జాన్ అబ్ర‌హాం లాగా నానీ కూడా నోరు జారాడా?

Update: 2022-04-21 01:28 GMT
నేచుర‌ల్ స్టార్ నాని వ్యాఖ్యల వల్ల కన్నడిగులు హర్ట్ అయ్యారా? ఇంత‌కుముందు తెలుగు ఇండ‌స్ట్రీపై జాన్ అబ్ర‌హాం చేసిన కామెంట్ లానే నాని కూడా కామెంట్ చేశాడా? అంటే అవుననే సోష‌ల్ మీడియా మీనింగ్ చెబుతోంది. త‌న‌ తాజా చిత్రం 'అంటే సుందరికి' కన్నడలోకి ఎందుకు డబ్ కావడం లేదో చెబుతూ హీరో నాని చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారడంతో చాలా మంది కన్నడ ప్రజలు హ‌ర్ట‌య్యారు. దీనిపై ట్విటర్ ద్వారా స్పందించిన నాని.. తాను ఎందుకు ఆ వ్యాఖ్యలు చేశానో వివ‌ర‌ణ ఇచ్చారు. అంటే సుందరానికి టీజర్ లాంచ్ వేడుక‌లో  మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని కన్నడ ప్రేక్షకులు తెలుగులోనే చూస్తారని భావించినందున ఆ భాష‌లోకి డబ్ చేయడం లేదని చాలా మంది కన్నడ ప్రజలు దీనిని అర్థం చేసుకుంటారని అన్నారు.

క‌న్న‌డిగులు తెలుగు చిత్రాలను నేరుగా చూడటానికి ఇష్టపడతారు. తెలుగు భాషలో మాత్రమే చూస్తారు! అని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఈ వ్యాఖ్యలను ట్విట్టర్ లో షేర్ చేయ‌డంతో వెంట‌నే క‌న్న‌డ యూత్ స్పందించారు. చాలా మంది కన్నడిగులు తమకు తెలుగు అర్థం కావడం లేదని ఫిర్యాదు చేస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు హీరోలు తమ సినిమాలు చూడాలనుకుంటే వారు కన్నడలోకి కూడా డబ్ చేయాలి అని కూడా కోరారు. ఈ వ్యాఖ్యలకు వెంట‌నే నాని స్పందించారు. "నేను డబ్బింగ్ వెర్షన్ అందుబాటులో లేనప్పుడు కూడా నా సినిమాలు లేదా ఇతర తెలుగు చిత్రాలను మా కన్నడ కుటుంబం ఎలా మెచ్చుకున్నారో అది చెబుతున్నాను. అందుకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రెస్ మీట్ లో ఒక నిర్దిష్ట సమాధానం సందర్భంతో వస్తుంది. సోషల్ మీడియా సందర్భాన్ని బయటకు ఎలివేట్ చేసేస్తుంది" అని రిప్ల‌య్ ఇచ్చారు.

నిజానికి జాన్ అబ్ర‌హాం చూపించినంత దుర‌హంకారం నానీ చూపించ‌లేదు. క‌న్న‌డిగులు తెలుగు మాట్లాడ‌తార‌ని.. తెలుగును అభిమానిస్తార‌నేది అత‌డి పాయింట్ ఆఫ్ వ్యూ. నానీ అన్నివేళ‌లా డౌన్ టు ఎర్త్ నేచుర్ తో ఉంటార‌న్న సంగ‌తి తెలిసిన‌దే. కానీ ఆరోజు ఆ స్పీచ్ మీనింగ్ త‌ప్పుగా క‌న్వే అయ్యింది సామాజిక మాధ్య‌మాల్లో. ఇదంతా సోషల్ మీడియా పుణ్యం అంటూ విశ్లేషిస్తున్నారు.

ఇంత‌కీ ఆ రోజు జాన్ ఏమ‌న్నాడు?ఇటీవ‌లి కాలంలో హిందీ ప‌రిశ్ర‌మ‌ను ఛాలెంజ్ చేస్తూ.. అక్క‌డ ఖాన్ ల‌నే  క‌ల‌వ‌ర‌పెట్టే రేంజుకు తెలుగు సినిమా ఎదిగేస్తోంది. పైగా మ‌న స్టార్ హీరోలు అక్క‌డా బంప‌ర్ హిట్లు అందుకుంటూ కాంపిటీష‌న్ గా మారుతున్నారు. ఇది నిజానికి బాలీవుడ్ హీరోల‌కు న‌చ్చ‌డం లేదు. ఇంకా బింకం ప్ర‌ద‌ర్శిస్తూనే ఉన్నారు. జాన్ అబ్రహం ఏమ‌న్నారంటే.. తాను ఎప్పటికీ తెలుగు లేదా ప్రాంతీయ సినిమా చేయనని చెప్పాడు. నేను హిందీ సినిమా హీరోని అంటూ గొప్ప‌ల‌కు పోయాడు. యాక్ష‌న్ తో కూడుకుని ఒక రకమైన చిత్రాలకు పేరుగాంచిన జాన్ అబ్రహం తన త‌దుప‌రి చిత్రం ఎటాక్ రిలీజ్ ప్ర‌మోష‌న్స్ లో ఈ కామెంట్ చేశాడు. ఒక తెలుగు సినిమాలో పని చేస్తున్నారనే పుకారు గురించి  మాట్లాడాడు.

ప్రభాస్ నటిస్తున్న స‌లార్ లో అతనికో పాత్ర ఉందని పుకారు గురించి మీడియా ప్ర‌శ్నించ‌గా.. "నేనెప్పుడూ ప్రాంతీయ సినిమా చేయను" అంటూ ఈగో చూపించాడు జాన్ భాయ్. నేను హిందీ సినిమా హీరోని. నేనెప్పుడూ అక్కడ సెకండ్ లీడ్ గా సినిమా చేయను. సినిమా వ్యాపారంలో ఉండాలనే ఉద్దేశ్యంతో నేను ఇతర నటీనటుల మాదిరి తెలుగు లేదా ఏ ప్రాంతీయ సినిమా చేయను.. అంటూ కాఠిన్యం ప్ర‌ద‌ర్శించాడు. నిజానికి అత‌డి టోన్ తెలుగు వారిని హ‌ర్ట్ చేసింది.  సెకండ్ లీడ్ అయితే స‌సేమిరా అనేశాడు.

కానీ అత‌డు ఈగో వదిలేస్తేనే.. పాన్ ఇండియా హీరో అవుతాడు! అంద‌రితో క‌లిసి న‌టిస్తే సౌత్ లోనూ పాపుల‌ర‌వుతాడు. లేదంటే హిందీ బెల్ట్ కే అంకితం కావాలి.. అంటూ విశ్లేషించారు. అయితే అంత‌గా గొప్ప‌ల‌కు వెళ్లినా కానీ జాన్ న‌టించిన ఎటాక్ హిట్ట‌వ్వ‌లేదు. ఆర్.ఆర్.ఆర్- కేజీఎఫ్ 2 ముందు ఐపు లేకుండా పోయింది. దీంతో అత‌డు తీవ్ర నిరాశ‌కు గుర‌య్యాడు. గ‌ర్వం నోరు జారేలా చేస్తుంది. దాని ప‌ర్య‌వ‌సానం కూడా అలానే ఉంటుంది అంటూ నెటిజ‌నుల్లో పెద్ద చర్చ కూడా సాగింది. అదీ సంగ‌తి.
Tags:    

Similar News