క్రేజీ హీరోయిన్ కి అండ‌గా బ‌న్నీ!

Update: 2022-07-29 08:33 GMT
తెలుగులో ఒక‌ప్పుడు ప్ర‌తి స్టార్ హీరో జ‌పించిన పేరు ర‌కుల్ ప్రీత్ సింగ్. మాస్ మ‌హారాజా ర‌వితేజ నుంచి బెల్లంకొండ శ్రీ‌నివాస్ వ‌ర‌కు ప్ర‌తీ స్టార్ హీరో ర‌కుల్ వెంట ప‌డ్డారు. ఒకే ఏడాది వ‌రుస‌గా ఇండ‌స్ట్రీలో వున్న క్రేజీ స్టార్ హీరోల‌తో క‌లిసి సినిమాలు చేసి వ‌రుస సూప‌ర్ హిట్ ల‌ని సొంతం చేసుకుంది. 2016లో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తో 'నాన్నకు ప్రేమ‌తో', అల్లు అర్జున్ తో 'స‌రైనోడు', మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తో 'ధృవ‌' వంటి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బ‌స్ట‌ర్ ల‌ని సొంతం చేసుకుని అరుదైన రికార్డుని సొంతం చేసుకుంది.

కింగ్ నాగార్జున‌తో క‌లిసి న‌టించిన 'మ‌న్మ‌ధుడు 2' త‌రువాత ర‌కుల్ కు తెలుగులో పెద్ద‌గా సినిమాలు లేవు. ఆఫ‌ర్లు ఇచ్చేవారు కూడా క‌రువ‌య్యారు. ఇదే స‌మ‌యంలో బాలీవుడ్ బాట ప‌ట్టిన ర‌కుల్ అక్క‌డ అజ‌య్ దేవ్ గ‌న్ తో క‌లిసి న‌టించిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ 'దేదే ప్యార్ దే'తో సూప‌ర్ హిట్ ని సొంతం చేసుకుంది.

మ‌ర్జావా, సిమ్లా మిర్చి వంటి చిత్రాల‌తో అక్క‌డ బిజీ అయిపోయింది. మ‌ధ్య‌లో చెక్‌, కొండ పొలం వంటి చిత్రాల‌తో తెలుగులో మ‌ళ్లీ రైజ్ అవ్వాల‌ని ప్ర‌య‌త్నించినా పెద్ద‌గా ఉప‌యోగం లేకుండా పోయింది.

నితిన్ తో చేసిన 'చెక్‌', పంజా వైష్ణ‌వ్ తేజ్ తో చేసిన 'కొండ పొలం' బాక్సాఫీస్ వ‌ద్ద కొండెక్కాయి. తీవ్ర నిరాశ‌కు గురిచేశాయి. దీంతో తెలుగులో ర‌కుల్ కు ఉన్న అవ‌కాశాలు కూడా పోయాయి. ఈ నేప‌థ్యంలో ర‌కుల్ కంప్లీట్ గా బాలీవుడ్ కే ప‌రిమితం కావాల్సి వ‌చ్చింది. బాలీవుడ్ లో మిష‌న్ సిండ్రెల్లా, డాక్ట‌ర్ జీ, థాంక్ గాడ్, కండోమ్ ప్ర‌చారం చేసే యువ‌తి క‌థ‌తో 'ఛ‌త్రీవాలీ' చిత్రాల్లో న‌టిస్తోంది. ఇవ‌న్నీ ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అవుతున్నాయి.

కానీ ప్ర‌స్తుతం త‌న చేతిలో ఒక్క హిందీ సినిమా కూడా లేదు. దీంతో ర‌కుల్ తాజాగా జాక్కీ భ‌గ్నానీ అండ్ జ‌స్ట్ మ్యూజిక్ స‌మ‌ర్ప‌ణ‌లో రూపొందిన 'మాషుక' అనే మ్యూజిక్ వీడియోలో న‌టించింది. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఈ వీడియో సాంగ్ ని స్టార్ హీరో అల్లు అర్జున్ శుక్ర‌వారం సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ వేదిక‌గా విడుద‌ల చేశారు. 'నా అభిమాన వ్య‌క్తి ర‌కుల్ ప్రీత్ సింగ్ కు నా హృద‌య‌పూర్వ‌క శుభాకాంక్ష‌లు. నా ఫేవ‌రేట్ ప‌ర్స‌న్ ఫ‌స్ట్ మ్యూజిక్ వీడియోని రిలీజ్ చేస్తున్నందుకు ఆనందంగా వుంది. ఇది మీ అంద‌రి హృద‌యాల‌ని తాకుతుంద‌ని ఆశిస్తున్నాను. టీమ్ అంద‌రికి శుభాకాంక్ష‌లు' అని బ‌న్నీ ట్వీట్ చేశారు.  

తెలుగులో ఈ సాంగ్ నికు రామ‌జోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. పెప్పీ డాన్సింగ్ నంబ‌ర్ గా సాగే ఈ పాట ప్ర‌తీ ఒక్క‌రినీ ఆక‌ట్టుకునేలా వుంది. త‌నిష్క్ బ‌గ్చి సంగీతం అందించినా ఈ పాట‌ని ఆదిత్య అయ్యంగార్‌, ఆసిస్ కౌర్ ఆల‌పించారు. ఇదిలా వుంటే బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర్జున్ తో క‌లిసి ర‌కుల్ ప్రీత్ సింగ్ 'స‌రైనోడు' చిత్రంలో న‌టించిన విష‌యం తెలిసిందే.

Full View
Tags:    

Similar News