'కోబ్రా' పైనే కోటి ఆశలు!

Update: 2022-08-26 10:30 GMT
విక్రమ్ .. తమిళనాట ఈ పేరుకు ఉన్న క్రేజ్ ను గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కమల్ తరువాత ప్రయోగాత్మక పాత్రలు చేసే సాహసం ఆయన మాత్రమే చేయగలడని అక్కడి వాళ్లంతా భావిస్తుంటారు. ఎలాంటి పాత్ర కోసం ఎలా మారిపొమ్మన్నా మారిపోవడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. పాత్ర కోసం తెరపై ఎలా కనిపించడానికైనా ఆయన వెనుకాడడనే పేరుంది. అందుకు నిలువెత్తు నిదర్శనంగా ఆయన గత చిత్రాలు కనిపిస్తూనే ఉంటాయి. ఆయన అంకితభావం తనని భయ పెడుతూ ఉంటుందని దర్శకుడు శంకర్ ఒక సందర్భంలో  చెప్పడమే ఇందుకు నిదర్శనం.

మూడు దశాబ్దాల క్రితం విక్రమ్ చాలా సాదా సీదాగా తన కెరియర్ ను మొదలుపెట్టాడు. మలయాళ .. తమిళ .. తెలుగు సినిమాలు చేస్తూ వెళ్లాడు. తెలుగులో కెరియర్ ఆరంభంలో ఆయన చేసిన సినిమాల జాబితా చూస్తే, హీరోగా ఆయన ఈ స్థాయికి ఎదుగుతాడని ఎవరూ ఊహించరు. 'అపరిచితుడు' .. 'ఐ' .. 'మల్లన్న' వంటి సినిమాలు చూస్తే. ఒక నటుడు ఇంతలా మారిపోయి  .. ఇలా చేయడం సాధ్యమేనా అనిపించకమానదు. అలాంటి విక్రమ్ ఇప్పటికీ కూడా కొత్తగా కనిపించడానికే ..  కొత్తగా అనిపించడానికే ప్రాధాన్యతనిస్తూ వస్తున్నాడు.

విక్రమ్ లో మునుపటి ఎనర్జీ .. అంకితభావం .. పట్టుదల ఎంతమాత్రం తగ్గకపోయినా, ఇటీవల కాలంలో ఆయన స్థాయికి పడిన హిట్ మాత్రం పడలేదు. తన గురించి జనాలు రోజుల తరబడి మాట్లాడుకునే స్థాయి సినిమాలను ఆయన ఈ మధ్య కాలంలో చేయలేదు. అలాంటి పాత్రలు కూడా పడలేదు.

అలాంటి విక్రమ్ తాజాగా చిత్రంగా ప్రేక్షకులను పలకరించడానికి 'కోబ్రా' సినిమా రెడీ అవుతోంది. 'వినాయక చవితి' పండుగ సందర్భంగా ఈ నెల 31వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. లలిత్ కుమార్ నిర్మించిన ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి కథానాయికగా అలరించనుంది.

అజయ్ జ్ఞానముత్తు రూపొందించిన ఈ సినిమా, భారీ బడ్జెట్ తో నిర్మితమైంది. ఈ సినిమా కోసం ఏ స్థాయిలో ఖర్చు పెట్టరనేది ట్రైలర్ చూస్తుంటేనే అర్థమవుతోంది. ఏఆర్ రెహ్మాన్ సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు.

దాంతో ఈ సినిమా తనకి పూర్వ వైభవాన్ని తెచ్చిపెడుతుందనే నమ్మకంతో విక్రమ్ ఉన్నాడు. ఒకవేళ ఇది గురి తప్పితే .. నెల గ్యాప్ లో 'పొన్నియిన్ సెల్వన్' థియేటర్లకు వస్తుంది. మణిరత్నం దర్శకత్వం వహించిన ఆ సినిమా హిట్ కొట్టినా చాలానే ఉద్దేశంతో విక్రమ్ ఉన్నాడు. మరి ఆయన కోరికను ఏ సినిమా నెరవేర్చుతుందో చూడాలి.
Tags:    

Similar News