నా వ్యాఖ్య‌ల‌ను మ‌ర్చిపోండి: మెగాభిమానుల‌ను కోరిన సీపీఐ నారాయ‌ణ‌!

Update: 2022-07-20 08:44 GMT
పీఐ జాతీయ కార్య‌ద‌ర్శి నారాయ‌ణ.. కొద్ది రోజుల క్రితం తిరుప‌తిలో మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారాన్ని రేపిన సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవిని చిల్ల‌ర బేరగాడు, బ్రోక‌ర్, రాజ‌కీయ ఊస‌ర‌వెల్లి అంటూ దూషించిన వ్యాఖ్య‌లు మెగాభిమానుల్లో కాక రేపాయి. అలాగే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ల్యాండ్ మైన్ అని.. అయితే ఎప్పుడు ఈ ల్యాండ్ మైన్ పేలుతుందో తెలియ‌దని నారాయ‌ణ ఎద్దేవా చేశారు.

నారాయ‌ణ వ్యాఖ్య‌ల‌పై మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు నిప్పులు చెరిగిన సంగ‌తి తెలిసిందే. నారాయ‌ణ అన్నం తిన‌డం మానేసి ఎండు గ‌డ్డి, చెత్తాచెదారం తింటున్నాడ‌ని తిట్టిపోశారు. అంతేకాకుండా అభిమానులు ఆయ‌న‌ను చెత్త తిన‌కుండా అన్నం తినేలా చేయాల‌ని కోరారు.

మరోవైపు చిరంజీవి అభిమాన సంఘాల అధ్య‌క్షులు, కాపునాడు సంఘాలు నారాయ‌ణ‌పై తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తాయి. చిరంజీవికి భేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ చెప్పాల‌ని డిమాండ్ చేశాయి.

ఈ నేప‌థ్యంలో నాగ‌బాబు, మెగాభిమానుల ఆగ్ర‌హం నేప‌థ్యంలో సీపీఐ నేత నారాయ‌ణ దిగివ‌చ్చారు.

చిరంజీవిపై కొద్ది రోజుల క్రితం తాను చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించకూడదనుకుంటున్నాను. ఇది భాషా లోపంగా భావించి.. మీడియా ముందు తాను చెప్పినదంతా ఉపసంహరించుకుంటున్నాన‌ని పేర్కొన్నారు. చిరంజీవిపై తాను చేసిన వ్యాఖ్య‌ల‌ను మర్చిపోవాలని మెగా అభిమానులను, కాపు నాడు నాయకులను కోరుతున్నాను అని నారాయ‌ణ తాజాగా మీడియాకు తెలిపారు.

అయితే నారాయ‌ణ కేవ‌లం త‌న వ్యాఖ్య‌ల‌కు విచారం మాత్ర‌మే వ్య‌క్తం చేశారు. క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌లేదు. దీనిపై మ‌రి మెగాభిమానులు, జ‌న‌సేన పార్టీ శ్రేణులు ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సిందే. మ‌రీ ముఖ్యంగా చిరంజీవి సోద‌రుడు నాగ‌బాబు ఇంత‌టితో ఈ వివాదాన్ని వ‌దిలివేస్తారో, లేదో కూడా చూడాల్సి ఉంద‌ని అంటున్నారు.

భీమ‌వ‌రంలో అల్లూరి సీతారామ‌రాజు విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు చిరంజీవిని ఆహ్వానించ‌డంపై నారాయ‌ణ రెండు రోజుల క్రితం తిరుప‌తిలో ఘాటు వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.
Tags:    

Similar News