వావ్.. దేవిశ్రీ ఖాతాలో 20 మిలియన్స్

Update: 2016-01-10 11:30 GMT
ఎంతైనా దేవిశ్రీ ప్రసాద్ దేవిశ్రీ ప్రసాదే అంటుంటారు అతడి కొత్త సినిమా ఆడియో విడుదలైనపుడల్లా. ఇండస్ట్రీలోకి సంగీత దర్శకులు వస్తుంటారు వెళ్తుంటారు. కానీ దేవిశ్రీ మాత్రం దశాబ్దంన్నరకు పైగా ఇండస్ట్రీలో తన ప్రత్యేకతను నిలుపుకుంటూనే ఉన్నాడు. మధ్యలో తమిళం మీద ఫోకస్ ఎక్కువైపోయి తెలుగులో కొంచెం వెనుకబడిపోయినట్లు కనిపించాడు కానీ.. మళ్లీ రెండు మూడేళ్లుగా అతడి హవా సాగుతోంది. అందులోనూ గత ఏడాదైతే తెలుగు మ్యూజిక్ లవర్స్ ను తన మెస్మరైజింగ్ మ్యూజిక్ తో ఓ ఊపు ఊపేశాడు దేవి. 2015లో దేవి.. ఆరు తెలుగు సినిమాలకు మ్యూజిక్ అందిస్తే ఆ ఆరూ కూడా మ్యూజిక్ లగా పెద్ద హిట్టవడం విశేషం.

యూట్యూబ్ లో ఈ సినిమాల జ్యూక్ బాక్స్ లకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ ఆరు సినిమాల్లో ప్రతి దానికీ మిలియన్ వ్యూస్ దక్కడం విశేషం. అన్నింట్లోకి ‘సన్నాఫ్ సత్యమూర్తి’ నెంబర్ వన్ గా నిలిచింది. దీనికి 7.1 మిలియన్ వ్యూస్ దక్కడం విశేషం. అంటే 71 లక్షల మంది కేవలం యూట్యూబ్ ద్వారానే ఈ పాటలు విన్నారన్నమాట. శ్రీమంతుడు 6.7 మిలియన్ వ్యూస్ తో రెండో స్థానంలో నిలిచింది. ‘కుమారి 21 ఎఫ్’ 2.3 మిలియన్ వ్యూస్ తో మూడో స్థానం సంపాదించింది. దేవి మ్యూజిక్ అందించిన రామ్ సినిమాలు రెండూ కూడా మిలియన్ క్లబ్బులో అడుగుపెట్టాయి. ‘శివమ్’ 1.2 మిలియన్ వ్యూస్ దక్కించుకుంటే.. ‘నేను శైలజ’ ఇప్పటికే 1.08 మిలియన్ వ్యూస్ రాబట్టింది. ఇంకా కౌంటింగ్ లో ఉంది. ఎన్టీఆర్ సినిమా ‘నాన్నకు ప్రేమతో’ కూడా కొన్ని రోజుల్లోనే మిలియన్ క్లబ్బులోకి అడుగుపెట్టింది. మొత్తంగా గత ఏడాదంతా కలిపి దేవిశ్రీ అందించిన ఆడియోలన్నీ కలిపి 20 మిలియన్.. అంటే 2 కోట్ల యూట్యూబ్ వ్యూస్ దక్కించుకోవడం విశేషం.
Tags:    

Similar News