రాజాసాబ్ నిర్మాతల 'గరివిడి లక్ష్మి' ప్రారంభం..!
గరివిడి లక్ష్మి.. ఈ పేరు ఉత్తరాంధ్ర జనాలకు బాగా సుపరిచితమే. గరివిడి లక్ష్మి బుర్రకథ అంటే ఒకప్పుడు విపరీతమైన క్రేజ్ ఉండేది.
టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ లలో 'పీపుల్ మీడియా ఫ్యాక్టరీ' ఒకటి. ఓవైపు భారీ బడ్జెట్ సినిమాలు నిర్మిస్తూనే, మరోవైపు లిమిటెడ్ బడ్జెట్ లో కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలు రూపొందిస్తూ మంచి అభిరుచి గల నిర్మాత అనిపించుకున్నారు టీజీ విశ్వ ప్రసాద్. ప్రస్తుతం ఈ బ్యానర్ లో 'ది రాజాసాబ్' తో సహా పలు ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్ రూపొందుతున్నాయి. ఇందులో భాగంగా తాజాగా ''గరివిడి లక్ష్మి'' అనే టైటిల్ తో తమ 48వ చిత్రాన్ని ప్రకటించారు.
గరివిడి లక్ష్మి.. ఈ పేరు ఉత్తరాంధ్ర జనాలకు బాగా సుపరిచితమే. గరివిడి లక్ష్మి బుర్రకథ అంటే ఒకప్పుడు విపరీతమైన క్రేజ్ ఉండేది. ఉత్తరాంధ్ర సాంస్కృతిక వారసత్వానికి గణనీయమైన కృషి చేసిన బుర్ర కథ కళాకారిణి గరివిడి లక్ష్మి జీవితం ఆధారంగానే ఇప్పుడు ''గరివిడి లక్ష్మి'' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ బయోగ్రఫికల్ డ్రామాలో తెలుగు హీరోయిన్ ఆనంది ముఖ్యమైన పాత్రను పోషించనుంది. 'సినిమా బండి' ఫేమ్ రాగ్ మయూర్, నరేష్ వీకే, రాశి, శరణ్య, మీసాల లక్ష్మణ్, అంకిత్ కొయ్యా, కిశోర్ కుమార్ తదితరులు కీలక పాత్రల్లో నటించనున్నారు.
''గరివిడి లక్ష్మి'' మూవీని ఆంధ్రప్రదేశ్ లోని ఆదోనిలో గ్రాండ్ గా లాంచ్ చేసారు. ఎమ్మెల్యే పార్ధసారధి ప్రధాన నటీనటుల మీద క్లాప్ కొట్టగా.. ఎమ్మెల్సీ మధు, మల్లప్ప నాయకర్ కెమెరా స్విచ్ ఆన్ చేసారు. ఈ సందర్భంగా టైటిల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసారు. సీనియర్ నటుడు నరేష్, ఆనంది, రాగ్ మయూర్, శరణ్య, నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని మేకర్స్ తెలిపారు.
'గరివిడి లక్ష్మి' చిత్రానికి గౌరీ నాయుడు జమ్మూ దర్శకత్వం వహిస్తున్నారు. టీజి విశ్వ ప్రసాద్, ఆయన కుమార్తె టిజి కృతి ప్రసాద్ ఈ ప్రాజెక్ట్ ను నిర్మిస్తున్నారు. గరివిడి లక్ష్మి స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నారు. సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న కీలకమైన సమస్యలను, సామాజిక పోరాటాలు వంటి సెన్సిటివ్ టాపిక్స్ ని చర్చించబోతున్నారు. వివేక్ కూచిబొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి చరణ్ అర్జున్ సంగీతం సమకూరుస్తున్నారు. జె ఆదిత్య సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడికానున్నాయి.