మారుతి మొహమాటపడ్డా.. దిల్ రాజు పడలేదు

Update: 2016-06-30 12:10 GMT
దిల్ రాజును టాలీవుడ్లో అందరూ జడ్జిమెంట్ కింగ్ అని పిలుస్తారు. ఆయన కెరీర్లోనూ ఫ్లాపులు లేకపోలేదు కానీ.. ఓ కథ విని అది వర్కవుటవుతుందా లేదా.. ఓ సినిమా ప్రివ్యూ చూసి అది ఆడుతుందా లేదా అని చెప్పడంలో దిల్ రాజు దిట్ట అనే భావిస్తారందరూ. అందుకే కొందరు పేరున్న నిర్మాతలు సైతం దిల్ రాజుకు తమ సినిమాను చూపించి జడ్జిమెంట్ అడుగుతారు. ఆయనేమైనా మార్పులు చెబితే చేస్తారు. తన సినిమాల ఔట్ పుట్ విషయంలోనూ ఏదైనా తేడా ఉంటే.. విడుదలకు ముందు మార్పులు చేర్పులు చేయడానికి దిల్ రాజు సందేహించడు. తాను సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ‘రోజులు మారాయి’ విషయంలోనూ రాజు అలాగే చేశాడట.

‘రోజులు మారాయి’ ఫైనల్ వెర్షన్ నిడివి 2 గంటల 25 నిమిషాలు తేలిందట. ఐతే ఈ రోజుల్లో జనాలు రెండున్నర గంటల సినిమాల్ని పెద్దగా ఆదరించట్లేదన్న ఉద్దేశంతో రాజు ఈ సినిమా నిడివిని 15 నిమిషాలు తగ్గించాలని సూచించాడట. సినిమా ద్వితీయార్ధంలో లాగ్ అనిపించిన కొన్ని సన్నివేశాల్ని దిల్ రాజు సూచన మేరకే తొలగించినట్లు ఈ చిత్రానికి కథ-స్క్రీన్ ప్లే అందించిన మరో నిర్మాత మారుతి వెల్లడించాడు. సినిమా నిడివి తగ్గించే విషయంలో తాము మొహమాట పడ్డా రాజు మాత్రం పడలేదంటున్నాడు మారుతి. దిల్ రాజు చెప్పినట్లు సినిమాను ఎడిట్ చేశాక సినిమా మరింత క్రిస్ప్ గా తయారైందని.. సినిమా ఎక్కడా బోర్ కొట్టించే అవకాశమే లేదని మారుతి అంటున్నాడు. మురళీ కృష్ణ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన ఈ చిత్రం శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Tags:    

Similar News