ఆర్యన్ ఖాన్ కు జైలు జీవితం కొత్త పాఠం నేర్పిందా? ఇకపై అలా చేస్తాడట

Update: 2021-10-18 03:37 GMT
నిషేధిత డ్రగ్స్ ఉన్నాయన్న ఆరోపణలతో జైలుపాలైన బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్.. గడిచిన కొద్ది వారాలుగా జైల్లోనే ఉండటం తెలిసిందే. అతని బెయిల్ కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నా.. ఫలించటం లేదు. ఇదిలా ఉండగా.. ఇంతకాలం స్టార్ స్టేటస్ తో రాజభోగాల్ని అనుభవించిన అతడికి.. జైలు జీవితం నరకంగా మారినట్లుగా కొన్ని కథనాలు వచ్చాయి. జైలు జీవితంతో ఇమడలేక అతడు పడుతున్న పాట్లు అన్ని ఇన్ని కావు. తల్లిదండ్రులతో ఫోన్ లో మాట్లాడే అవకాశం వచ్చినంతనే చిన్న పిల్లాడి మాదిరి వెక్కి వెక్కి ఏడుస్తున్న వైనం అతడి మానసిక పరిస్థితిని చాటి చెబుతుందని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా అతను అధికారులతో చెప్పిన విషయాలు సరికొత్తగా ఉన్నాయని చెబుతున్నారు. జైల్లో ఉన్న ఆర్యన్ ఖాన్ ప్రస్తుతం ముంబయిలోని ఆర్థర్ రోడ్ లోని జైల్లో ఉండటం.. అతనికి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అతనికి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆర్యన్ మాట్లాడుతూ.. తాను జైలు నుంచి విడుదలైన తర్వాత అందరూ గర్వపడేలా మంచి పనులు చేస్తానని.. నిరుపేదల అభ్యున్నతి కోసం పాటుపడతానని వ్యాఖ్యానించటం గమనార్హం. అంతేకాదు.. చెడు మార్గాల్లో నడవనని చెప్పినట్లుగా తెలుస్తోంది. తాజాగా.. ఆర్యన్ ఖాన్ తో పాటు అతని మిత్రులు కొందరు ఇదే కేసులో అరెస్టు కావటం తెలిసిందే. వీరందరికి కొన్ని ఎన్జీవోలు..ఎన్ సీబీ అధికారులు కలిసి జైల్లోనే వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇలాంటివేళ.. ఆర్యన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

ఇంతకాలం జైల్లో ఉన్న వేళ.. ఆర్యన్ నోటి నుంచి రాని మాట.. తాజాగా మాత్రం రావటం.. ఆ విషయాన్ని అధికారి ఒకరు మీడియాకు చెప్పినట్లుగా వస్తున్న వార్తల్ని చూస్తే.. కొత్త అనుమానాలు కలుగక మానవు. నిజంగానే ఆర్యన్ మారారా? లేదంటే.. బెయిల్ కోసం ఈ తరహా మాటల్ని చెబుతున్నాడా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఏమైనా.. జైలు జీవితం ఆర్యన్ ను మార్చేస్తే అంతకన్నా ఏం కావాలి?


Tags:    

Similar News