌రాబాద్ కు త‌ర‌లించే స‌మ‌యంలో ప‌రిశ్ర‌మ‌లో వున్న 24 క్రాఫ్ట్స్ లో ప‌ని చేస్తున్న వారి కోసం ఎంతో శ్ర‌మించి అప్ప‌టి ముఖ్య‌మంత్రులతో మాట్లాడి డాక్ట‌ర్ ప్ర‌భాక‌ర్ రెడ్డి చిత్ర‌పురి కాల‌నీ ఏర్పాటు చేస్తే చిత్ర ప‌రిశ్ర‌మ‌లోని పెద్ద‌లు ఎప్పుడు ప్ర‌భాక‌ర రెడ్డి చిత్ర పురి కాల‌నీ అని చెప్ప‌ర‌ని కేవ‌లం చిత్ర‌పురి కాల‌నీ అనే సంబోధించ‌డం బాధాక‌ర‌మ‌న్నారు.

చిత్ర‌పురి కాల‌నీలో డాక్ట‌ర్ ప్ర‌భాక‌ర్ రెడ్డి చారిట‌బుల్ ట్ర‌స్ట్ ద్వారా ఆసుప‌త్రిని నెల‌కొల్పుతామ‌ని చిత్రపురి క‌మిటీకి 2 సంవ‌త్స‌రాల క్రితం తాము నివేదిక పంపి ఆసుప‌త్రి ఏర్పాటు, అనుమ‌తుల కోసం ప్ర‌త్నాలు సాగిస్తున్న త‌రుణంలో చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప్ర‌ముఖ వ్య‌క్తి త‌న తండ్రి పేరుతో హాస్పిట‌ల్ నిర్మిస్తాన‌ని ప్ర‌క‌టించ‌డం బాధాక‌ర‌మ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వీరి వాద‌న‌లోనూ నిజ‌ముంది. ఓకే కానీ చిత్రపురిలో హాస్పిట‌ల్ అనేది కార్మికుల కోసం దాన్ని ఎవ‌రు నిర్మిస్తే ఏంటీ? అన్న‌ది సామాన్యుడి వాద‌న‌. కోవిడ్ టైమ్ లో కార్మికుల్ని సీసీసీ పేరుతో ప్ర‌త్యేకంగా ఓ ట్ర‌స్ట్ ని ఏర్పాటు చేసి దాని ద్వారా ఇండ‌స్ట్రీ వ‌ర్గాల నుంచి నిధులు సేక‌రించి సినా కార్మికుల‌కు నిత్యావ‌సాలు స‌ర‌ఫ‌రా చేసిన ఘ‌న‌త చిరంజీవిది ఇందులో ఎలాంటి మొహ‌మాటం లేదు.

అంతే కాకుండా కోవిడ్ భయంతో బెంబేలెత్తిపోతున్న సినీ కార్మికుల‌కు సొంత ఖ‌ర్చుతో అపోలో హాస్పిట‌ల్స్ వారితో వ్యాక్సిన్స్ వేయించిన ఘ‌న‌త మెగాస్టార్ దే. ఇదే కాకుండా కార్మికుల కోసం డైరెక్ట‌ర్స్ అసోసియేష‌న్ కోసం సినీ ఇండ‌స్ట్రీకి త‌న వంతు బాధ్య‌త‌గా ఏదో ఒక‌టి చేయాల‌నే ప‌ట్టుద‌ల‌తో చిరు వున్నారు. గ‌త కొంత కాలంగా త‌న‌కు తోచిన సహాయాన్ని చేస్తూ వ‌స్తున్నారు. అలాంటి వ్య‌క్తి మా హాస్పిట‌ల్  ప్ర‌య‌త్నాల‌కు అడ్డుప‌డుతున్నార‌ని ఆరోప‌ణ‌లు చేయ‌డం క‌రెక్ట్ గా లేదు. ఇద్ద‌రికి ఇక్క‌డ ప్రాధాన్య‌త వుంది. ఇందులో ఎవ‌రు ఎక్కువ ఎవ‌రు త‌క్కువ కాదు. ఇద్ద‌రు ముఖ్య‌మే. అయితే చిరు లాంటి వాళ్లు తలుచుకుంటూ చిత్ర‌పురి ప‌క్క‌న వున్న ప‌దెక‌రాలు కూడా ప్ర‌భుత్వం కేటాయించే అవ‌కాశం వుంది. అందులోనే హాస్పిట‌ల్ ని నిర్మించ‌వ‌చ్చు. స‌క‌ల సౌక‌ర్యాల‌తో చిరు ఇందుకు ఏర్పాట్లు చేయ‌గ‌ల‌డ‌న్నది అందిరికి తెలిసిందే. ఆయ‌న హాస్పిట‌ల్ ని నిర్మించినా ప్ర‌భాక‌ర్ రెడ్డిని గౌర‌విస్తూ ఆయ‌న పేరు పెడితే ఎలాంటి వివాదం వుండ‌ద‌న్న‌ది సామాన్యుడి ఆలోచ‌న‌.
Tags:    

Similar News