'అవతార్'లో 18కోట్ల ఆఫర్.. గోవిందాపై మళ్లీ ట్రోలింగ్
అయితే 410 రోజుల కాల్షీట్లు ఇవ్వాలని కోరడమే గాక, 18 కోట్ల పారితోషికం ఆఫర్ చేసారు. అన్నిటికీ ఓకే అనుకున్నాక, పాత్ర కోసం శరీరాన్ని పెయింటింగ్ చేసుకోవాల్సి ఉంటుందని కామెరూన్ చెప్పారు.;
అవతార్ 2 రిలీజ్ సమయంలో ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ వెటరన్ స్టార్ గోవిందా వ్యాఖ్యలు హాట్ టాపిగ్గా మారాయి. గోవిందాను నెటిజనులు ట్రోల్ చేస్తూ 'గోవిందావతార్' గా మార్చి ఆ ఫోటోలను వైరల్ చేసారు. దానికి కారణం జేమ్స్ కామెరూన్ అవతార్ పాత్ర కోసం తనను ఎంపిక చేసుకున్నారని, ఆయనతో కలిసి డిన్నర్ చేసానని ప్రకటించడంతో దానిపై నెటిజనులు కామెడీలు చేసారు.
కేవలం శరీరంపై బ్లూ పెయింట్ వేసుకోవాల్సి ఉంటుందని చెప్పడంతో రూ.18 కోట్ల పారితోషికం ఆఫర్ చేసినా ఆ పాత్రను కాదనుకున్నానని గోవిందా అప్పట్లో వ్యాఖ్యానించారు. జేమ్స్ కామెరూన్ కి 'అవతార్' అనే టైటిల్‌ను సూచించింది తానేనని.. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని 9 ఏళ్ల క్రితమే అంచనా వేసానని గోవిందా త్రోబ్యాక్ వీడియోలో చెప్పాడు. అది చాలా కాలంగా యూట్యూబ్ లో షికార్ చేస్తోంది.
ఇప్పుడు మరోసారి గోవిందా అదే విషయాన్ని ధృవీకరించారని ప్రముఖ పత్రికలో కథనం వెలువడింది. గోవిందా మాట్లాడుతూ.. అమెరికాలో ఉన్న సర్ధార్ జీకి ఒక బిజినెస్ ఐడియా ఇవ్వగా, ఆయన తనను కామెరూన్ వద్దకు తీసుకెళ్లారని, దిగ్గజ దర్శకుడితో డిన్నర్ చేసిన అనంతరం అవతార్ లో పాత్రను ఆఫర్ చేసారని గోవిందా చెప్పారు. అయితే 410 రోజుల కాల్షీట్లు ఇవ్వాలని కోరడమే గాక, 18 కోట్ల పారితోషికం ఆఫర్ చేసారు. అన్నిటికీ ఓకే అనుకున్నాక, పాత్ర కోసం శరీరాన్ని పెయింటింగ్ చేసుకోవాల్సి ఉంటుందని కామెరూన్ చెప్పారు. కానీ దానికి గోవిందా అంగీకరించలేదు. అలా ఆ ఆఫర్ ను వదులుకున్నానని చెప్పారు. మీ 18 కోట్లు నాకు వద్దు.. అలా పెయింటింగ్ వేసుకుంటే ఆస్పత్రి పాలవ్వాల్సి వస్తుందని ఆఫర్ ని తిరస్కరించినట్టు గోవిందా చెప్పారు. ఆ తర్వాత ఆ పాత్రలో నటించిన నటుడిని చూసి ఆశ్చర్యపోయానని, అంత బాగా నటించాడని కూడా గోవిందా అన్నారు.
అయితే గోవిందా చెప్పింది నిజమా కాదా? అంటూ తెలివైన నెటిజనులు గతంలో చాలా ఆరాలు తీసారు. వాస్తవానికి గోవిందా ఒక విషయంలో దొరికిపోయారు. అవతార్ లో ఏ పాత్రకు కూడా బాడీ పెయింటింగ్ వేయలేదు. వేయాల్సిన అవసరం కూడా లేదు. ఆ మాటకొస్తే ఈ భారీ చిత్రంలో బాడీ పెయింట్ తో పని లేకుండా పండోరా ప్రజల నీలిరంగు చర్మం CGI .. మోషన్ క్యాప్చర్ టెక్నిక్ ద్వారా సృష్టించారు. కేవలం గ్రీన్ మ్యాట్ బ్లూమ్యాట్ లో చిత్రీకరణ సాగుతుంటే, తెరవెనక ఒరిజినల్ స్టార్లు మూవ్ మెంట్స్ ఇవ్వాలి అంతే. కాబట్టి గోవిందా ప్రకటనను ప్రజలు నమ్మలేదు. అందువల్ల నెటిజనులు గోవిందాను ఒక రేంజులో ఆడుకున్నారు. అతడి త్రోబ్యాక్ వీడియోను షేర్ చేస్తూ దానికి ఉల్లాసకరమైన కామెంట్లతో చెలరేగారు.
ఈ ఏడాది చివరిలో అవతార్ 3 విడుదలకు సిద్ధమవుతుండగా, గోవిందా తాజా వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. మరోసారి గోవిందావతార్ గా మార్చి అతడిపై ట్రోలింగ్ స్టార్ట్ చేస్తారేమో!