నాని ఒక్క‌డిపైనే అక్క‌సు తో ఏం ప్ర‌యోజ‌నం?

Update: 2021-09-02 07:33 GMT
నేచుర‌ల్ స్టార్ నాని క‌థానాయ‌కుడిగా న‌టించిన `ట‌క్ జ‌గ‌దీష్` రిలీజ్ విష‌యంలో నానికి-డిస్ట్రిబ్యూట‌ర్లు.. ఎగ్జిబిట‌ర్ల మ‌ధ్య త‌లెత్తిన వివాదం గురించి తెలిసిందే. క‌రోనా మ‌హ‌మ్మారి ప‌రిస్థితుల నేప‌థ్యంలో నాని నిర్మాత‌ల వైపు ఓటీటీ రిలీజ్ కు మ‌ద్ద‌తుగా మాట్లాడటం.. అటుపై నాని వ్యాఖ్య‌ల్ని ఎగ్జిబిట‌ర్లు ఖండించ‌డం.. సీరియ‌స్ గా నానిపై వ్యాఖ్య‌లు చేయ‌డం పెద్ద దుమారమే రేపింది. తాజాగా నిన్న‌టి రోజు సినిమా ట్రైల‌ర్ రిలీజ్ సంద‌ర్భంగా ఓ పాత్రికేయుడు అడిగిన‌ ప్ర‌శ్న‌కు నాని మ‌ళ్లీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు.


ఓటీటీ రిలీజ్ విష‌యంలో ఎగ్జిబిట‌ర్లు సంతృప్తిగా లేరు.. మిమ్మ‌ల్ని బ్యాన్ చేస్తామ‌న్నారు? అంటూ కొన్ని వ్యాఖ్య‌లు చేసారు క‌దా! దానికి మీ స‌మాధానం? అని విలేక‌రి ప్ర‌శ్నించ‌గా.. దానికి నాని ఊహించ‌ని విధంగా స్పందించి షాక్ ఇచ్చారు. `ఎగ్జిబిట‌ర్లు త‌మ వెర్ష‌న్ ని చెప్పుకొచ్చారు. అందులో ఎంత మాత్రం త‌ప్పులేదు. వారంతా నాక‌న్నా పెద్ద‌వాళ్లు. వారి ప‌రిస్థితుల్లో వాళ్లు అలా మాట్లాడం క‌రెక్టే. కానీ ఆ కాసేపు వాళ్లంతా న‌న్ను బ‌య‌టివాడిలా చూసారు. అదే నా బాధ. వారి బాధ‌ను నేను అర్ధం చేసుకుంటాను. నన్ను కూడా వారిలో ఒక‌డిగా గుర్తించాలి. థియేట్రిక‌ల్ రిలీజ్ కి వ్య‌తిరేకిని కాదు. ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డిన త‌ర్వాత థియేట‌ర్లోనే సినిమాల్ని రిలీజ్ చేస్తాం. అలాగే న‌న్ను బ్యాన్ చేసే అవ‌కాశం ఇవ్వ‌ను. నిజంగా ఆ ప‌రిస్థితి వ‌స్తే నాకు నేనుగానే త‌ప్పుకుంటాను` అని నాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు.

నాని చేసిన ఈ వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. ఏడాదిన్న‌ర క్రితం వ‌ర‌కూ సినిమాల‌న్నీ థియేట‌ర్లోనే రిలీజ్ అయ్యేవి. క‌రోనా రాక‌తోనే నిర్మాత‌లు ఓటీటీ బాట ప‌ట్టారు. ప‌రిస్థితులు బాగుంటే థియేట‌ర్లోనే రిలీజ్ చేస్తామ‌ని నిర్మాత‌లు కూడా వివ‌ర‌ణ ఇచ్చారు. అలాగే సినిమా రిలీజ్ అనేది నిర్మాత ఇష్ట ప్ర‌కారం జ‌రుగుతుంది. తెలంగాణ నిర్మాత‌ల సంఘం గిల్డ్ కూడా నాని వ్యాఖ్య‌ల్ని స‌మ‌ర్ధించిన సంగ‌తి తెలిసిందే. డి.సురేష్ బాబు స‌హా ప‌లువురు ప్ర‌ముఖులు స్వేచ్ఛ‌గా త‌మ సినిమాల్ని ఓటీటీల్లో రిలీజ్ చేసుకుంటున్నారు. నానీ ఒక్క‌డిపైనే అక్క‌సు వెల్ల‌గ‌క్కినాప ప్ర‌యోజనం ఏం ఉంటుంది? అన్న విమ‌ర్శ‌లు ఉన్నాయి.

బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో బిజీ

నాని వెంట వెంట‌నే సినిమాలకు అంగీక‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. కెరీర్ లో నాని ఎన్నో వైవిధ్య‌మైన పాత్ర‌ల‌ను ఎంచుకున్నారు. ఇప్ప‌డు ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించే MRO గా అత‌డు ట‌క్ జ‌గ‌దీష్ చిత్రంలో న‌టించారు. ట‌క్ జ‌గ‌దీష్ అనే అధికారిగా నాని విన్యాసాలు తెర‌పై వీక్షించే అవ‌కాశం ఉంది. ఈ సినిమా పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో రూపొందించారు. టీజ‌ర్ లో నాని స్టైలిష్ గా ట‌క్ చేసుకుని అటుపై పొలంలో దిగి గొడ‌వ‌కి రెడీ అవుతున్న వైనం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అయితే ఈ పాత్ర ట‌క్ టిక్కు వెన‌క కార‌ణం కూడా అంతే బ‌లంగా ఉంది. అత‌డు మండల రెవెన్యూ అధికారి (MRO) గా క‌నిపిస్తార‌ట‌. అంటే అధికారిగా ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం ఎదుర్కోవాల్సి ఉంటుంది. నాని గ‌ట్స్ ఉన్న ఎంఆర్వో గా భ‌యంలేని వాడిగా క‌నిపిస్తాడ‌ని తెలిసింది. దర్శకుడు శివ నిర్వాణ `టక్ జగదీష్` పాత్రను బలమైన భావోద్వేగాలు కుటుంబ బంధాలతో రూపొందించారు. షైన్ స్క్రీన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది.

శ్యామ్ సింఘ‌రాయ్ భారీ ప్ర‌యోగం

నాని త‌దుప‌రి చిత్రం `శ్యామ్ సింఘరాయ్` భారీ ప్ర‌యోగం అన్న సంగ‌తి తెలిసిందే. కోవిడ్ భ‌యాల న‌డుమ ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకుని షూటింగ్ పూర్తి చేసారు. 6.5 కోట్ల‌తో కోల్ క‌తా సెట్ నిర్మించి పూర్తిగా కోల్ క‌తా జూనియ‌ర్ ఆర్టిస్టులు ఇత‌ర భారీ కాస్టింగ్ తో కీల‌క‌మైన షూటింగ్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ మూవీ లో న‌టిస్తున్న సాయిప‌ల్ల‌వి లుక్ రిలీజ్ చేయ‌గా అద్భుత స్పంద‌న వచ్చింది. సాంప్రదాయ బెంగాలీ ప‌ట్టు చీర‌లో సాయి పల్లవి ఎంతో గంభీరంగా కనిపించింది. మండుతున్న త్రిశూలాన్ని పట్టుకొని నృత్యకారిణిగా హావ‌భావాలు ప‌లికిస్తున్న పోస్ట‌ర్ దూసుకెళ్లింది. ప్రతి పాత్ర‌ను విలక్షణంగా ఆవిష్క‌రించే శ్యామ్ సింఘరాయ్ లో నానీ బెంగాలీ కుర్రాడిగా క‌నిపిస్తారు. నాని బ‌ర్త్ డే కానుక‌గా రిలీజైన‌ ఫస్ట్ లుక్ పోస్టర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా హైదరాబాద్ లో 10 ఎకరాల్లో అసాధార‌ణంగా కోల్ కతా సెట్ ని నిర్మించారు. సాయి పల్లవితో పాటు ఈ చిత్రంలో కృతి శెట్టి- మడోన్నా సెబాస్టియన్ ఇతర నాయిక‌లుగా నటించారు. ఈ చిత్రంలో జిషు సేన్ గుప్తా- రాహుల్ రవీంద్రన్- మురళి శర్మ- అభినవ్ గోమతం ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. నిహారికా ఎంటర్ టైన్మెంట్ సంస్థ‌లో తొలి చిత్ర‌మిది. సత్యదేవ్ జంగా క‌థ అందించారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తుండ‌గా.. సాను జాన్ వర్గీస్ ఛాయాగ్ర‌హ‌ణం అందిస్తున్నారు.




Tags:    

Similar News