క‌రోనా సెకండ్ వేవ్ః 50 శాతం కెపాసిటీతోనే సినిమా థియేట‌ర్లు.. ప్ర‌భుత్వ ఆదేశాలు

Update: 2021-03-19 15:30 GMT
దేశంలో క‌రోనా ఉధృత‌మైంది.. మ‌ధ్య‌లో కాస్త త‌గ్గింది.. మ‌ళ్లీ సెకండ్ వేవ్ సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. కానీ.. మ‌హారాష్ట్ర‌లో మాత్రం ఏక‌ధాటిగా కేసుల సంఖ్య పెర‌గ‌డ‌మే త‌ప్ప‌, త‌గ్గ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం..! అక్క‌డ ప‌రిస్థితి రోజురోజుకూ దిగ‌జారుతోంది. ప్ర‌ధానంగా ముంబైలో కేసులు ఉధృతంగా పెరుగుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లోనే సుమారు 26 వేల కేసులు న‌మోదు కావ‌డం.. ప‌రిస్థితి తీవ్ర‌త‌కు అద్దం ప‌డుతోంది.

దీంతో రాష్ట్ర ప్ర‌భుత్వం తాజాగా క‌ఠిన నిర్ణ‌యాలు ప్ర‌క‌టించింది. సినిమా హాళ్లు, ప్ర‌భుత్వ కార్యాల‌యాలు, ఇత‌ర ఆఫీసులు 50 శాతం మందితోనే ప‌ని చేయాల‌ని ఆదేశించింది. అవ‌కాశం ఉన్న సంస్థ‌లు వ‌ర్క్ ఫ్రం హోం అమ‌లు చేయాల‌ని సూచించింది. ఫ్యాక్ట‌రీలు, వాణిజ్య స‌ముదాయాల్లో శానిటైజేష‌న్ ప్ర‌క్రియ స‌మ‌ర్థ‌వంతంగా చేప‌ట్టాల‌ని ఆదేశించింది.

ఇక‌, జ‌నాలు ఎక్కువ‌గా సంద‌ర్శించే షాపింగ్ మాల్స్‌, అన్ని ర‌కాల మార్కెట్లలో భౌతిక దూరం పాటించాల‌ని, జ‌నాలు తప్ప‌నిస‌రిగా మాస్కు ధ‌రించాల‌ని సూచించింది. క్యాంటీన్లు, హోట‌ళ్ల‌ను ప్ర‌తీ రెండు గంట‌ల‌కు ఒక‌సారి శానిటైజ్ చేయాల‌ని ఆదేశించింది. ఈ నిబంధ‌న‌లు ప్ర‌జ‌లు త‌ప్ప‌కుండా పాటించాల‌ని సూచించింది.

ప్ర‌భుత్వ ఆదేశాల‌ను ఎవ‌రు బేఖాత‌రు చేసినా.. క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించింది. ఈ ఆదేశాలు మార్చి 31వ తేదీవ‌ర‌కు అమ‌ల్లో ఉంటాయ‌ని తెలిపింది. ఆఫీసులు ఏవైనా నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే.. వాటిని మూసేస్తామ‌ని, మ‌ళ్లీ అనుమ‌తులు వ‌చ్చే వ‌రకూ ఓపెన్ కాకుండా చూస్తామ‌ని హెచ్చ‌రించింది. ఈ నిబంధ‌న‌లను ప్ర‌జ‌లు పాటించ‌క‌పోతే.. మ‌రోసారి క‌ఠిన లాక్ డౌన్ విధిస్తామ‌ని హెచ్చ‌రించింది ఉద్ధ‌వ్ స‌ర్కార్‌.
Tags:    

Similar News