ప్లాప్‌ మూవీని రీమేక్‌ చేస్తానంటున్నాడు!

Update: 2021-07-10 10:30 GMT
మొదటి సినిమా వెన్నెలతో విలక్షణ దర్శకుడిగా పేరు దక్కించుకున్న దేవ కట్టా ఆ తర్వాత రెండవ సినిమాను చేసేందుకు అయిదు సంవత్సరాలు పట్టింది. 2005 సంవత్సరంలో వెన్నెల సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ దర్శకుడు 2010 సంవత్సరంలో ప్రస్థానం సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. ఆ తర్వాత మూడవ సినిమాకు నాలుగు సంవత్సరాలు తీసుకున్నాడు. 2014 సంవత్సరంలో ఆటో నగర్‌ సూర్య సినిమాను చేశాడు. ఆ సినిమా నిర్మాత ఆర్థిక సమస్యల కారణంగా ఆలస్యం అయ్యింది. ఆ తర్వాత వెంటనే డైనమేట్‌ సినిమాను తెరకెక్కించిన దేవ కట్టా 2019 లో హిందీలో ప్రస్థానంను తెరకెక్కించాడు. ప్రస్తుతం రిపబ్లిక్ సినిమాను చేస్తున్నాడు.

మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్ తో రిపబ్లిక్ సినిమాను చేస్తున్న దర్శకుడు దేవా కట్టా ఇటీవల ఒక చిట్ చాట్‌ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కెరీర్‌ లో రీమేక్ చేసి తప్పు చేశాను. మళ్లీ రీమేక్‌ చేయాలనే ఆలోచన అస్సలు లేదు. మంచు హీరోతో ఈయన చేసిన డైనమైట్‌ రీమేక్‌ అనే విషయం తెల్సిందే. ఆ సినిమా మాత్రమే కాకుండా మరో రీమేక్ ను కూడా మొదలు పెట్టి ఈయన మద్యలో వదిలేశాడు. అందుకే ఈయన మళ్లీ ఎప్పుడు కూడా రీమేక్‌ చేయాలని కోరుకోవడం లేదు అంటూ ప్రకటించాడు. అయితే తాను తెరకెక్కించిన ఆటోనగర్‌ సూర్య ను ఇతర భాషల్లో రీమేక్‌ చేయాలని మాత్రం కోరుకుంటున్నాడట.

ఆటో నగర్‌ సూర్య ఆర్థిక పరమైన ఇష్యూల కారణంగా చాలా ఆలస్యం అయ్యింది. ఏదోలా ముగించేయాలనే ఉద్దేశ్యంతో చాలా విషయాల్లో కాంప్రమైజ్‌ అయ్యి సినిమాను తెరకెక్కించాల్సి వచ్చింది. సినిమా అనుకున్నట్లుగా అస్సలు రాలేదు. దాంతో ప్లాప్‌ మూవీ గా ఆ సినిమా నిలిచింది. మంచి సబ్జెక్ట్‌ అయినా కూడా ఆ సినిమాను ఆశించిన రీతిలో తీయలేక పోయాను.. అందుకే రీమేక్ చేసి అక్కడ మంచి సక్సెస్‌ ను దక్కించుకుంటాను అంటూ దేవా కట్టా నమ్మకంతో ఉన్నాడు. మరి ఇతర భాషల్లో రీమేక్‌ ఎప్పుడు ఎలా అనే విషయాన్ని మాత్రం ఇప్పట్లో చెప్పలేను అన్నాడు. ఇతర భాషల్లో రీమేక్‌ అయ్యి అయినా సక్సెస్‌ ను దక్కించుకుంటుందేమో చూడాలి.
Tags:    

Similar News