కాపీ సినిమాకు ఇంత బిల్డప్పా..

Update: 2018-06-26 14:30 GMT
టిక్ టిక్ టిక్.. గత శుక్రవారం విడుదలైన తమిళ డబ్బింగ్ సినిమా ఇది. దీనికి టాక్ పర్వాలేదు. ఓపెనింగ్స్ కూడా బాగానే వచ్చాయి. పోటీగా విడుదలైన ‘జంబలకిడి పంబ’ తేలిపోవడం దీనికి కలిసొచ్చింది. పోస్ట్ రిలీజ్ ప్రమోషన్లతో కొంచెం హడావుడి చేస్తున్నారు. విడుదలకు ముందు సినిమాను పట్టించుకోని హీరో జయం రవి.. రిలీజ్ తర్వాత హైదరాబాద్ వచ్చి సినిమాను ప్రమోట్ చేశాడు. తమిళంలో ఈ చిత్రం ఇంకా బాగా ఆడుతోంది. హౌస్ ఫుల్ కలెక్షన్లతో రన్ అవుతోంది. కాకపోతే ఈ సినిమా గురించి చిత్ర బృందం గొప్పలు పోతున్న తీరే ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇండియాస్ ఫస్ట్ స్పేస్ ఫిలిం అంటూ దీని గురించి జబ్బలు చరుచుకుంటోంది. ఇలాంటి సాహసం ఎవ్వరూ చేయలేదని.. తమది గొప్ప సినిమా అని చెప్పుకుంటోంది.

కానీ ‘టిక్ టిక్ టిక్’ కంటే ముందు చాలా ఏళ్ల కిందటే తెలుగులో ‘అమృతంలో చందమామ’ అనే స్పేస్ ఫిలిం వచ్చింది. ఇందులో మాదిరే అందులో సగం సినిమా అంతరిక్షంలోనే నడుస్తుంది. ఆ లెక్కన ఇండియాలో అదే ఫస్ట్ స్పేస్ ఫిలిం అని చెప్పాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ‘టిక్ టిక్ టిక్’లో అసలు దర్శకుడి క్రియేటివిటీ అంటూ ఏమీ లేదు. ఇది మొత్తం హాలీవుడ్ స్పేస్ సినిమాల నుంచి కాపీ చేసిన సీన్లతో నింపేసిన సినిమా. 1998లో విడుదలైన ‘ఆర్మెగెడాన్’ నుంచి కథతో పాటు చాలా సీన్లు లేపేశారు. ఇంతకంటే ముందు వచ్చిన మరి కొన్ని సినిమాల సీన్లు కూడా కాపీ కొట్టారు. హాలీవుడ్ స్పేస్ సినిమాల్ని ఫాలో అయ్యేవాళ్లకు ఇందులో రవ్వంతైనా ఒరిజినాలిటీ కనిపించడం లేదు. మొత్తం సినిమా అంతా కాపీనే అని.. స్పేస్‌ కు సంబంధించి ఒక్క సీన్ కూడా కొత్తది లేదని.. అక్కడా ఇక్కడా సీన్లు లేపుకొచ్చేసి గొప్ప సినిమా తీసేసినట్లు జబ్బలు చరుచుకోవడం ఏంటని విమర్శిస్తున్నారు సోషల్ మీడియాలో.
Tags:    

Similar News