అఖిల్ స్ట్రాంగ్ లైనప్.. కానీ ఎవరు ముందు?

అఖిల్ అక్కినేని కెరీర్ గత కొన్ని సంవత్సరాలుగా చాలా అప్‌డౌన్స్ చూస్తున్నాడు.;

Update: 2025-03-10 15:30 GMT

అఖిల్ అక్కినేని కెరీర్ గత కొన్ని సంవత్సరాలుగా చాలా అప్‌డౌన్స్ చూస్తున్నాడు. అక్కినేని వారసుడిగా భారీ అంచనాలతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చినా, వరుస పరాజయాలు అతని మార్కెట్‌ను బాగా దెబ్బతీశాయి. ముఖ్యంగా ఏజెంట్ భారీ అంచనాల మధ్య విడుదలై, ఊహించని స్థాయిలో డిజాస్టర్ అవ్వడం అతనికి బిగ్ షాక్ లాంటిది. ఆ సినిమా తర్వాత అఖిల్ మళ్లీ పబ్లిక్ అప్పియరెన్స్‌లకు దూరంగా ఉంటూ, కొత్త సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడనే టాక్ ఉంది.

ఇప్పటికే UV క్రియేషన్స్ బ్యానర్‌లో ఒక సినిమా, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌లో మరో సినిమా లైనప్‌లో ఉన్నాయి. అయితే వీటిలో ఏ సినిమా ముందు సెట్స్‌పైకి వెళ్తుందో ఇంకా స్పష్టత రాలేదు. అన్నపూర్ణ స్టూడియోస్‌లోని ప్రాజెక్ట్ వచ్చే ఏడాది జనవరిలో మొదలవ్వొచ్చని సమాచారం. కానీ ఇంకా ప్రీ-ప్రొడక్షన్ పనులు సరిగా స్టార్ట్ కాలేదు. UV క్రియేషన్స్ ప్రాజెక్ట్ కూడా పూర్తిగా లాక్ కాలేదు.

ఇదిలా ఉండగా, ఇప్పుడు కొత్తగా అఖిల్‌కు మరో ఆసక్తికరమైన ఆఫర్ వచ్చింది. స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ స్వయంగా నాగార్జున, అఖిల్‌ను కలిసి ఒక కథ వినిపించినట్లు టాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పూరీ ఇటీవల లైగర్, డబుల్ ఐస్మార్ట్ సినిమాలతో తీవ్రంగా నిరాశపరిచాడు. కానీ ఇప్పుడిప్పుడే తన రైటింగ్ స్టైల్‌లో మార్పులు చేసుకుంటూ మళ్లీ ట్రాక్‌లోకి రావడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆయన కథ వినిపించడమే కాకుండా, ఇది అఖిల్‌కు సరైన మాస్ మేకోవర్ ఇస్తుందనే కాన్సెప్ట్‌తో ముందుకొచ్చాడట.

ఈ మూడు సినిమాలే కాకుండా, మురళీ కిషోర్ అబ్బూరుతో చేయబోయే ప్రాజెక్ట్ గురించి కూడా బజ్ ఉంది. చిత్తూరు బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్ యాక్షన్ లవ్ డ్రామాగా రూపొందే ఈ సినిమాపై కూడా నాగార్జున ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నట్లు టాక్. అలాగే ఈ సినిమాను UV క్రియేషన్స్‌తో కలిసి నిర్మించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఫలితంగా అఖిల్ కోసం మూడు కాకుండా నాలుగు ఆఫర్లు లైనప్‌లో ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఈ స్థితిలో అఖిల్ ఏ ప్రాజెక్ట్‌ను ఫస్ట్ లాక్ చేయబోతాడనేది ఇప్పుడిప్పుడే హాట్ టాపిక్‌గా మారింది. పూరీ జగన్నాథ్ ప్రాజెక్ట్ మాస్ ఆడియన్స్‌ను టార్గెట్ చేయడం ఖాయం. UV క్రియేషన్స్ సినిమా ప్రొడక్షన్ పరంగా స్ట్రాంగ్‌గా ఉంటుందనేది మరో ప్లస్. అన్నపూర్ణ బ్యానర్‌లో మూవీ అయితే అఖిల్ కెరీర్‌ కు మరో బూస్ట్ లాంటిది. ఏది తీసుకున్నా, ఈసారి అఖిల్ ఓ హిట్ కొట్టి స్టాండర్డ్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది. మొత్తానికి, మూడు కాదు.. నాలుగు సినిమాలు లైనప్‌లో ఉన్నప్పటికీ, అఖిల్ ఏది మొదట సెట్స్‌పైకి తీసుకెళ్తాడనేది చూడాలి.

Tags:    

Similar News