వర్మ 'మర్డర్‌' కు కోర్టు గ్రీన్ సిగ్నల్‌!

Update: 2020-11-06 10:30 GMT
వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ రూపొందించిన 'మర్డర్‌' సినిమా విడుదలను అడ్డుకుంటూ అమృత కోర్టుకు వెళ్లిన నేపథ్యంలో నల్లగొండ కోర్టు సినిమా విడుదలపై స్టే విధించింది. నల్లగొండ కోర్టు స్టేను హైకోర్టు కొట్టి వేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రణయ్‌.. అమృతల ప్రేమ కథ ఆ తర్వాత జరిగిన పరిణామాలు మారుతిరావు చనిపోవడం ఇలా అన్ని విషయాలను ఈ సినిమాలో వర్మ తెర రూపం ఇచ్చాడు. ఈ సినిమాలో అమృతను నెగటివ్‌ షేడ్స్ తో వర్మ చూపించినట్లుగా ప్రోమో మరియు ఫొటోలను చూస్తుంటే అనిపిస్తుంది అంటూ నెటిజన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

మర్డర్‌ సినిమాను తన కథతో తన అనుమతి లేకుండా వర్మ తీశాడు అంటూ అమృత పోలీసులకు ఫిర్యాదు చేయడం కోర్టుకు వెళ్లడం జరిగింది. ఇప్పుడు వర్మకు అనుకూలంగా హైకోర్టులో తీర్పు రావడంతో సినిమా విడుదలకు సిద్దం చేస్తున్నట్లుగా వర్మ సోషల్‌ మీడియా ద్వారా తెలియజేశాడు. మర్డర్‌ సినిమాకు గౌరవనీయమైన కోర్టు నుండి అనుమతి రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ విషయాన్ని ప్రకటిస్తున్న నాకు ఆనందంగా ఉందంటూ వర్మ ట్విట్టర్‌ లో పేర్కొన్నాడు. త్వరలో పూర్తి వివరాలను వెళ్లడిస్తామంటూ అందరికి వర్మ కృతజ్ఞతలు తెలియజేశాడు. ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేస్తాడా లేదంటే ఓటీటీ ద్వారా విడుదల చేస్తాడా అనే విషయమై అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Tags:    

Similar News