గాడ్ ఫాద‌ర్ లెక్కలు స‌రిగా తేలిన‌ట్టేనా?

Update: 2022-10-10 04:05 GMT
మెగాస్టార్ చిరంజీవి న‌టించిన గాడ్ ఫాద‌ర్ విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ ద‌క్కించుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా త్వ‌ర‌గానే బ్రేక్ ఈవెన్ సాధిస్తుంద‌ని ట్రేడ్ భావించింది. కానీ కొన్ని చోట్ల వ‌సూళ్లు కాస్త నెమ్మ‌దిగా ఉన్నాయ‌ని తెలిసింది. ఇప్ప‌టికీ మూవీ పై ప్ర‌జ‌ల్లో ఆస‌క్తి ఉంది. కానీ థియేట‌ర్ల‌కు త‌ర‌లివ‌చ్చేవారి శాతం త‌క్కువ‌గా ఉంద‌ని విశ్లేషిస్తున్నారు.

ముఖ్యంగా మాస్ ని ప‌దే ప‌దే థియేట‌ర్ల‌కు ర‌ప్పించే నైజాం ఏరియాలో క‌లెక్ష‌న్లు డ‌ల్ గా ఉండ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. అంచనాలకు తగ్గట్లుగా ఇక్క‌డ వ‌సూళ్లు లేక‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. నైజాం పంపిణీదారుడు 20కోట్లు వెచ్చించ‌గా 2కోట్లు అద‌నంగా ప్ర‌చారానికి ఖ‌ర్చు చేశారు. బ్రేక్ ఈవెన్ రావాల‌న్నా 22కోట్లు వ‌సూలు చేయాలి. కానీ ఇక్క‌డ 15కోట్ల రేంజులో మాత్ర‌మే షేర్ తెస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. దీంతో పంపిణీదారుడికి న‌ష్టాలు త‌ప్ప‌వ‌ని భావిస్తున్నారు. చిరంజీవి లాంటి మాస్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ కి నైజాంలో డిస్ట్రిబ్యూటర్ కి కేవలం 15 కోట్ల రూపాయలు మాత్రమే తెచ్చిపెట్టడం ఆశ్చ‌ర్యం క‌లిగించేదే.  గ్రాస్ లెక్క‌లు బావున్నా కానీ థియేట‌ర్ లెక్క‌ల ప్ర‌కారం ఇంకా భారీ క‌లెక్ష‌న్లు తేవాల్సి ఉంద‌ని చెబుతున్నారు.

మరోవైపు ఓవర్సీస్ కలెక్షన్లు కూడా బ్రేక్ ఈవెన్ ని రాబట్టలేక ఇబ్బంది పడుతున్నాయి. ఇప్పటివరకు ఒక మిలియ‌న్ డాల‌ర్ వ‌సూళ్లు మాత్ర‌మే సాధించింది. అంటే దాదాపు 7.5 కోట్లు వ‌సూలు చేసింది.  కానీ బ్రేక్ ఈవెన్ చేయడానికి ఇది ఒక‌టిన్న‌ర మిలియ‌న్ డాల‌ర్ల కంటే ఎక్కువ కలెక్షన్ ని చూడాలి. కానీ అంత పెద్ద మొత్తం తేవాలంటే సుదీర్ఘ కాలం ప్ర‌జ‌ల‌ను థియేట‌ర్ల‌కు ర‌ప్పించ‌గ‌ల‌గాలి.

హిట్టు సినిమాల‌పై ఓటీటీల ప్ర‌భావం..?

సినిమా బావుంది... హిట్టు అన్న టాక్ వ‌చ్చినా కానీ ఇటీవ‌లి కాలంలో వ‌సూళ్ల‌లో అది క‌నిపించ‌డం లేదు. ఇంత‌కుముందు హృతిక్ - సైఫ్‌ న‌టించిన విక్ర‌మ వేద‌- హిందీ వెర్ష‌న్ కి అన్ని వైపుల నుంచి పాజిటివ్ రివ్యూలొచ్చాయి. కానీ బాక్సాఫీస్ వ‌ద్ద ఈ సినిమా యావ‌రేజ్ గానే నిలిచింది. ఇప్పుడు గాడ్ ఫాద‌ర్ కి కూడా అన్ని వైపుల నుంచి పాజిటివ్ స‌మీక్ష‌లు ద‌క్కాయి. మౌత్ టాక్ బావుంది. కానీ అది బాక్సాఫీస్ వ‌సూళ్ల‌లో ప్ర‌తిఫ‌లించ‌డం లేదు. దీనికి కార‌ణాల‌ను విశ్లేషిస్తే ఓటీటీల ముప్పు కూడా ఒక కార‌ణ‌మ‌ని అర్థం చేసుకోవ‌చ్చు. ప్ర‌జ‌లు ఓటీటీల‌కు అల‌వాటు ప‌డ్డారు. ఇంట్లోనే మినీ థియేట‌ర్లు 60 ఇంచెస్ టీవీల‌లో రిలీజైన కొద్ది రోజుల్లోనే హాయిగా కొత్త సినిమాల‌న్నీ ఆస్వాధిస్తున్నారు. దీని ప్ర‌భావంతోనే కుటుంబ ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు క‌దిలి రావ‌డం లేద‌ని కూడా విశ్లేషిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ - మహేష్ బాబు లాంటి స్టాహీరోల‌ సినిమాలు రూ. 30 కోట్లు నుంచి 40 కోట్ల మ‌ధ్య నైజాం నుంచి వ‌సూలు చేస్తున్నాయి. అల్లు అర్జున్ అల వైకుంఠపురములో నైజాంలో రూ.42 కోట్లకు పైగా వసూలు చేసింది. కానీ మెగాస్టార్ చిరంజీవి న‌టించిన గాడ్ ఫాద‌ర్ 15కోట్ల షేర్ వ‌ర‌కూ ప‌రిమితం కావ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంద‌ని ట్రేడ్ విశ్లేషిస్తోంది. ఇక ఇది మ‌ల‌యాళ రీమేక్ కావ‌డంతో ఒరిజిన‌ల్ ని ఇప్ప‌టికే ప్ర‌జ‌లు ఓటీటీల్లో వీక్షించారు. దాని ప్ర‌భావం కూడా క‌లెక్ష‌న్ల‌పై ఉంద‌ని భావించాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News