ఫ్ర‌స్టేష‌న్ లో వేధింపుల ఆరోప‌ణ‌లా?

Update: 2019-09-07 01:30 GMT
2018-19 సీజ‌న్ టాలీవుడ్ కి బ్యాడ్ డేస్ ర‌న్ అవుతున్నాయ‌నే చెప్పాలి. ఒక ర‌కంగా ప‌రువు తీసి పందిరేసిన  సీజ‌న్ ఇది. న‌టి శ్రీ‌రెడ్డి ఉదంతం మొద‌లు.. వ‌రుస సీక్వెన్స్ వివాదాలు టాలీవుడ్ ప‌రువు మర్యాద‌ల్ని ర‌క‌ర‌కాల కోణాల్లో మంట క‌లిపాయి. జ‌ర్న‌లిస్టిక్ విలువ‌ల్లేని కొన్ని యూట్యూబ్ మీడియాల దెబ్బ‌కు ప‌రువు తీసి పందిరేసేవాళ్లు బ‌య‌ట‌ప‌డ్డారు.

చాలా మంది ఆర్టిస్టులు మోసానికి గుర‌య్యాన‌ని యూట్యూబ్ వేదిక‌ల‌పైకి వ‌స్తున్నారు. ఏళ్ల‌కు ఏళ్లుగా సాగుతున్న క్ర‌తువులో.. ఇన్నాళ్లు లేనిది ఇప్పుడు సోష‌ల్ మీడియాలు- యూట్యూబ్ అండ‌తో బ‌య‌ట‌ప‌డుతున్నారు. మీటూ వేదిక‌గా అప్ప‌ట్లో కొంద‌రు న‌టీమ‌ణులు ధైర్యం చేసి తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. కానీ యూట్యూబ్ వేదిక‌గా బ‌య‌ట‌ప‌డుతున్న జూ.ఆర్టిస్టుల‌తోనే ప‌రువంతా పోతోంది. వేధింపులు జ‌రిగిన‌ప్పుడు చ‌ప్పుడు లేదు. క‌మిట్ మెంట్లకు అంగీక‌రించిన‌ప్పుడు సౌండ్ లేనేలేదు. కానీ ఏళ్లు గ‌డిచాక .. ఆరోప‌ణ‌లు చేస్తూ ఏహ్య‌భావం క‌లిగేలా చేస్తున్నారు.  వేధింపులు ఎదురైతే ధైర్యంగా వెంట‌నే ఎందుకు చెప్ప‌డం లేదు? అన్న సందేహాలొస్తున్నాయి. అప్పుడు కావాల‌ని క‌మిటై ఇప్పుడు బ‌య‌ట‌ప‌డుతున్నార‌న్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. అయినా ఇన్నాళ్ల త‌ర్వాత వీళ్లంతా స‌రైన ఆధారాలు చూపించ‌గ‌ల‌రా?  నిరాధార ఆరోప‌ణ‌లు నిల‌బ‌డ‌తాయా?

మీటూ ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్న కేసుల్లో ఇంత‌వ‌ర‌కూ ఎవ‌రూ వాటిని నిరూపించ‌లేక‌పోయారు. సీనియ‌ర్ న‌టుడు నానా ప‌టేక‌ర్ - సూప‌ర్ 30 ద‌ర్శ‌కుడు వికాష్ బాల్ వీళ్లంద‌రికీ కోర్టుల్లో క్లీన్ చిట్ వ‌చ్చింది. టాలీవుడ్ లోనూ ప‌లువురు జూనియ‌ర్ ఆర్టిస్టులు తీవ్రంగా ఆరోప‌ణ‌లు చేస్తూ యూట్యూబ్ చానెళ్ల‌లో ఇంట‌ర్వ్యూల‌తో విరుచుకుప‌డుతున్నారు. ఏది ఎప్పుడు ఏ ఇంట‌ర్వ్యూలో బ‌య‌ట‌ప‌డుతుందో తెలీని ప‌రిస్థితి. ఏళ్ల‌కు ఏళ్లుగా జ‌రిగిన తంతుపై ఇన్నేళ్ల త‌ర్వాత ఓపెన్ అయితే చ‌ట్ట ప‌రంగా దానికి అండ ఎంత‌? అన్న‌ది ఎవ‌రికీ తెలీని స‌న్నివేశం నెల‌కొంది.

అయితే టాలీవుడ్ ప‌రువు మ‌ర్యాద‌లు మంట‌క‌లిపే ఇలాంటి వాటిపై చ‌ర్య‌లు తీసుకునేందుకు లేదా నిలువ‌రించేందుకు కాష్ క‌మిటీని ఎంపిక చేశారు. ఆ క‌మిటీ వ‌చ్చాక ప్ర‌తి ఆఫీస్ ముందు వేధింపుల‌కు గుర‌యితే మెయిల్ చేయండి అంటూ ఐడీలు ఇచ్చారు. ఫోన్ నంబ‌ర్లు పొందు ప‌రిచారు. కానీ ఏం లాభం?అస‌లింత‌కీ టాలీవుడ్ లో కాష్ క‌మిటీ ఏం చేస్తున్న‌ట్టు?  సినీ చాన్సుల్లేక ఆరోపిస్తున్నారా.. లేక నిజంగానే వేధింపులు ఎదుర‌వ్వ‌డం వ‌ల్ల‌నే ఇలా ఆరోపిస్తున్నారో తెలీని ప‌రిస్థితి. ఇక టాలీవుడ్ ప‌రువు తీసే వాళ్ల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల్సిన మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) కూడా చోద్యం చూస్తూ ఉంది. ఇలా భ‌రితెగించి ఆరోపిస్తుంటే స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌కుండా గాలికి వ‌దిలేశారు. టాలీవుడ్ ప‌రువు తీసే వారిని ఆప‌లేరా?  అంత‌ర్గ‌తంగా మాట్లాడి ప‌రిష్క‌రించాల్సిన చాలా విష‌యాలు మీడియాల‌కెక్కుతున్నాయి. క‌మిటీలు వేసింది గాలి క‌బుర్లు చెప్పేందుకేనా? అన్న సందేహాలొస్తున్నాయి.



Tags:    

Similar News