ప్రభాస్ లేకుండానే షూటింగ్ షురూ చేసేశారా..?

Update: 2022-09-21 01:30 GMT
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరియు ఎంటర్టైన్మెంట్ చిత్రాల దర్శకుడు మారుతి కాంబినేషన్‌ లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. పోయిన నెలలో చడీచప్పుడు లేకుండా ఈ ప్రాజెక్ట్ ని పూజా కార్యక్రమంతో లాంచ్ చేశారు. అయితే ఇప్పుడు ప్రభాస్ లేకుండానే సైలెంట్ గా రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది.

తాత్కాలికంగా ''రాజా డీలక్స్'' అనే టైటిల్ తో ప్రచారం చేయబడుతున్న ఈ సినిమా గురించి ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఏ అప్డేట్ ఇవ్వకుండానే పూజ చేశారు. ఇప్పుడు ప్రభాస్ సెట్స్ లో అడుగుపెట్టే పరిస్థితి లేనప్పటికీ.. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైందని రూమర్స్ వస్తున్నాయి.

ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న అందాల ముద్దుగుమ్మ మాళవిక మోహనన్ నటిస్తున్న సన్నివేశాలతో మారుతి షూటింగ్ ప్రారంభించారని అంటున్నారు. 'మాస్టర్' బ్యూటీ హైదరాబాద్ లో కనిపించడంతో ఈ వార్తలు ఊపందుకున్నాయి. ప్రభాస్ షూటింగ్‌ కి అనుమతి ఇచ్చి ఉండవచ్చని.. అందుకే మారుతి హీరో లేని సీన్స్ ని షూట్ చేస్తుండొచ్చని అంటున్నారు.

ఇదే నిజమైతే ఇటీవలి వ్యక్తిగత నష్టం నుండి కోలుకున్న తర్వాత డార్లింగ్ కూడా త్వరలో సెట్స్‌ లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. అయితే మారుతి ఈ సినిమాకు సంబంధించిన ఎటువంటి అప్‌డేట్ ఇవ్వకపోవడంపై ప్రభాస్ అభిమానులు నిరాశ చెందుతున్నారని తెలుస్తోంది.

నిజానికి మారుతితో ప్రభాస్ సినిమా చేస్తున్నాడని వార్తలు వచ్చినప్పుడే.. ఫ్యాన్స్ తమ హీరో నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ప్రస్తుతం భారీ పాన్ ఇండియా చిత్రాలను లైన్ లో పెట్టిన డార్లింగ్.. ఇప్పటి వరకు మీడియం రేంజ్ హీరోలను మాత్రమే హ్యాండిల్ చేసిన డైరెక్టర్ కు అవకాశం ఇవ్వడం ఏంటని అభిమానులు కామెంట్స్ చేశారు.

ఈ క్రమంలో మారుతి ని ట్రోల్ చేయడమే కాదు.. ఈ ప్రాజెక్ట్ ను క్యాన్సిల్ చేసుకోమని ప్రభాస్ కు సోషల్ మీడియా వేదికగా సూచించారు. అయితే ఈ సినిమాని లాంఛనంగా ప్రారంభించారని తెలిసినప్పటి నుంచి.. తమ హీరో ఓకే చేశాడంటే సినిమాలో ఏదో ప్రత్యేకత ఉంటుందని ఆలోచించడం మొదలుపెట్టారు. మారుతి ఎలాంటి సినిమా ప్లాన్ చేసాడు.. ప్రభాస్ పాత్ర ఎలా ఉంటుంది అని ఆతృతగా వేచి చూస్తున్నారు.

అయితే ఇదొక హారర్ కామెడీ థ్రిల్లర్ అని సోషల్ మీడియాలో ఊహాగానాలు ఉన్నాయి. ఇందులో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తారని అంటున్నారు. మాళవిక మోహనన్ తో పాటుగా మరో ఇద్దరు హీరోయిన్లు ఈ సినిమాలో భాగం అవుతారని టాక్.

ఇదిలా ఉంటే ప్రభాస్ - మారుతి ప్రాజెక్ట్ ని డీవీవీ దానయ్య నిర్మిస్తారని మొదటి నుంచీ ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ వెనక్కి తగ్గడంతో మరో ప్రొడక్షన్ హౌస్ ఈ సినిమాని బ్యాంక్ రోల్ చేస్తున్నారని రూమర్స్ వస్తున్నాయి. ఈ చిత్రాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తే అన్ని విషయాలపై క్లారిటీ వస్తుంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News