దిల్ రాజు ఆశల్ని తుంచేసిన సోమవారం

Update: 2018-08-14 07:13 GMT
గత గురువారం మంచి అంచనాల మధ్య విడుదలైన ‘శ్రీనివాస కళ్యాణం’ ఆ అంచనాల్ని అందుకోవడంలో విఫలమైంది. ఈ చిత్రానికి తొలి రోజు డివైడ్ టాక్ వచ్చింది. వసూళ్లు కూడా అందుకు తగ్గట్లే వచ్చాయి. ఓ మోస్తరు ఓపెనింగ్స్ తో సరిపెట్టుకుందీ చిత్రం. రెండో రోజు వసూళ్లలో డ్రాప్ కనిపించడంతో సినిమా గట్టెక్కడం కష్టమే అని తేలిపోయింది. సినిమాకు ఉన్న డివైడ్ టాక్ కు తోడు.. వర్షాలు కూడా వసూళ్లపై ప్రభావం చూపాయి. ఐతే శని.. ఆదివారాల్లో వసూళ్లు కొంచెం పుంజుకోవడంతో దిల్ రాజు అండ్ టీంలో ఉత్సాహం వచ్చింది. ఈ విషయమై దిల్ రాజు ప్రమోషన్లతో చాలా ఉత్సాహంగా మాట్లాడాడు. సినిమా గురించి అందరూ పాజిటివ్ గానే మాట్లాడుతున్నారని.. వసూళ్లు కూడా పుంజుకున్నాయని.. సినిమా హిట్ కేటగిరిలో చేరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశాడు రాజు.

కానీ సోమవారం నాటి వసూళ్లు ఆయన ఆశల్ని తుంచేశాయి. వీకెండ్ వరకు ఏదో అలా హోల్డ్ చేయగలిగిన ‘శ్రీనివాస కళ్యాణం’ సోమవారం నిలవలేకపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆక్యుపెన్సీ ఒక్కసారిగా పడిపోయింది. 30 శాతానికి మించి ఎక్కడా ఆక్యుపెన్సీ లేదు. వసూళ్లు కూడా నామమాత్రంగా వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. షేర్ కోటి రూపాయల్లోపే ఉన్నట్లు తెలుస్తోంది. తొలి వారాంతంలో రూ.9 కోట్ల లోపే షేర్ రాబట్టింది ‘శ్రీనివాస కళ్యాణం’. ఇది రావాల్సిన షేర్ లో మూడో వంతు మాత్రమే. ఈ వారమంతా కూడా సినిమా బాగా ఆడితే తప్ప బయ్యర్లు బయటపడే పరిస్థితి లేదు. కానీ సోమవారం పరిస్థితి తీవ్ర నిరాశకు గురి చేసింది. రెండో వీకెండ్ మీద పెద్దగా ఆశలు పెట్టుకునే పరిస్థితి కూడా లేదు. బుధవారమే మంచి క్రేజ్ మధ్య ‘గీత గోవిందం’ రిలీజవుతోంది. ఆ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ‘శ్రీనివాస కళ్యాణం’ కథ ముగిసినట్లే. బయ్యర్లకు భారీ నష్టాలు తప్పవు.
Tags:    

Similar News