'ఆచార్య' బయ్యర్లకు చిరంజీవి - చరణ్ కలిసి రూ.25 కోట్లు తిరిగి చెల్లించారా..?

Update: 2022-07-14 07:30 GMT
మెగాస్టార్ చిరంజీవి మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తొలిసారి పూర్తి స్థాయిలో కలిసి నటించిన "ఆచార్య" సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం చవిచూసింది. చిరు - చరణ్ కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం వల్ల బయ్యర్లకు భారీగా నష్టపోయారు. దీంతో నష్టపోయిన వారికి సెటిల్ చేయాల్సి వచ్చింది.

అయితే 'ఆచార్య' సినిమా బిజినెస్ మరియు మార్కెటింగ్ వ్యవహారాలు చూసుకున్న కొరటాలే నష్టపరిహారం చెల్లించే బాధ్యత తీసుకున్నారని ప్రచారం జరిగింది. పలువురు డిస్ట్రిబ్యూటర్లు మరియు ఎగ్జిబిటర్లు కలసి కొరటాల ఆఫీస్ కు వచ్చి ఆందోళన చేశారని.. కొంతభాగం సెటిల్ చేసి పంపించారని రూమర్స్ వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో కొరటాల శివ పై నెటిజన్లు సోషల్ మీడియాలో సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. 'జస్టిస్ ఫర్ కొరటాల శివ' అంటూ క్యాంపెయిన్ మొదలు పెట్టారు. సినిమాకు నష్టమొస్తే నిర్మాతలు భరించాలి కానీ.. మొత్తం దర్శకుడి మీదే భారం మోపడం ఎంతవరకు సమంజసమని కామెంట్స్ చేస్తున్నారు.

'ఆచార్య' చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి నిర్మించారనే సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం చిరంజీవి - రామ్ చరణ్ - కొరటాల రెమ్యునరేషన్ తీసుకోలేదని నిర్మాత స్వయంగా చెప్పారు. పారితోషికం తీసుకోకుండానే మెగా తండ్రీకొడుకులు ఇద్దరూ దాదాపు 175 రోజులు పనిచేశారని తెలుస్తోంది. అందుకుగానూ బ్యానర్ పేరు వేసుకుని ప్రాఫిట్స్ లో షేర్ తీసుకునేలా అగ్రిమెంట్ చేసుకొని ఉండొచ్చని అందరూ భావించారు.

ఇకపోతే చేతి ఖర్చుల కోసం మాత్రమే కొంత తీసుకున్నామని కొరటాల సైతం ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అలానే నిరంజన్ రెడ్డి సినిమా వ్యాపారంలో యాక్టీవ్ గా ఉండరు కాబట్టి.. ఫైనాన్షియల్ వ్యవహారాల్లో సలహాలు ఇస్తున్నట్లుగా కూడా దర్శకుడు చెప్పాను. ఎలా అయితేనేం 'ఆచార్య' చిత్రాన్ని నిర్మాత దగ్గర నుంచి తీసుకొని.. కొరటాల మంచి రేట్లకే విక్రయించారని టాక్ ఉంది. అందుకే ఇప్పుడు నష్టాలు రావడంతో అందరూ దర్శకుడి వెంట పడుతున్నారని అంటున్నారు.

కాకపోతే ఈ సెటిల్ మెంట్ విషయంలో చిరు - చరణ్ ఎందుకు కలుగజేసుకోలేదనే దానిపైనే ప్రశ్నలు వస్తున్నాయి. మెగా హీరోలు ఎటువంటి మొత్తాన్ని కూడా నష్ట పరిహారంగా ఇవ్వలేదేమో అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ వాస్తవానికి 'ఆచార్య' హీరోలిద్దరూ తమ బాధ్యతగా తిరిగి చెల్లింపులు చేశారని సమాచారం.

చిరంజీవి - రామ్ చరణ్ కలిసి దాదాపు రూ.25 కోట్లు తిరిగి ఇచ్చారట. ఈ మొత్తం నుంచే చాలా మంది డిస్ట్రిబ్యూటర్ల ఆర్థిక నష్టాన్ని భర్తీ చేసారని టాక్ వినిపిస్తోంది. కానీ ఇవేమీ బయటకు రాకపోవడంతోనే మెగా తండ్రీకొడుకులపై ఆరోపణలు చేస్తూ.. #JusticeforKoratalaShiva #JusticeforKoratala అనే హ్యాష్ ట్యాగ్ తో ట్విట్టర్ లో పోస్టులు పెడుతున్నట్లు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో ఇప్పుడు మెగా అభిమానులు రంగంలోకి దిగారు. 'ఆచార్య' సినిమా వల్ల నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్స్ మరియు బయ్యర్లకు రూ. 25 కోట్లు తిరిగి ఇచ్చేసి తండ్రీకొడుకులు మరోసారి మంచి మనసు చాటుకున్నారని పోస్టులు పెడుతున్నారు. 'వినయ విధేయ రామ' సినిమా టైంలో రామ్ చరణ్ తన రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేసాడనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఈ క్రమంలో #MegaStarMegaHeart #RamCharanGoldenHeart అంటూ ట్వీట్స్ చేస్తూ చిరు - చరణ్ లకు మద్దతుగా నిలుస్తున్నారు.
Tags:    

Similar News