రానా - మిహికా నిశ్చితార్థం పై క్లారిటీ ఇచ్చిన సురేష్ బాబు...?

Update: 2020-05-20 11:10 GMT
దగ్గుబాటి రానా ఎట్టకేలకు తన బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పి ఓ ఇంటివాడు కాబోతున్న విషయం తెలిసిందే. మిహికా బజాజ్ తన ప్రేమను అంగీకరించిందని రానా సోషల్ మీడియా ద్వారా వెల్లడించి సంచలనం సృష్టించాడు. హైదరాబాద్ లో పుట్టి పెరిగిన మిహీక బజాజ్.. బంటీ - సురేష్ బజాజ్ దంపతుల కుమార్తె. ఆమె ప్రస్తుతం ముంబైలో డ్యూ డ్రాప్ డిజైన్ స్టూడియోను స్వయంగా నడుపుతున్నారు. అయితే రానా - మిహిక బజాజ్ వివాహం ఈ ఏడాదిలోనే ఉంటుందని కుటుంబ సభ్యులు కూడా క్లారిటీ ఇచ్చేశారు. మిహికా కుటుంబ సభ్యులు కూడా వీరి సంతోషం వ్యక్తం చేసారు. ఇప్పటి నుండే పెళ్లి పనులు మొదలు పెట్టాలని భావిస్తున్నామని.. డిసెంబర్ లో పెళ్లి ఉండే అవకాశముందని రానా తండ్రి సురేష్ బాబు వెల్లడించారు. కాగా దగ్గుబాటి రానా - మిహికా బజాజ్‌ ల నిశ్చితార్థం ఈ రోజు జరగనుందని.. సాయంత్రం 4 గంటలకు రామా నాయుడు స్టూడియోలో ఎంగేజ్ మెంట్ అని ఉదయం నుండి అన్ని ప్రముఖ ప్రసార మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి.

దీనిపై ఒక ఛానెల్ తో మాట్లాడిన దగ్గుబాటి సురేష్ బాబు రానా ఎంగేజ్మెంట్ వార్తలపై క్లారిటీ ఇచ్చారట. తన కుమారుడు రానా నిశ్చితార్థం ఈ రోజు జరగడం లేదని ఆయన స్పష్టం చేశారట. ఈ రోజు కేవలం ఇరు కుటుంబాల పెద్దల సమావేశం మాత్రమే ఉంటుందని.. హిందూ సాంప్రదాయం ప్రకారం నిశ్చితార్థానికి ముందు ఇరు కుటుంబాల పెద్దలు కూర్చుని మంచి చెడులు చర్చిస్తారని.. అలా తాము కూడా ఈ రోజు మిహికా బజాజ్ కుటుంబ సభ్యులతో మాట్లాడుతామని సురేష్ బాబు తెలిపారట. నిశ్చితార్థం, వివాహం ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలనే దానిపై సమాలోచనలు చేస్తున్నామని.. పెద్దలు కూర్చుని అన్నీ మాట్లాడుకున్నాక రానా వివాహంపై మీడియాకు సమాచారం ఇస్తామని నిర్మాత సురేష్ బాబు వెల్లడించారట. దీంతో రానా ఎంగేజ్మెంట్ వార్తలు నిజం కాదని తెలిసిపోయింది. మరి ఈ రోజు జరగబోయే దగ్గుబాటి - బజాజ్ కుటుంబాల మీటింగ్ లో రానా - మిహికా ఎంగేజ్మెంట్, పెళ్లి ఎప్పుడు జరిపించాలనే విషయం పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
Tags:    

Similar News