దాసరి డబ్బులు వెనక్కి వస్తాయా?

Update: 2017-06-01 08:50 GMT
అయిపోయింది. ఒక మహాప్రస్థానం ముగిసిపోయింది. దర్శక రత్న దాసరి నారాయణరావు వెళ్లిపోయారు. తెలుగు సినీ పరిశ్రమ పెద్ద దిక్కును కోల్పోయింది. పరిశ్రమలో ఎవరికి ఏ సమస్య వచ్చినా తానున్నానంటూ ముందుకొచ్చి.. పరిష్కరించే దాసరి వెళ్లిపోవడం పెద్ద లోటే. ఎప్పుడూ ఇండస్ట్రీలో వేరే వాళ్ల సమస్యల్ని పరిష్కరించడంలోనే తలమునకలై ఉండే దాసరి.. తన సొంత ఆర్థిక వ్యవహారాల్ని చక్కబెట్టకుండానే వెళ్లిపోయారని సన్నిహితులు అంటున్నారు. ఇండస్ట్రీలో ఆయన డబ్బులు చాలా ఉన్నాయని.. వాటి సంగతేంటో తేల్చేలోపే దాసరి కాలం చేశారని సన్నిహితులు చెబుతున్నారు.

దాసరి సినిమాలు తీయడం చాలించేసినా.. పరిశ్రమలో తెరకెక్కే పలు సినిమాల్లో ఆయనకు భాగస్వామ్యం ఉంటోంది. ఆయన ఇండస్ట్రీలో నమ్మకమైన ఫైనాన్షియర్. న్యాయబద్ధంగా తక్కువ వడ్డీలకు ఫైనాన్సులు సమకూరుస్తుంటారని దాసరికి పేరుంది. ఏక కాలంలో పలు సినిమాలకు ఆయన ఫైనాన్స్ చేస్తుంటారు. ఐతే వీటిలో చాలావరకు మాట మీద జరిగే లావాదేవీలు. దాసరికి డబ్బులు ఎగ్గొట్టి ఇండస్ట్రీలో మనుగడ సాగించడం కష్టం. అందుకే మాట మీదే డబ్బులు ఇచ్చి.. వాటిని వెనక్కి రాబడుతుంటారు దాసరి. చాలా వరకు అగ్రిమెంట్లు లేకుండానే లావాదేవీలు పూర్తవుతుంటాయి.

దాసరి అనారోగ్యం పాలవడానికి ముందు అలాంటి లావాదేవీలు చాలానే జరిగాయని.. ఆసుపత్రి పాలయ్యాక వాటి సంగతి పట్టించుకునే వీలు దాసరికి చిక్కలేదని.. కొంచెం ఆరోగ్యం కుదురుకున్నాక వాటి సంగతి తేలుద్దామని దాసరి అనుకున్నారని.. ఈలోపే ఆయన పరిస్థితి విషమించి చనిపోయారని.. ఇప్పుడు దాసరికి రావాల్సిన పేమెంట్ల సంగతి ఎవరు తేలుస్తారో అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. దాసరి కుటుంబ సభ్యులకు ఈ లావాదేవీల గురించి పెద్దగా తెలియదని అంటున్నారు. ఈ నేపథ్యంలో దాసరి డబ్బులు వెనక్కి రావడం అంత సులువు కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అగ్రిమెంట్ల ప్రకారం జరిగిన లావాదేవీల సంగతేమో కానీ.. నోటి మాటపై దాసరి చెల్లించిన డబ్బులు మాత్రం వసూలవడం కష్టమే అంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News