డ‌బ్బింగ్ సినిమాకు డేంజ‌ర్ బెల్స్

Update: 2022-04-13 09:27 GMT
కొండ నాలుక‌కు మందేస్తే ఉన్న నాలుక ఊడింద‌న్న‌ట్టుగా డ‌బ్బింగ్ సినిమాల పరిస్థితి మార‌బోతోందా? .. అంటే తాజా ప‌రిణామాలు అలాగే వున్నాయ‌నే కామెంట్ లు వినిపిస్తున్నాయి. సెలెక్టీవ్ గా సినిమాల‌ని ఎంచుకుంటూ థియేట‌ర్ల‌కు వ‌స్తున్న ప్రేక్ష‌కుల‌కు డ‌బ్బింగ్ సినిమాల విష‌యంలో తాజాగా ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన విధానం ఆ సినిమాకు డేంజ‌ర్ బెల్స్ ని మోగించేట్టుగానే వుంది. తెలంగాణ ప్ర‌భుత్వం మంగ‌ళ‌వారం డ‌బ్బింగ్ మూవీ టికెట్ లు కూడా పెంచుకునే విధంగా స‌రికొత్త జీవోని విడుద‌ల చేయ‌డం ఇప్ప‌డు హాట్ టాపిక్ గా మారింది.

య‌ష్ హీరోగా న‌టించిన క్రేజీ చిత్రం 'కేజీఎఫ్ చాప్ట‌ర్ 2' ఏప్రిల్ 14న విడుద‌ల‌వుతున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఈ చిత్ర టికెట్ రేట్స్‌ని పెంచుకునే విధంగా తెలంగాణ ప్ర‌భుత్వం మంగ‌ళ‌వారం ఓ జీవోని విడుద‌ల చేసింది. మ‌ల్టీప్లెక్స్ థియేట‌ర్ల‌లో తాజా జీవో ప్ర‌కారం డ‌బ్బింగ్ సినిమా అయిన 'కేజీఎఫ్ చాప్ట‌ర్ 2' టికెట్ కి 50 రూపాయ‌లు, సాధార‌ణ ఏయిర్ కండీష‌న్ థియేట‌ర్లలో టికెట్ కి 30 వ‌ర‌కు పెంచుకునే విధంగా వెలుసుబాటుని క‌ల్పించింది. ఈ విధానం నాలుగు రోజుల పాటు అమ‌లులో వుంటుంద‌ని కూడా తెలిపింది.

ఇదే ఇప్ప‌డు డ‌బ్బింగ్ సినిమాల పాలిట డేంజ‌ర్ బెల్స్ మోగించ‌బోతోందా? అంటే టాలీవుడ్ వ‌ర్గాలు అవున‌నే స‌మాధానం చెబుతున్నారు. దీని వ‌ల్ల స‌గ‌టు తెలుగు ప్రేక్ష‌కుడు స్ట్రెయిట్ సినిమాని మాత్ర‌మే చూడ‌టాపికి ఆస‌క్తిని చూపిస్తాడ‌ని, డ‌బ్బింగ్ సినిమాకు ఆ స్థాయిలో డ‌బ్బు ఖ‌ర్చు చేసి చూసే ప‌రిస్థితి లేద‌ని, ఈ విధానం వ‌ల్ల డ‌బ్బిండ్ సినిమా మార్కెట్ పూర్తిగా కిల్ అవ్వ‌డం ఖాయ‌మ‌ని చెబుతున్నారు. ఈ విధానం డిస్ట్రీబ్యూట‌ర్లకు అడ్వాంటేజ్ గా మారినా గ‌త రెండేళ్లుగా ఇండ‌స్ట్రీ విప‌త్క‌ర ప‌రిస్థితుల్ని ఎదుర్కొని ఇప్పుడిప్పుడే బ‌య‌ట‌ప‌డుతున్న నేప‌థ్యంలో డ‌బ్బింగ్ చిత్రాల విష‌యంలో ఇలాంటి నిర్ణ‌యాలు ఇండ‌స్ట్రీకి చేటుగా మార‌తాయ‌ని కామెంట్ లు వినిపిస్తున్నాయి.

