దిల్ రాజు ప్రొడ్యూసర్ గా ఫెయిల్.. డిస్ట్రిబ్యూటర్ గా సక్సెస్..!

Update: 2022-11-26 00:30 GMT
ప్రస్తుతం టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు.. గత రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో తన హవా కొనసాగిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద ఓవైపు పెద్ద హీరోలతో సినిమాలు నిర్మిస్తూనే మరోవైపు చిన్న మీడియం రేంజ్ చిత్రాలు చేస్తున్నారు. అలానే డిస్ట్రిబ్యూటర్ గా ఎగ్జిబిటర్ గానూ రాణిస్తున్నారు. అయితే ఒకప్పుడు వరుస హిట్లు అందుకున్న దిల్ రాజు.. గత కొన్నాళ్లుగా ప్రొడ్యూసర్ గా ఆశించిన విజయాలు సాధించలేకపోతున్నారు.

2022 లో దిల్ రాజు నిర్మించిన సినిమాలను గమనిస్తే.. తన ఫ్యామిలీ హీరో ఆశిష్ రెడ్డిని లాంచ్ చేస్తూ 'రౌడీ బాయ్స్' అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా విదులైన ఈ సినిమా పరాజయం పాలైంది. అలానే అక్కినేని నాగచైతన్య హీరోగా తెరకెక్కించిన 'థాంక్యూ' సినిమా నిర్మాతకు నష్టాలనే మిగిల్చింది.

అలానే తన ఫస్ట్ బాలీవుడ్ వెంచర్ 'జెర్సీ' కూడా తీవ్ర నిరాశను మిగిల్చింది. ఇదే క్రమంలో వచ్చిన 'హిట్' హిందీ రీమేక్ కూడా బాక్సాఫీస్ వద్ద అంతగా పనిచేయలేదు. అయితే దిల్ రాజు ప్రొడక్షన్ లో వచ్చిన చిత్రాలలో 'ఎఫ్ 3' మూవీ కాస్త పర్వాలేదనిపించింది. కాకపోతే 'ఎఫ్ 2' తో పోల్చి చూస్తే మాత్రం ఆ స్థాయిలో వసూళ్ళు సాధించలేదనే చెప్పాలి.

ఇలా ఈ సంవత్సరం నిర్మాతకు అనుకున్న విధంగా జరగలేదనే అనుకోవాలి. ఒక సినిమా మోస్తరుగా ఆడితే.. మిగతా చిత్రాలన్నీ ఫెయిల్యూర్స్ గా నిలిచాయి. అయితే దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్ గా మాత్రం లాభాలు అందుకుంటున్నారు.

పవన్ కళ్యాణ్ నటించిన 'భీమ్లా నాయక్' చిత్రాన్ని దిల్ రాజు నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేసారు. ఈ సినిమా మిగతా ఏరియాల్లో ఆశించిన కలెక్షన్స్ రాబట్టనప్పటికీ.. నైజాంలో సత్తా చాటింది. దీంతో 5 కోట్ల వరకూ లాభాలు వచ్చాయి.

ఇదే క్రమంలో ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన RRR చిత్రాన్ని తన ఏరియాలో విడుదల చేసారు. బాక్సాఫీస్ వద్ద బిగెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ ఫిక్షనల్ యాక్షన్ డ్రామా.. దిల్ రాజుకు 40 కోట్లకు పైగానే ప్రాఫిట్స్ తెచ్చిపెట్టింది. 'పొన్నియన్ సెల్వన్ 1' సినిమా అనుకున్నంత చేయకపోయినా.. పర్వాలేదనిపించింది.

ప్రశాంత్ నీల్ మరియు యష్ కాంబోలో రూపొందిన 'KGF 2' చిత్రాన్ని దిల్ రాజు నైజాంలో రిలీజ్ చేసారు. దీని వల్ల దాదాపు 18 కోట్ల వరకూ లాభం చేకూరినట్లుగా టాక్ ఉంది. అలానే కళ్యాణ్ రామ్ నటించిన 'బింబిసార' సినిమాని నైజాం మరియు ఆంధ్రా ప్రాంతంలో విడుదల చేసి, 11 కోట్లకు పైగానే ప్రాఫిట్ అందుకున్నారు.

SVC డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఇటీవల విడుదల చేసిన 'మాసూద' వంటి చిన్న సినిమా కూడా దిల్ రాజుకు లాభాలు తెచ్చిపెడుతోంది. ఈ విధంగా డిస్ట్రిబ్యూటర్ గా దిల్ రాజుకు మెజారిటీ సినిమాలు ప్రాఫిటబుల్ వెంచర్స్ గా నిలిచాయి. 'బీస్ట్' వంటి ఒకటీ రెండు సినిమాలు కొంచం నష్టం చేకూర్చినా.. మిగతా చిత్రాలు బాగా వసూలు చేయడంతో అవి కవర్ అయిపోయాయి.

దిల్ రాజు ప్రస్తుతం 'వారసుడు' మరియు 'RC15' వంటి రెండు భారీ ప్రాజెక్ట్స్ మీద పూర్తిగా దృష్టి సారించారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'వారిసు' చిత్రాన్ని 2023 సంక్రాంతి సందర్భంగా విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇది దిల్ రాజుకు ఫస్ట్ స్ట్రెయిట్ తమిళ్ ప్రాజెక్ట్. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమాని తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేయనున్నారు.

అలానే రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఓ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ను నిర్మిస్తున్నారు. ఇది దిల్ రాజు నిర్మాణంలో ఫస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్. అంతేకాదు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో 50వ చిత్రం. అందుకే బడ్జెట్ కు ఏమాత్రం వెనకాడకుండా.. ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మరి ఈ రెండు చిత్రాలు దిల్ రాజుకు నిర్మాతగా ఎలాంటి అనుభవాన్ని మిగులుస్తాయో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News