ఆ చిత్రం చేయొద్దు : పూరీ ద్వారా వర్మకు మెసేజ్!

Update: 2017-09-20 19:11 GMT
రాంగోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా చేస్తున్నట్లుగా ప్రకటన చేసిన నేపథ్యంలో టాలీవుడ్ లో ప్రకంపనలు నడుస్తున్నాయి. ఎన్టీఆర్ జీవిత కథను తాను చిత్రంగా చేయబోతున్నట్లు, తండ్రి పాత్రను తానే పోషించబోతున్నట్లు బాలకృష్ణ ప్రకటించిన తర్వాత.. వర్మ చెబుతున్న ఈ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రంలో ప్రధాన కథాంశం ఏం ఉంటుందో అనే ఆసక్తి సహజంగా అందరికీ ఉంటుంది. కొందరికి క్లారిటీ కూడా వచ్చేస్తుంది. అయితే ఫిలింనగర్లో తాజాగా వినిపిస్తున్న గుసగుసల్ని బట్టి.. ఈ చిత్రం చేయవద్దంటూ రాంగోపాల్ వర్మకు మెసేజ్ పంపడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

రాంగోపాల్ వర్మ శిష్యుల్లో ఆయనకు అత్యంత ఆప్తుల్లో ఒకరుగా పూరీ జగన్నాధ్ గురించి చెబుతుంటారు. బాలయ్య ఇటీవలి చిత్రం పైసావసూల్ దర్శకుడిగా... బాలయ్య వర్గంతో పూరీకి మరింత అనుబంధం కూడా ఏర్పడింది. అయితే బాలకృష్ణ కు సన్నిహితులైన కొందరు పెద్దలు.. పూరీ జగన్నాధ్ ద్వారా వర్మకు సందేశం పంపడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. బాలయ్య ఎన్టీఆర్ జీవితం పై ఎటూ చిత్రం చేయబోతున్నారు గనుక.. దానితో కాంట్రడిక్ట్ అయ్యే ప్రమాదం ఉంది గనుక.. వర్మను ఈ ప్రాజెక్టు చేయవద్దని కోరాలన్నట్లుగా సాఫ్ట్ గా వీరు చెబుతున్నట్లు సమాచారం.

ఒక రకంగా చెప్పాలంటే రాంగోపాల్ వర్మ తాను ఒక పనిచేయదలచుకున్న తర్వాత.. ఎవ్వరి మాటా వినే రకం కాదు. ఎవ్వరి ఒత్తిళ్లకు తలొగ్గే రకం కాదు. ఇదివరకు కొన్ని చిత్రాల విషయంలో ప్రాణహాని వంటి బెదిరింపులనే పట్టించుకోకుండా వర్మ తన చిత్రాలు చేసుకుంటూ పోయారు. అలాంటిది ఇప్పుడు బాలకృష్ణ వర్గం నుంచి అందే సందేశాలను ఖాతరు చేస్తారా అనేది పలువురిలో కలుగుతున్న సందేహంగా ఉంది.

బాలకృష్ణ వర్గంలోని వ్యక్తులు ఈ ప్రయత్నం చేస్తున్నప్పటికీ, ఆయనకు ఇష్టం లేదు గనుకనే, ఆయన నేరుగా అడిగితే బాగుండదు గనుకనే ఇలా జరుగుతున్నట్లు అనుకుంటున్నారు. అయితే పూరీ జగన్నాధ్.. వీరి అభిప్రాయాన్ని.. వర్మకు చేరవేస్తాడా లేదా..? వర్మ ఒప్పుకుంటాడా లేదా? అనేది మాత్రం సందేహమే.
Tags:    

Similar News