సక్సెస్ దారి చూపిస్తున్న క్రైమ్

Update: 2019-08-15 05:01 GMT
సినిమా పరిశ్రమలో ట్రెండ్ అనేది సహజంగా వినిపించే పదం. అప్పుడెప్పుడో పెళ్లి సందడి-హం ఆప్కే హై కౌన్ ఇండస్ట్రీ హిట్స్ అయితే కొన్నేళ్ల పాటు తెరను మ్యారేజ్ సినిమాలు రాజ్యమేలాయి. సమరసింహారెడ్డి వచ్చినప్పుడు ఫ్యాక్షన్ జోనర్ ని ప్రేక్షకులకు మొహం మొత్తేదాకా దర్శకులు హీరోలు రుద్దుతూనే వచ్చారు. కాలం మారింది. అభిరుచుల్లో తేడాలు వచ్చాయి. ప్రేక్షకులు ఎక్కువ డ్రామా లేకుండా తమను రెండు గంటల పాటు ఎంగేజ్ చేసే సినిమాలను హీరోతో సంబంధం లేకుండా హిట్టు చేసి పెడుతున్నారు.

అయితే ఈ మధ్యకాలంలో వచ్చిన విజయాలను గమనిస్తే స్టోరీలో సస్పెన్స్ ఎలిమెంట్ ఉన్న వాటికి మంచి ఆదరణ దక్కడం గమనించవచ్చు అందుకు ఉదాహరణగా ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ - బ్రోచేవారెవరురా - ఎవరు లాంటి వాటిని చెప్పుకోవచ్చు. వీటిలో ఉన్న కామన్ పాయింట్ క్రైమ్. లైన్ పరంగా ఒకదానితో  మరొకటి సంబంధం లేకపోయినా ట్రీట్మెంట్ పరంగా దర్శకులు రాసుకున్న స్క్రీన్ ప్లే వీటికి బలంగా నిలుస్తోంది.

రెండున్నర గంటల పాటు కమర్షియల్ అంశాలు లేకుండా కేవలం చెప్పాలనుకున్న పాయింట్ కి కట్టుబడి దానికి అనుగుణంగా రాసుకున్న కథనం మెప్పించేలా ఉండటంతో నిర్మాతలు కూడా లాభాల్లోకి వెళ్తున్నారు. అలా అని ప్రతి క్రైమ్ థ్రిల్లర్ హిట్ అవుతుందని కాదు. ఏ మాత్రం తేడా కొట్టినా మొదటి రోజే టపా కట్టడం తప్పదని విశ్వామిత్ర లాంటివి ఋజువు చేశాయి. అందుకే క్రైమ్ అనే కల్పవృక్షాన్ని సరిగ్గా వాడుకోవాలే కాని చిన్న హీరోలతో సైతం పెద్ద హిట్లు కొట్టొచ్చు


Tags:    

Similar News