'మా' లో సినిమాని కొట్టేసే ర‌స‌వ‌త్త‌ర నాట‌కం

Update: 2019-09-16 12:47 GMT
`మా` అసోసియేష‌న్ నాట‌కం ర‌క‌ర‌కాల మ‌లుపులు తిరుగుతూ ర‌స‌వ‌త్త‌రంగా మారుతోంది. కొత్త క‌మిటీ ఎన్నికై ప్ర‌మాణ స్వీకారాల రోజునే గొడ‌వ‌ల లొల్లి బ‌య‌ట‌ప‌డ‌డం... కొత్త అధ్యక్షుడిపై ఉపాధ్య‌క్షులు- ఈసీ స‌భ్యులు స‌హా అంతా విరుచుకుప‌డ‌డం తెలిసిందే. తాజాగా గ‌త వారం రోజులుగా 800 మంది ఆర్టిస్టులున్న `మా`లో జ‌రుగుతున్న ప‌రిణామాలపై ప్ర‌ముఖంగా చ‌ర్చ సాగుతోంది. ఉన్న‌ట్టుండి కొత్త అధ్య‌క్షుడిపై క‌మిటీ తిరుగుబావుటా అంటూ ప్ర‌చారం మొద‌లైంది.

ఆరు నెల‌లు కూడా పూర్తి కాకుండానే `మా` అసోసియేష‌న్ స‌భ్యుల్లో లుక‌లుక‌లు మ‌రోసారి హీట్ పెంచుతున్నాయి.  `మా` అధ్య‌క్షుడు శివాజీ రాజాను మ‌రోసారి గ‌ద్దెనెక్కించ కూడ‌ద‌ని కంక‌ణం క‌ట్టుకున్న న‌రేష్ త‌న ప్లాన్ ప్ర‌కారం ఎత్తులు వేసి చివ‌రికి   `మా` అధ్య‌క్ష పీఠాన్ని చేజిక్కించుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే న‌రేష్ `మా` అధ్య‌క్షుడు కావ‌డం స‌భ్యుల్లో ఎవ‌రికీ ఇష్టం లేదన్న చ‌ర్చ సాగుతోంది. అధ్య‌క్షుడిపై న‌టి హేమ ప్రారంభ‌మే బాహాటంగా విమ‌ర్శ‌లు గుప్పించిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల ఎగ్జిక్యూటివ్ ఉపాధ్య‌క్షుడు రాజ‌శేఖ‌ర్ అధ్య‌క్ష‌త‌న మా మీటింగ్ జ‌ర‌గ‌డం అనంత‌ర ప‌రిణామాలు చ‌ర్చ‌కొచ్చాయి.  తాజాగా ఈసీ స‌భ్యుడు ఏ.ల‌క్ష్మీనారాయ‌ణ మా స‌భ్యుల‌పై సివిల్ కోర్టును ఆశ్ర‌యించ‌డం సంచ‌ల‌నంగా మారింది. 

ఇటీవ‌ల `మా` అధ్య‌క్షుడు న‌రేష్ కు వ్య‌తిరేకంగా స‌భ్యుల్ని స‌మీక‌రించి ఉపాధ్య‌క్షుడు రాజ‌శేఖ‌ర్‌- జీవిత త‌దిత‌రులు స‌ర్వ‌స‌భ్య స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ఈ మీటింగ్ లో చ‌ర్చించిన అంశాల్ని బ‌హిర్గతం చేయ‌కుండా కీల‌క స‌భ్యులు జాప్యం చేస్తున్నార‌ని `మా` ఈసీ స‌భ్యుడు ల‌క్ష్మీనారాయ‌ణ సివిల్ కోర్టును ఆశ్ర‌యించారు. దీంతో `మా` అసోసియేష‌న్ కు సివిల్ కోర్టు నోటీసుల్ని పంపించింద‌ని తెలుస్తోంది. తాజా ప‌రిణామంతో అస‌లు `మా`లో అస‌లు ఏం జ‌రుగుతోంది అన్న చ‌ర్చా హీటెక్కిస్తోంది.
Tags:    

Similar News