ఇలాంటి బెదిరింపుల్ని లెక్క చేసే ర‌కం కాదు

Update: 2020-01-10 05:41 GMT
దీపిక ప‌దుకొనే క‌థానాయిక‌ గా న‌టించిన `ప‌ద్మావ‌త్ 3డి` సంచ‌ల‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఆ సినిమా రిలీజ్ ముందు వివాదాలు క‌రుడుగ‌ట్టిన హిందూవాదుల‌తో ఎదురైన స‌మ‌స్య‌ల చిట్టా విధిత‌మే. సంజ‌య్ లీలా భ‌న్సాలీపై దాడుల‌కు పాల్ప‌డిన రాజ్ పుత్ మూక‌లు .. అటు పై దీపిక ముక్కు కోసేస్తామంటూ వార్నింగులు ఇచ్చారు. అయితే అన్ని వివాదాల న‌డుమ రిలీజైనా ఆ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ సాధించింది.

ఇప్పుడు ఆ స్థాయి సినిమా కాక‌పోయినా చ‌పాక్ విష‌యం లోనూ దీపిక‌ కు కొన్ని చిక్కులు వ‌చ్చి ప‌డుతున్నాయి. సినిమా కంటెంట్ విషయంలో అభ్యంత‌రాలు కావు కానీ.. దీపిక వ్య‌క్తిగ‌త వ్య‌వ‌హారికం న‌చ్చ‌లేదు అంటూ జెఎన్ యూ విద్యార్థుల్లో ఒక వర్గం హెచ్చ‌రిస్తోంది. జేఎన్.యు దాడుల్ని ఖండించిన దీపిక‌ను శ‌త్రువులా చూస్తుండ‌డం తెలిసిందే.

ఆ వివాదంతో ముడిపెడుతూ నిన్న రిలీజైన చ‌పాక్ మూవీని బాయ్ కాట్ చేస్తామ‌ని దుండ‌గులు బెదిరిస్తున్నారు. అలాగే ఆన్ లైన్ లో బుక్ చేసిన టిక్కెట్ల‌ ను క్యాన్సిల్ చేస్తున్నాం అంటూ బెదిరిస్తూ .. ఓ టికెట్ (ముగ్గురికి బుక్ చేసిన‌ది) స్క్రీన్ షాట్ ని సోష‌ల్ మీడియాలో ప్ర‌చారానికి పెట్టారు. సేమ్ టైమ్ సేమ్ ప్లేస్ సేమ్ థియేట‌ర్ టిక్కెట్లు మూడు చోట్ల నుంచి పోస్ట్ అవ్వ‌డం క్లియ‌ర్ గా తెలిసిపోయింది. ఒకే స్క్రీన్ షాట్ ను గుజ‌రాత్ లోని మూడు చోట్ల నుంచి పోస్ట్ చేయ‌డం తో అది ఫేక్ అని తేలిపోయింది. కోపంలో బెదిరించేందుకు ఎంచుకున్న చ‌ర్య ఇది. అయితే ఇలాంటి బెదిరింపుల్ని లెక్క చేసే త‌ర‌హా కాదు దీపిక‌. ప్ర‌స్తుతానికి తాను న‌టిస్తూ నిర్మించిన చ‌పాక్ ప్ర‌చారం పైనే దీపిక ఫోక‌స్ చేస్తోంది.
Tags:    

Similar News