ఇటీవ‌ల ట్రిపుల్ ఆర్ చిత్రానికి భారీ స్థాయిలో టికెట్ రేట్ల‌ని పెంచుకోవ‌చ్చు అంటూ ఉభ‌య తెలుగు రాష్ట్రాలు ప్ర‌త్యేకంగా జీవోల‌ని విడుద‌ల చేశాయి. అయితే దీనిపై సోష‌ల్ మీడియాలో పెద్ద దుమార‌మే చెల‌రేగింది. చాలా మంది ఈ స్థాయిలో టికెట్ రేట్లు పెంచేస్తారా? అంటూ బాహాటంగానే విమ‌ర్శ‌లు గుప్పించారు. అయితే రీసెంట్ గా విడుద‌లైన 'ట్రిపుల్ ఆర్' ప్ర‌తీ ఒక్క‌రినీ ఆక‌ట్టుకోవ‌డంతో పెంచిన టికెట్ రేట్ల‌ని అంతా మ‌ర్చిపోయి పాన్ ఇండియా మూవీని ఎంజాయ్ చేశారు.  

కానీ తాజాగా బీస్ట్‌, కేజీఎఫ్ చాప్ట‌ర్ 2 చిత్రాల టికెట్ రేట్ల‌ని తెలంగాణ ప్ర‌భుత్వం పెంచ‌డం తో ప్రేక్ష‌కులు షాక్ కు గుర‌వుతున్నారు. ఈ రెండు మూవీస్ ని కూడా దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారు. ఆ కార‌ణంగానే డ‌బ్బింగ్ చిత్రాల టికెట్ రేట్లు పెంచుకునే విధంగా తెలంగాణ ప్ర‌భుత్వం జీవోని విడుద‌ల చేసింద‌ని నెటిజ‌న్ లు దిల్ రాజుని నెట్టింట ఏకేస్తున్నార‌ట‌. బీస్ట్ టికెట్ రేట్లు చెన్నైలో 160 నుంచి 200 వ‌ర‌కు వుండ‌గా హైద‌రాబాద్ లో మాత్రం 295 నుంచి 350 వ‌ర‌కు వుండ‌టంతో ప్రేక్ష‌కులు మండిప‌డుతున్నారు. దీనిపై నెట్టింట మీమ్స్ ఓ రేంజ్ లో పేలుతున్నాయి.

ఏకంగా ఈ రేట్ల‌ని గ‌మ‌నించిన ఓ టాలీవుడ్ డైరెక్ట‌ర్ 'మేము బాగా రిచ్ రా బై' అంటూ మీమ్ ని షేర్ చేశాడు. ఇప్పుడ‌ది నెట్టింట వైరల్ గా మారింది. డ‌బ్బింగ్ చిత్రాల‌కు కూడా భారీ స్థాయిలో టికెట్ రేట్లు పెంచేయ‌డం ప‌లువురిని షాక్ కు గురిచేస్తోంది.

దీంతో చాలా మంది ఓటీటీలో చూసేయొచ్చులే అని లైట్ తీసుకుంటున్నార‌ట‌. దీంతో డ‌బ్బింగ్ సినిమాల‌కు డేంజ‌ర్ బెల్స్ మొగుతున్నాయ‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అంటున్నాయి. ఈ విష‌యంలో ప్ర‌భుత్వం పున‌రాలోచ‌న చేస్తుందా?  లేక దిల్ రాజు లాంటి వాళ్ల కోసం ఇదే జీవోని కంటిన్యూ చేస్తుందో చూడాలి అని నెటిజ‌న్ లు వాపోతున్నారు.
Tags:    

Similar News