భలే భలే: దిల్ రాజుతో దిల్ రాజుకే పోటీ

Update: 2016-01-05 11:30 GMT
నందమూరి హీరోలిద్దరూ ఒక రోజు వ్యవధిలో బాక్సాఫీస్ పోటీకి దిగుతారని మనం ఇంతకముందు ఎప్పుడైనా అనుకున్నామా? ఈ సంక్రాంతికి అదే జరగబోతోంది. ఇలాంటి విచిత్ర పరిణామం ఈ సంక్రాంతికి మరొకటి జరగబోతోంది. దిల్ రాజు దిల్ రాజుతోనే పోటీ పడబోతున్నాడు. అయినా దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన సినిమాలేవీ సంక్రాంతి రేసులో లేవు కదా అనుకుంటున్నారా? ఆయన సంక్రాంతి బరిలో నిలుస్తోంది నిర్మాతగా కాదు.. డిస్ట్రిబ్యూటర్‌ గా. ఒక రోజు వ్యవధిలో దిల్ రాజు రెండు సినిమాల ద్వారా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు రాజు.

డిక్టేటర్ నైజాం రైట్స్ రాజు తీసుకున్నాడన్నది పాత వార్తే. ఇప్పుడు ‘ఎక్స్ ప్రెస్ రాజా’ సినిమాను కూడా నైజాంలో ఆయనే విడుదల చేస్తున్నాడు. యువి క్రియేషన్స్ వాళ్లు ఇంత ధైర్యంగా సంక్రాంతి రేసులో నిలుస్తుంటే ఏంటా కాన్ఫిడెన్స్ అనుకున్నాం కానీ.. దానికి కారణం దిల్ రాజు అని ఆలస్యంగా తెలిసింది. నైజాంలో మెజారిటీ థియేటర్లు దిల్ రాజు చేతిలోనే ఉంటాయి కాబట్టి అటు ‘డిక్టేటర్’కు, ఇటు ‘ఎక్స్ ప్రెస్ రాజా’కు ఈ ప్రాంతం వరకు థియేటర్ల సమస్య లేనట్లే. నిజానికి సంక్రాంతి రేసులో ఉన్న మరో సినిమా ‘నాన్నకు ప్రేమతో’ నైజాం రైట్స్ కోసం కూడా రాజు గట్టిగానే ట్రై చేశాడు. ఐతే అభిషేక్ పిక్చర్స్ వాళ్లు ఫ్యాన్సీ ప్రైస్ ఇచ్చి  ఆ సినిమాను కొనేశారు. లేకుంటే సంక్రాంతి రేసులో రాజువే మూడు సినిమాలుండేవేమో. మరి సంక్రాంతికి తనతో తనే పోటీ పడుతున్న రాజు.. ఎలాంటి ఫలితాన్నందుకుంటాడో చూడాలి.
Tags:    

Similar News